Share News

రైతుల్లో తుఫాన్‌ కలవరం

ABN , Publish Date - Oct 25 , 2025 | 10:51 PM

మొంతా తుఫాన్‌ ప్రభావం జిల్లాపై ఉంటుందని వాతావరణశాఖ హెచ్చరించింది.

 రైతుల్లో తుఫాన్‌ కలవరం
పార్వతీపురంలో కోతకు సిద్ధంగా ఉన్న వరి పంట

-కోత దశలో వరి పంట

-అధిక వర్షాలు పడితే నష్టం తప్పదు

- యంత్రాంగం అప్రమత్తం.. అధికారులకు సెలవులు రద్దు

-కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు

పార్వతీపురం, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): మొంతా తుఫాన్‌ ప్రభావం జిల్లాపై ఉంటుందని వాతావరణశాఖ హెచ్చరించింది. రాబోయే 72 గంటల్లో జిల్లాలో భారీ వర్షాలు కురవడంతో పాటు ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరికలు జారీచేయడంతో రైతుల్లో కలవరం మొదలైంది. అధిక వర్షాలు పడితే పంటలకు నష్టం తప్పదని ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో ఈ ఖరీఫ్‌లో 1.76 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగింది. 2.5 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా. ఇప్పటికే వరి పంట కోత దశకు చేరుకుంది. మరో వారం పది రోజుల్లో కోతలు ప్రారంభంకానున్నాయి. ఈ తరుణంలో తుఫాన్‌తో భారీ వర్షాలు పడితే వేలాది ఎకరాల్లో పంట ముంపు బారిన పడే ప్రమాదం ఉందని రైతులు కలవరపడుతున్నారు. ఇప్పటికే అడపాదడపా కురుస్తున్న వర్షాలతో పత్తి రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. తడిసిపోయిన పత్తిని వీధుల్లో ఆరబెడుతున్నారు. తుఫాన్‌ ముప్పు నేపథ్యంలో క్షేత్రస్థాయిలో యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని జాయింట్‌ కలెక్టర్‌ సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. జిల్లా, మండల స్థాయి అధికారులు, సిబ్బందికి కలెక్టర్‌ సెలవులను రద్దు చేసినట్టు ఆయన చెప్పారు. ఈ మేరకు శనివారం కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశం నిర్వహించారు. చెట్లు, టవర్లు, స్తంభాల కింద, పొలాలు, బహిరంగ ప్రదేశాలు, శిథిలావస్థలో ఉన్న భవనాలు, గృహాల్లో ఎవరూ ఉండకుండా చూడాలని ఆదేశించారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రజలు స్నానాలు చేయడం, బట్టలు ఉతకడం, పశువులను కడగడం, చేపలను పట్టడం, ఇసుక తవ్వడం వంటి పనులు చేయరాదన్నారు. పునరావాస కేంద్రాల గుర్తింపుతో పాటు ఆహారం ఏర్పాట్లలో తహసీల్దార్లు సిద్ధంగా ఉండాలన్నారు. ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందం సీతంపేట మండలంలో ఉండేలా చూసుకోవాలన్నారు. ముఖ్యంగా రెవెన్యూ, పంచాయతీ, విద్యుత్‌, తాగునీటి సరఫరా, పారిశుధ్య, వైద్య ఆరోగ్యం తదితర శాఖలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. సబ్‌ కలెక్టర్‌ ఆర్‌.వైశాలి కూడా తన చాంబర్‌లో అధికారులతో సమీక్షించి వారిని అప్రమత్తం చేశారు.

తుఫాన్‌ నేపథ్యంలో కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసినట్టు కలెక్టర్‌ ఎస్‌.ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. ప్రజలకు ఏ అవసరం ఉన్నా కంట్రోల్‌ రూమ్‌ నెంబర్‌ 08963 796085కు ఫోన్‌ చేయాలన్నారు. వెంటనే సహాయక చర్యలు చేపడతామని తెలిపారు. రానున్న మూడు రోజులూ అన్ని శాఖల అధికారులు, సిబ్బంది మండల కేంద్రాల్లో ఉండాలని ఆదేశించారు.

వర్షంతో ఇబ్బందులు..

భామిని, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): మండలంలో శనివారం వర్షం పడడంతో మొక్కజొన్న, పత్తి రైతులు ఇబ్బందులు పడ్డారు. నేరడి, భామిని, సింగిడి, బురుజోల, పసుకుడి, దిమ్మిడిజోల, ఘనసర తదితర గ్రామాల్లో రోడ్డు పక్కన, ఖాళీ ప్రదేశాల్లో మొక్కజొన్న గింజలు, దూదిని ఆరబెట్టారు. అయితే, వర్షం కురవడంతో మొక్కజొన్న, దూది తడిసిపోకుండా వాటిపై టార్పాలిన్లు కప్పారు.

Updated Date - Oct 25 , 2025 | 10:51 PM