మహిళాభివృద్ధికి అడుగులు
ABN , Publish Date - Dec 06 , 2025 | 12:18 AM
మహిళాభివృద్ధికి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. శతశాతం ప్రగతి సాధనకు ప్రయత్నాలు చేస్తోంది.
- శతశాతం ప్రగతి సాధనకు యత్నాలు
- ఎనిమిది అంశాలపై మహిళా సంఘాలకు శిక్షణ
- తొమ్మిది మండలాల్లో తొలివిడత పూర్తి
శృంగవరపుకోట, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): మహిళాభివృద్ధికి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. శతశాతం ప్రగతి సాధనకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, సామాజిక భద్రత, ఆస్తుల సృష్టి, ప్రవర్తనలో మార్పు, సుస్థిర జీవనోపాధులు, సామర్థ్యాల పెంపు వంటి ఎనిమిది అంశాలపైన దృష్టిసారింది. వీటిని అధిగమించేందుకు ఉన్న అవకాశాలు, బడ్జెట్‌ను సమకూర్చుకునేందుకు మండలాల వారీగా స్త్రీ శక్తి (వెలుగు) కార్యాలయాల్లో మహిళా సంఘాల సభ్యులకు శిక్షణ ఇస్తుంది. తొలివిడతగా జిల్లాలో శృంగవరపుకోట, లక్కవరపుకోట, బొబ్బిలి, విజయనగరం, నెల్లిమర్ల, బొండపల్లి, చీపురుపల్లి, గరివిడి, సంతకవిటి మండలాల్లో స్వయం సహాయక సంఘాలకు ఏపీఎంలు మూడు రోజుల పాటు శిక్షణ ఇచ్చారు. శుక్రవారం ఈ శిక్షణ ముగిసింది. మిగతా మండలాల్లో త్వరలో రెండో విడత శిక్షణ ప్రారంభంకానుంది.
జిల్లాలో పరిస్థితి..
జిల్లాలో 27 మండలాల్లో 40,439 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. వీటిల్లో 4,39,678 మంది మహిళా సభ్యులు నమోదై ఉన్నారు. వీరి ద్వారా గ్రామాల్లో ఆర్థిక ప్రగతిని సాధించేందుకు ప్రభుత్వం ప్రణాళికను తయారు చేసింది. గ్రామాల్లో ఇప్పటికీ మరుగుదొడ్లు లేని నివాసాలు ఉన్నాయి. శానిటరీ ప్యాడ్స్ అంటే తెలియని వారున్నారు. ఇవన్నీ ప్రజారోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి. అత్యధికంగా మహిళలు అనారోగ్యం పాలవుతున్నారు. మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబమంతా ఆరోగ్యంగా ఉంటుంది. దీనిపై ఏఎన్‌ఎంలు, ఆశ వర్కర్‌లు, అంగన్‌వాడీ కార్యకర్తలు కలిసి మహిళా సంఘ సభ్యులకు అవగాహన కల్పించనున్నారు. పలువురు పిల్లల గ్రామాల్లో పాఠశాలలకు వెళ్లడం లేదు. తల్లిదండ్రులు కూడా వీరిని చదివించకుండా వ్యవసాయ కూలి పనులు, ఇతర పనులను పంపుతున్నారు. ఇలాంటి వారికి చదువు విలువ తెలయచేయడంతోపాటు ఆర్థిక సాయం అందించే ఏర్పాట్లు చేయనున్నారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న వారి జాబితాను తయారు చేయనున్నారు. చదువు రాని మహిళలకు అక్షరాలు నేర్చనున్నారు. స్వయం సహాయక సంఘాల ద్వారా కనీసం ఒక మండలంలో వెయ్యి ఎకరాల్లోనైనా సేంద్రియ సేద్యం చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఔత్సాహిక రైతులను గుర్తించి వారికి రుణ సదుపాయం కల్పించనుంది. వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక శాఖల సహకారంతో ఆధునిక పరికరాలు, నాణ్యమైన విత్తనాల సేకరణ జరిగేలా చూడనుంది. పింఛన్ల పంపిణీ మరింత పారదర్శకంగా జరిగేందుకు మహిళా సంఘాలు సహకారం అందించడంతో పాటు అర్హులందరికీ పింఛన్లు అందేలా చూడనున్నారు. కొంత మంది మహిళలకు తమకు తెలియకుండానే హింసకు గురవుతున్నారు. వివిధ కారణాలతో సమాజంలో తిరగలేక నూన్యతకు లోనవుతున్నారు. ఇలాంటి వారికి పోలీసు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ, సెర్ప్ సహకారంతో అవగాహన కల్పించనున్నారు. పేదలకు సొంత ఇల్లు ఉండేలా చూడనున్నారు. గ్రామీణాభివృద్ధి శాఖ సహకారంతో సొంత వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు అవసరమయ్యే చర్యలు చేపట్టనున్నారు. ప్రతి కుటుంబం నెలకు కనీసం రూ.20వేల ఆదాయం పొందేలా శిక్షణ ఇవ్వనున్నారు. 2026 ఏప్రిల్ నుంచి 2027 మార్చి నెలాఖరు వరకు వీటన్నిటినీ అమలు పరిచేందుకు అవసరమయ్యే బడ్జెట్‌ను సమీకరించేందుకు ఇప్పటి నుంచే ప్రభుత్వం ఈ శిక్షణలకు పూనుకుంది. స్వయం సహాయక సంఘాలు ఏ మేరకు సఫలీకృతమవుతాయో చూడాలి.