Share News

Storm tension తుఫాన్‌ టెన్షన్‌

ABN , Publish Date - Nov 30 , 2025 | 12:15 AM

Storm tension

Storm tension తుఫాన్‌ టెన్షన్‌
బొబ్బిలి: రంగరాయపురంలో పంటను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్న రైతులు

తుఫాన్‌ టెన్షన్‌

వరి కోతలు చేపట్టిన రైతుల్లో ఆందోళన

పంటను సంరక్షించే పనిలో నిమగ్నం

ప్రత్యామ్నాయ మార్గాలపై సలహాలు ఇస్తున్న అధికారులు

ఇంకో వారం గడిస్తే ధాన్యం అమ్మకం కూడా పూర్తవుతుందని అన్నదాతలు అనుకుంటున్న సమయంలో తుఫాన్‌ వార్తలు చెవిన పడడంతో టెన్షన్‌ పడుతున్నారు. వాన పడితే గనుక కోతలవుతున్న వారు, చేలను ఆరబెట్టిన వారు ఇబ్బంది పడతారు. దిత్వా తుఫాన్‌ ఏపీ వైపు రావొచ్చునని వాతావరణ విభాగం చెబుతోంది. దక్షిణ కోస్తా-పుదుచ్చేరి మధ్య తుఫాను తీరం దాటనుందని తెలిపింది. దీని ప్రభావంతో శనివారం అర్ధరాత్రి నుంచి వర్షాలు కరుస్తాయంటోంది. దక్షిణ కోస్తాతో పోల్చుకుంటే ఉత్తర కోస్తాకు ప్రభావం చూపదని చెబుతున్నా.. గత అనుభవాల దృష్ట్యా ఆందోళన చెందుతున్నారు.

విజయనగరం/బొబ్బిలి, నవంబరు 29(ఆంధ్రజ్యోతి):

జిల్లా వ్యాప్తంగా వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. దాదాపు చివరి దశకు వచ్చేశాయి. ఈ సమయంలో చురుగ్గా జరగాల్సిన ధాన్యం కొనుగోలు తంతు నత్తనడకన సాగుతోంది. వర్షాలు పడితే ఇబ్బందికర పరిస్థితులు తప్పవని రైతులు భయపడుతున్నారు. కోతలవుతున్న వారు వరి పనలను సంరక్షించే పనిలో పడ్డారు. డిసెంబరు 2, 3 తేదీల్లో వర్షాలు పడే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. సరిగ్గా నెల కిందట.. మొంథా తుఫాన్‌ జిల్లాను వణికించింది. అప్పట్లో ప్రభుత్వం ముందే అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పింది. ఇప్పటికీ వరి పంటకు కొంత నష్టం జరిగింది. విద్యుత్‌ శాఖకు కాస్త ఎక్కువగా నష్టం వాటిల్లింది. 43 కరెంటు స్తంభాలు నేలకూలాయి. జిల్లా వ్యాప్తంగా 116.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 1633 హెక్టార్టలో పంటలు నీట మునిగాయి. నాగావళి, చంపావతి, గోస్తనీ నదులు ఉప్పొంగాయి. 100 కిలోమీటర్ల మేర రోడ్లు వర్షాలకు దెబ్బతిన్నాయి. ఆ కష్టం నుంచి బయటపడిన ప్రజలు ఇప్పుడు మళ్లీ తుఫాన్‌ వార్తలు విని కలవరపడుతున్నారు. అయితే దక్షిణ కోస్తాకే ఎక్కువగా ప్రభావం ఉంటుందని.. ఉత్తరాంధ్రపై అంతగా ప్రభావం ఉండదని అధికారులు చెబుతుండడం ఉపశమనమే.

ఉపాధి కోల్పోతున్న మత్స్యకారులు

దిత్వా తుఫాన్‌ కారణంగా సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉంది. దీంతో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదని అధికారులు సూచించారు. ఇలా ప్రతి నెలలో విపత్తులతో మత్స్యకారులు తీరానికే పరిమితమవుతున్నారు. పూసపాటిరేగ, భోగాపురం మండలాల్లో 29 కిలోమీటర్ల పరిధిలో తీర ప్రాంతం ఉంది. వేలాది కుటుంబాలు ఈ వృత్తిపై ఆధారపడి బతుకుతున్నాయి. కొంతకాలంగా ఆశించిన స్థాయిలో చేపలవేట సాగడం లేదు. వరుస తుఫాన్లతో మత్స్యకారులు తీరానికే పరిమితమవుతున్నారు.

- వ్యవసాయశాఖ అధికారులు తుఫాన్‌పై ఊరూరా దండోరా వేసి హెచ్చరించిన నేపథ్యంలో చాలామంది రైతులు కోతలను ఆపేసుకున్నారు. మరికొంతమంది కోసిన పంటను పొలాల్లోనే కుప్పలుగా వేసుకొని వాటిపై టార్పాలిన్‌లతో కప్పుకున్నారు. నూర్పులు అయిపోయిన వారు ధాన్యాన్ని బస్తాల్లో నింపి భద్రపరుచుకుంటున్నారు.

రైతులను అప్రమత్తం చేశాం

మజ్జి శ్యామ్‌సుందర్‌, వ్యవసాయశాఖ అధికారి బొబ్బిలి

వాతావరణ విభాగం వారంరోజుల ముందునుంచే దిత్వా తుఫాన్‌ హెచ్చరికలు జారీ చేయడంతో కలెక్టర్‌ ఆదేశాలతో వ్యవసాయ శాఖ సిబ్బంది అప్రమత్తమయ్యారు. ప్రతి ఊరిలో దండోరా వేశాం. వరి, పత్తి పంటలను కోయవద్దని, కోసిన పంటలను జాగ్రత్త చేసుకోవాలని పదే పదే రైతులకు సూచనలిచ్చాం.

Updated Date - Nov 30 , 2025 | 12:15 AM