Share News

Still Treating ఇంకా పరాయి పంచనే!

ABN , Publish Date - Dec 08 , 2025 | 12:10 AM

Still Treating It as Someone Else’s Share! జిల్లా ఏర్పడి మూడున్నరేళ్లు గడుస్తున్నా.. ఇంకా ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాల సమస్య వేధిస్తోంది. నేటికీ అద్దె భవనాల్లోనే కొనసాగుతున్న దుస్థితి. ప్రతి నెలా లక్షలాది రూపాయలు అద్దె రూపంలో చెల్లించాల్సి వస్తోంది.

Still Treating ఇంకా పరాయి పంచనే!
ఐటీడీఏ కార్యాలయం కోసం నిర్మించిన భవనంలో కొనసాగుతున్న కలెక్టరేట్‌

  • అద్దె భవనాల్లోనే నిర్వహిస్తున్న వైనం

  • హడావుడిగా జిల్లాలను ఏర్పాటు చేసిన వైసీపీ సర్కారు

  • సౌకర్యాల కల్పనపై నిర్లక్ష్యం

  • వేధిస్తున్న మౌలిక వసతుల కొరత

  • ప్రజలు, ఉద్యోగులకు తప్పని ఇబ్బందులు

  • రాష్ట్ర ప్రభుత్వంపైనే ఆశలు

పార్వతీపురం, డిసెంబరు 7(ఆంధ్రజ్యోతి): జిల్లా ఏర్పడి మూడున్నరేళ్లు గడుస్తున్నా.. ఇంకా ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాల సమస్య వేధిస్తోంది. నేటికీ అద్దె భవనాల్లోనే కొనసాగుతున్న దుస్థితి. ప్రతి నెలా లక్షలాది రూపాయలు అద్దె రూపంలో చెల్లించాల్సి వస్తోంది. గత వైసీపీ సర్కారు ఎంతో హడావుడిగా జిల్లాల విభజన చేసింది. కానీ మౌలిక వసతులపై దృష్టి సారించలేదు. ప్రధానంగా ప్రభుత్వ కార్యాలయాలకు భవనాలను నిర్మించలేకపోయింది. ఫలితంగా అటు అధికారులు, ఇటు ప్రజలకు ఇక్కట్లు తప్పడం లేదు.

ఇదీ పరిస్థితి..

- జిల్లాలో ఆర్‌డబ్ల్యూఎస్‌, పంచాయతీరాజ్‌, ఆర్‌అండ్‌బీ, డీఆర్‌డీఏ, డీఎం సివిల్‌ సప్లైస్‌ శాఖలకు మాత్రమే సొంత భవనాలు ఉన్నాయి. ఇక మిగతా 50 శాఖలు అద్దె భవనాల్లోనే నిర్వహిస్తున్నారు. కాగా వాటికి ప్రతినెలా లక్షలాది రూపాయలు అద్దె రూపంలో చెల్లిస్తున్నారు. అయితే ఆయా అద్దె భవనాల్లో మౌలిక వసతులు కొరవడ్డాయి. మరుగుదొడ్లు , తాగునీరు, డ్రైనింగ్‌ హాల్‌ తదితర సదుపాయాలు లేకపోవడంతో ప్రజలు, సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. కొందరు ఉద్యోగులు సొంత సొమ్ముతో తాగునీరు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా జిల్లా విభజనకు ముందు ఉన్న కొన్ని ప్రభుత్వ కార్యాలయాలనుఉన్నతాధికారులకు కేటా యించారు.

- పార్వతీపురంలోని ఓ ప్రైవేట్‌ భవనాల సముదాయంలో పలు ప్రభుత్వ కార్యాలయాలు నిర్వహిస్తున్నారు. అయితే వర్షాకాలంలో గదులన్నీ కారిపోగా.. ఆ ప్రాంతం బురదమయంగా మారుతుంది. దీంతో ఆయా కార్యాలయాలకు వెళ్లాలంటే నరకమే. ప్రజలు, ఉద్యోగులే కాదు.. అధికారుల వాహనాలు కూడా రాకపోకలు సాగించలేని దుస్థితి.

- జిల్లాకేంద్రంలో కలెక్టరేట్‌కు కూడా సొంత భవనం లేదు. పార్వతీపురం ఐటీడీఏ కోసం నిర్మించిన భవనంలోనే కలెక్టర్‌ , జాయింట్‌ కలెక్టర్‌ తదితర కార్యాలయాలు నిర్వహిస్తున్నారు. గత టీడీపీ ప్రభుత్వం హయాంలో ఐటీడీఏకు భవనం నిర్మించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ భవనాన్ని కలెక్టర్‌ కార్యాలయంగా మార్చారు.

- కొన్ని ప్రభుత్వ శాఖలను ఇరుకైన గదుల్లో నిర్వహించలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఐసీడీఎస్‌తో పాటు జిల్లా సబ్‌ రిజిస్ర్టార్‌ తదితర కార్యాలయాలు విశాలమైన ప్రైవేట్‌ భవనాల్లోకి మార్చారు. ఇదిలా ఉండగా జిల్లాలో పలు శాఖలకు పూర్తిస్థాయి అధికారులు లేరు. కొన్నాళ్లుగా ఇన్‌చార్జిలతోనే నెట్టుకొస్తున్నారు. దీంతో పాలనాపరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలు అందడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తగు చర్యలు తీసుకోవాలని జిల్లావాసులు కోరుతున్నారు.

Updated Date - Dec 08 , 2025 | 12:10 AM