ఇంకా అవే పేర్లు
ABN , Publish Date - Apr 27 , 2025 | 11:38 PM
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలలు అవుతుంది. అయినా, గత వైసీపీ ప్రభుత్వ ఆనవాలు ఇంకా పోవడం లేదు.
-హెల్త్ వెల్‌నెస్ కేంద్రాలపై మాజీ సీఎం జగన్ ఫొటో, వైఎస్‌ఆర్ పేరు
- రైతు సేవా కేంద్రాలుగా మారని ఆర్‌బీకేలు
- ప్రభుత్వ ఆదేశాల అమల్లో నిర్లక్ష్యం
గజపతినగరం ఏప్రిల్ 27(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలలు అవుతుంది. అయినా, గత వైసీపీ ప్రభుత్వ ఆనవాలు ఇంకా పోవడం లేదు. జగన్ పాలనలో ఆయన పేరు, ఆయన తండ్రి వైఎస్‌ఆర్ పేరుతో పథకాలను అమలు చేసేవారు. అలాగే, ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగులు వేసి వాటిపై వైఎస్‌ఆర్, జగన్ పేర్లు రాసి బొమ్మలను అతికించేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని తొలగించాలని ఉత్తర్వులు జారీ చేసింది. అయినా అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. వైసీపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ నిధులతో గ్రామాల్లో ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లు.. వైఎస్‌ఆర్ విలేజ్ హెల్త్‌క్లీనిక్‌లను నిర్మించింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత వైఎస్‌ఆర్ పేరుని తొలగించి విలేజ్ హెల్త్ క్లీనిక్‌గా మార్పు చేసింది. అలాగే, రైతు భరోసా కేంద్రాల పేరును రైతు సేవా కేంద్రాలుగా మార్చింది. కానీ, గజపతినగరం మండలంలో చాలాచోట్ల ప్రభుత్వ భవనాలకు ఇంకా పాతపేర్లు, వైసీపీ రంగులే కనిపిస్తున్నాయి. మండలంలోని 30 గ్రామపంచాయతీల్లో 21గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేశారు. మరుపల్లి, ముచ్చర్ల, మధుపాడ, ఎం.కొత్తవలస తదితర గ్రామాల్లో వైఎస్‌ఆర్ విలేజ్ హెల్త్ క్లీనిక్ సెంటర్లను ఏర్పాటు చేశారు. అయితే 18 భవనాలపై ఉన్న వైఎస్‌ఆర్ పేరును నేటికీ అధికారులు తొలగించలేదు. అదే విధంగా 20 రైతు భరోసా కేంద్రాలు ఉండగా వాటిని రైతు సేవా కేంద్రాలుగా పేరు మార్చాల్సి ఉంది. కానీ, నేటికీ అవి రైతు భరోసా కేంద్రాలుగానే కొనసాగుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఆయా భవనాలపై పేర్ల మార్పుకు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.