Share News

Storm tension తుఫాన్‌ కలవరం

ABN , Publish Date - Nov 26 , 2025 | 11:31 PM

Storm tension

Storm tension తుఫాన్‌ కలవరం
ఎస్‌.కోట మండలం శివరామరాజు పేట శివారు కాపుపాలెంలో కోతకు వచ్చిన వరి పొలం

తుఫాన్‌ కలవరం

హెచ్చరికలతో తర్జనభర్జన పడుతున్న రైతులు

కోతలు కొనసాగించాలో.. ఆపాలో తెలియక ఆందోళన

కొన్నిచోట్ల కుప్పలుగా వేస్తున్న అన్నదాతలు

గింజ ముగ్గిపోతుందని ఆందోళన

ఫ శృంగవరపుకోట మండలం శివరామరాజుపేట గ్రామ శివారు కాపుపాలెంకు వెళ్లే దారిలో పూర్తిగా పండిన వరి పంట చేనది. రెండు రోజుల్లో వర్షాలు పడే అవకాఽశం ఉందని వినిపిస్తున్న హెచ్చరికలతో చేనును కోయాలా? వద్దా? అని రైతు తర్జన భర్జన పడుతున్నాడు. కోసేస్తే వర్షానికి తడిసి ముద్దవుతుందని, కోయకుంటే గింజ రాలిపోతుందని భయపడుతున్నాడు.

ఫ వేపాడ మండలం బొద్దాం శివారు కొత్తబొద్దాంను ఆనుకుని ఉన్న పొలంలో వరి మొనలు సరిగా ఆరకుండానే ఆ రైతు కుప్పలుగా వేశాడు. వర్షాలు కురిస్తే పంట పాడవుతుందన్న భయంతో ఈ విధంగా చేశాడు. దీనివల్ల గింజలు ముక్కుతాయని ఆందోళన చెందుతున్నాడు.

శృంగవరపుకోట, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి):

తుఫాన్‌ హెచ్చరికలు చెవిన పడడంతో రైతులు అయోమయంలో పడ్డారు. పంటను కోసేస్తే ఓ రకమైన ఇబ్బంది.. కోయకుండా వదిలేస్తే మరో రూపంలో నష్టమని టెన్షన్‌ పడుతున్నారు. చేతికి అందిన పంటను ఏం చేయాలో అర్థంకాక ఆకాశం వైపు చూస్తున్నారు. కోసేసిన పంట వర్షానికి తడిసిపోకుండా కుప్పలు వేద్దామంటే గింజ పూర్తిగా ఆరలేదు. ఆరేవరకు ఆగుదామంటే వాతావరణంలో కనిపిస్తున్న మార్పులతో ఏ సమయంలో వర్షం పడుతుందో తెలియదు. ఈ పరిస్థితిలో ఏదైతే అది అయిందని పండిన పంటను కోసేస్తున్న వారు కొందరైతే, మరి కొందరు పంట మొనలు ఆరకుండానే కుప్పలు పెట్టేస్తున్నారు. ఈ గండం గట్టెక్కిన తరువాత తిరిగి వరి చేనును ఆరబెట్టుకోవచ్చనని తమలో తాము సమాధానపరుచుకుంటున్నారు.

జిల్లాలో ఈ ఏడాది వరి బాగా పండింది. అంచనాలను మించి దిగుబడులు వచ్చాయన్న సంతోషంలో రైతులున్నారు. అయితే గత నెలలో సంభవించిన తుఫాన్‌ కారణంగా కొంత నష్టపోయారు. ఇప్పుడు వాయుగుండం, అల్పపీడన ప్రభావంతో వర్షాలు పడితే మరింత నష్టం సంభవించే ప్రమాదం లేకపోలేదు. మలేసియా, మలక్కా జలసంధి పరిసరాల్లో ఏర్పడిన అల్పపీడనం రానున్న 48 గంటల్లో దక్షిణ బంగాళాఖాతంలో తుఫాన్‌గా మారే ప్రమాదం ఉందని ఐఎండీ ప్రకటించింది. దీని ప్రభావంతో ఈనెల 27, 28 తేదీల్లో ఉరుములతో కూడిన జల్లులు, 29న భారీ, ఈనెల 30న అతి భారీ వర్షాలు పడవచ్చునని అంచనా వేస్తోంది. దీనికి తోడు నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంక పరిసరాల్లో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారుతుండడంతో ఈ నెల 28 నుంచి వర్షాలు పడతాయని వినిపిస్తున్న హెచ్చరికలు రైతుల గుండెల్లో దడ పుట్టిస్తున్నాయి.

జిల్లాలో 1.20 లక్షల హెక్టార్లలో వరి నాట్లు పడ్డాయి. ఇంతవరకు 46వేల హెక్టార్లలో కోతలు కొలిక్కివచ్చినట్టు వ్యవసాయ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. మిగిలిన పంటంతా పూర్తి స్థాయిలో కోతకు సిద్ధగా ఉంది. ప్రస్తుతానికి వాతావరణం పొడిగా ఉండడంతో కొంత మంది రైతులు ధైర్యం చేసి వరి కోతలు చేపడుతున్నారు. దీంతో కూలీల డిమాండ్‌ పెరిగింది. ఎకరాకు రూ.8వేల నుంచి రూ.10 వేల వరకు డిమాండ్‌ చేస్తున్నారు. కోత యంత్రాలను వినియోగించేందకు కొన్ని పొలాల్లో కుదరడం లేదు. తడి బాగా ఉండడంతో యంత్రం దిగబడిపోతోంది. అటువంటి వారంతా కూలీలపై ఆధార పడాల్సి వస్తోంది.

- కోత పట్టిన పంటను కొంత మంది ఇప్పటికే నూర్పులు పట్టేశారు. అమ్మకానికి ధాన్యాన్ని కళ్లాల్లో ఉంచారు. కొనుగోలు కేంద్రాలు చురుగ్గా పనిచేయకపోవడంతో నిరాశ చెందుతున్నారు.

Updated Date - Nov 26 , 2025 | 11:31 PM