Still Can’t Recover! ఇంకా తేరుకోలే!
ABN , Publish Date - Aug 21 , 2025 | 12:18 AM
Still Can’t Recover! అల్పపీడనం ప్రభావంతో జిల్లాలో గత మూడు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు పలు ప్రాంతాల్లో వరిపైరు దెబ్బతింది. ఇంకా ముంపులోనే పంటలు ఉండడంతో రైతులు లబోదిబోమంటున్నారు. భామిని మండలం లివిరి కనపాల చెరువుకు గండి పడడంతో దిగువన ఉన్న పొలాల్లో ఇసుక మేటలు వేశాయి. వరిచేలు మొత్తం కొట్టుకుపోయిందని ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
ఘాట్ రోడ్డుపై మట్టి, రాళ్లు.. రాకపోకలకు ఇబ్బందులు
భామిని, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): అల్పపీడనం ప్రభావంతో జిల్లాలో గత మూడు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు పలు ప్రాంతాల్లో వరిపైరు దెబ్బతింది. ఇంకా ముంపులోనే పంటలు ఉండడంతో రైతులు లబోదిబోమంటున్నారు. భామిని మండలం లివిరి కనపాల చెరువుకు గండి పడడంతో దిగువన ఉన్న పొలాల్లో ఇసుక మేటలు వేశాయి. వరిచేలు మొత్తం కొట్టుకుపోయిందని ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. నులకజోడులో ముంపులో ఉన్న వరి చేలు రక్షణకు వ్యవసాయాధికారులు పలు సూచనలు చేశారు. మొత్తంగా నులకజోడు, బిల్లుమడ, పసుకుడి, భామిని, లివిరి, దిమ్మిడిజోల, బాలేరు, ఘనసర, కీసర, కోసలి తదితర గ్రామాల్లోని సుమారు 530 ఎకరాలు ఇంకా నీటిలోనే ఉన్నాయి. మరోవైపు వరదలకు కొట్టుకుపోయిన లివిరి గ్రామ రహదారికి తాత్కాలిక మరమ్మతులు చేశారు.
బండ్రసింగి ఘాట్ రోడ్డు ఇలా..
తివ్వకొండ నుంచి వచ్చే వర్షపు నీరు ఉధృతికి బండ్రసింగి ఘాట్ రోడ్డు అధ్వానంగా మారింది. కొండపై నుంచి మట్టి, రాళ్లు జారి రోడ్డుపైన పడ్డాయి. కొన్నిచోట్ల వరద నీరు కూడా ప్రహిస్తుండడంతో భామిని-కురుపాం మండలాల్లో సుమారు పది గ్రామాల ప్రజల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జలపాతాలు వద్ద నీటి ఉధృతి తగ్గకపోవ డంతో గత రెండు రోజులుగా నిత్యావసర సరుకులకు కూడా వెళ్లలేకపోతున్నామని ఆయా ప్రాంతవాసులు చెబుతున్నారు. ఘాట్‌రోడ్డుపై రాళ్లు, మట్టి తొలగించి రాకపోకలకు వీలు కల్పించాలని వారు కోరుతున్నారు.