Steps towards settling disputes వివాదాలను చల్లార్చే దిశగా అడుగులు
ABN , Publish Date - Jun 26 , 2025 | 11:58 PM
Steps towards settling disputes జిందాల్ భూముల్లో చిన్న, సూక్ష్మ, మధ్య తరహా (ఎంఎస్‌ఎంఈ పార్కు) పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. ఆ భూముల విషయంలో నెలకొన్న వివాదాలను పరిష్కరించే దిశగా అడుగులు వేస్తోంది.
వివాదాలను
చల్లార్చే దిశగా అడుగులు
- కలెక్టర్‌ను కలిసిన ఎమ్మెల్యే లలితకుమారి
- నిర్వాసిత రైతులకు నచ్చజెప్పేపనిలో టీడీపీ, బీజేపీ నేతలు
- జిందాల్ భూముల్లో ఎంఎస్‌ఎంఈ పార్కుల స్థాపన వైపు మొగ్గు
జిందాల్ భూముల వ్యవహారంలో తలెత్తిన సమస్యలను త్వరగా పరిష్క రించండి. ఇందుకు శనివారం భూ నిర్వాసితులతో సమావేశం ఏర్పాటు చేయండి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతులు మీదుగా ఎంఎస్ ఎంఈ పార్కులకు శంఖుస్థాపన జరి గేలా చూడండి. వేలల్లో యువతకు ప్రత్యక్షంగా ఉద్యోగ, ఉపాధి దొరుకు తుంది. వెనకబడిన ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది.
- కలెక్టర్ అంబేడ్కర్‌ను గురువారం కోరిన ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి
ప్రభుత్వం, జిందాల్ యాజమాన్యం సంయుక్తంగా ఎంఎస్‌ఎంఈ పార్కుల ఏర్పాటుకు ప్రణాళిక రచించాయి. నిర్మాణాలకు అనుమతులు పొందారు. కొంత మంది ప్రజాప్రతినిధులు అడ్డుకుంటున్నారు. దయచేసి అభివృద్ధికి సహకరించండి. ప్రభుత్వం రైతుల పక్షాన ఉంది. అర్హులైన భూనిర్వాసిత రైతులకు జిందాల్ యాజమాన్యం నుంచి అణాపైసాతో సహా వసూలు చేసి ఇప్పించే బాధ్యత మాది. సొంత అజెండా, వేరే కారణాలతో అభివృద్ధిని అడ్డుకుంటే ఈ ప్రాంతానికి అన్యాయం చేసిన వారవుతారు.
- శిబిరాన్ని ఉద్దేశించి డీసీఎంఎస్ చైర్మన్ గొంప కృష్ణ గురువారం ఇచ్చిన హామీ
శృంగవరపుకోట, జూన్ 26(ఆంధ్రజ్యోతి):
జిందాల్ భూముల్లో చిన్న, సూక్ష్మ, మధ్య తరహా (ఎంఎస్‌ఎంఈ పార్కు) పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. ఆ భూముల విషయంలో నెలకొన్న వివాదాలను పరిష్కరించే దిశగా అడుగులు వేస్తోంది. అన్నీ అనుకూలిస్తే కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రాంత వాసులు కంటున్న కలలు నెరవేరినట్లే. ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తతలు సమసిపోయేలా కూటమి నాయకులు ప్రయత్నిస్తున్నారు. నిర్వాసిత రైతులకు అన్యాయం జరగనీయబోమని హామీ ఇస్తున్నారు. జిందాల్‌కు అప్పగించిన భూములను తిరిగి రైతులకు ఇచ్చేయాలని ఓ వర్గం, ఆ భూముల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయాలని మరో వర్గం ఐదు రోజులుగా పోటాపోటీగా తాటిపూడి రోడ్డుకు ఆనుకుని ఆందోళనలు చేస్తున్నారు. రైతులకు భూములను తిరిగి ఇచ్చేయాలని డిమాండ్‌తో కూర్చున్నవారందరికీ సీపీఎం నాయకుడు చల్లా జగన్, గిరిజన సంఘ నాయకుడు తమ్మి అప్పలరాజుదొరలు నేతృత్వం వహిస్తున్నారు. పరిశ్రమల ఏర్పాటు కోసం భైఠాయించిన వారికి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రాయవరపు చంద్రశేఖర్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు సీహెచ్‌ఆర్‌కే ప్రసాద్‌లు నాయకత్వం వహిస్తున్నారు. అయితే అధికారికంగా ప్రభుత్వం నుంచి ఈ భూముల్లో ఎంఎస్‌ఎంఈ పార్కులను నిర్మిస్తున్నట్లు ఇంతవరకు ప్రకటన వెలువడలేదు.
- జిందాల్ భూముల్లో ఎంఎస్‌ఎంఈ పార్కుల ఏర్పాటుకు సీఎం చంద్రబాబు నాయుడు భూమి పూజ చేసేందుకు, భూ నిర్వాసితుల సమస్యలను పరిష్కరించేందుకు రైతులతో శనివారం సమావేశం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే లలితకుమారి కలెక్టర్‌కు విన్నవించడం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం పరిశ్రమలు కావాలని ధర్నా చేస్తున్నవారికి ప్రభుత్వం తరఫున డీసీఎంఎస్ చైర్మన్ కృష్ణ భరోసా ఇవ్వడం చూస్తుంటే ఆ భూముల్లో చిన్న, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలు తథ్యమన్న భావన ప్రజల్లో కలుగుతోంది.
- శృంగవరపుకోట మండలం కిల్తంపాలెం, ముషిడిపల్లి, చీడిపాలెం, మూలబొడ్డవర, చినఖండేపల్లి గ్రామాల పరిధిలో భూములు సేకరించిన సంగతి తెలిసిందే. ఏదైనా పరిశ్రమ స్థాపనకు ప్రభుత్వం ఏపీఐఐసీ (ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ) ద్వారా భూములను సేకరించి ఇస్తారు. కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నేరుగా జిందాల్ యాజమాన్యానికి 2008లో భూములు రిజిస్ర్టేషన్ చేశారు.
- 2004 నుంచి దాదాపు నాలుగు సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న గిరిజనులను ఒప్పించారు. ప్రస్తుత ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజుకు ఈ గ్రామాలతో సన్నిహిత సంబంధాలు ఉండడంతో ఇతని సహకారం తీసుకున్నారు.
- కూటమి ప్రభుత్వం పారిశ్రామికీకరణ ద్వారా అభివృద్ధి సాధించాలన్న దృక్పథంతో ఉంది. ఈ నియోజకవర్గం విశాఖపట్నానికి ఆనుకొని ఉన్నందున పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తానని ఎన్నికల ప్రచారానికి వచ్చిన సమయంలో చంద్రబాబునాయుడు మాట ఇచ్చారు. ఇందుకు అనుగుణంగా జిందాల్ భూములు ఖాళీగా ఉండడం, ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్న ఎంఎస్‌ఎంఈ పార్కులు స్థాపనకు ముందుకు రావడంతో భూ నిర్వాసిత రైతుల సమస్యలకు కూడా పరిష్కారం దొరికే అవకాశం ఉంది.