Share News

పారిశ్రామికీకరణ దిశగా అడుగులు

ABN , Publish Date - Oct 18 , 2025 | 12:07 AM

జిల్లాలో పారిశ్రామీకరణ దిశగా అడుగులు పడుతున్నాయి.

  పారిశ్రామికీకరణ దిశగా అడుగులు
ఎంఎస్‌ఎంఈ పార్కుల కోసం కేటాయించిన జిందాల్‌ భూములు ఇవే

- జిల్లాలో పరిశ్రమల స్థాపనపై ప్రభుత్వం దృష్టి

- శరవేగంగా భూముల కేటాయింపు

- ఎంఎస్‌ఎంఈ పార్కులకు అధిక ప్రాధాన్యం

- ఇప్పటికే ఎస్‌.కోటలో నిర్మాణానికి మంత్రి మండలి ఆమోదం

- స్థానిక యువతకు దక్కనున్న ఉద్యోగ, ఉపాధి అవకాశాలు

శృంగవరపుకోట, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): జిల్లాలో పారిశ్రామీకరణ దిశగా అడుగులు పడుతున్నాయి. పరిశ్రమల స్థాపన కోసం ఇప్పటికే సేకరించి ఉన్న భూములపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ భూములను నిరుపయోగంగా ఉంచకుండా వాటిల్లో పరిశ్రమలను నిర్మించేలా చర్యలు చేపడుతోంది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా (ఎంఎస్‌ఎంఈ) పార్కులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. వాటిల్లో అర్హతను బట్టి స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ, విద్యాశాఖా మంత్రి నారా లోకేశ్‌ పరిశ్రమల స్థాపనకు పెట్టుబడులను ఆకర్షిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విశాఖపట్నంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచ దిగ్గజ సంస్థలు ముందుకు వస్తున్నాయి. నాలుగు రోజుల కిందట గూగుల్‌తో కీలక ఒప్పందం కూడా కుదిరింది. విశాఖకు పక్కనే విజయనగరం జిల్లా ఉండడంతో స్థానిక యువత కొలువులు సాధించేందుకు అవకాశం ఉంటుంది. భోగాపురంలో నిర్మిస్తున్న అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రకే కాదు రాష్ట్రానికే తలమానికంగా మారింది. పారిశ్రామిక పెట్టుబడులకు ఒక రకంగా ఇది కారణమవుతుంది. ఐటీ పరిశ్రమల నిర్మాణం కోసం భోగాపురం చుట్టుపక్కల దాదాపు ఐదు వేల ఎకరాలు సేకరించాలని ప్రభుత్వం చూస్తుంది. వీటికి అనుబంధంగా వివిధ రకాల పరిశ్రమలను నిర్మించేందుకు కృషి చేస్తుంది. వీటికోసం గతంలో పరిశ్రమలకు కేటాయించి నిరుపయోగంగా ఉన్న భూములను అందుబాటులోకి తీసుకువస్తుంది. విశాఖనగరంతో సమానంగా జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేసే పనిలో పడింది. ఇప్పటికే పూసపాటిరేగ మండలంలో ఒకట్రెండు రసాయన పరిశ్రమలు, లక్కవరపుకోట మండలంలో పెరున్న ఐరెన్‌ కంపెనీలు ఉన్నాయి. ఇప్పుడు కొత్తవలస మండలం బలిఘట్టాం, చినరావుపల్లి గ్రామాలతో పాటు శృంగవరపుకోట మండల పరిధిలోని జిందాల్‌ భూముల్లో ఎంఎస్‌ఎంఈ పార్కుల నిర్మాణ ప్రక్రియ ఊపందుకుంది. బొబ్బిలి గ్రోత్‌ సెంటర్‌ భూముల్లోనూ పూర్తి స్థాయిలో పరిశ్రమలను నెలకొల్పేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదంతా కార్యరూపం దాల్చితే జిల్లా చుట్టూ పరిశ్రమలు కనిపించనున్నాయి. పారిశ్రామికీకరణతో స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

- శృంగవరపుకోట మండల పరిధిలో గతంలో జిందాల్‌ సంస్థకు కేటాయించిన 1166.43 ఎకరాల భూముల్లో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈ పార్కులు) నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ మేరకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. రూ.531కోట్ల పెట్టుబడితో ఇక్కడ స్థాపించనున్న పరిశ్రమలతో 45వేల మందికి ఉద్యోగాలు రానున్నాయి.

- బొబ్బిలి గ్రోత్‌ సెంటర్‌లో 1,150 ఎకరాలు ఉండగా, ఇందులో 300 ఎకరాల్లో మాత్రమే వివిధ రకాల పరిశ్రమలు ఉన్నాయి. మిగిలి ఉన్న స్థలాలపై ప్రభుత్వం దృష్టిసారించింది. ఇక్కడ పరిశ్రమలను స్థాపించేలా చూస్తుంది. ఇందుకు ముందుకు వచ్చేవారికి స్థలాలు కేటాయించేలా ఆలోచన చేస్తుంది.

- 2017లో కొత్తవలస మండలం చినరావుపల్లి రెవెన్యూ పరిధిలో పతాంజలి ఫుడ్‌ అండ్‌ హెర్బల్‌ ప్రాజెక్టు కోసం 173 ఎకరాల భూమిని అప్పటి టీడీపీ ప్రభు త్వం కేటాయించింది. ఈ యాజమాన్యం పరిశ్రమను స్థాపించేందుకు సిద్ధపడుతు న్న సమయంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆ సంస్థ ప్రాజెక్టు నిర్మాణానికి ముందుకు రాలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండడంతో ప్రాజెక్టు నిర్మాణానికి యత్నాలు జరుగుతున్నాయి.

- కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోపే కొత్తవలస మండలం బలిఘట్టాం గ్రామ పరిధిలోని 57,09 ఎకరాల భూమిలో ఎంఎస్‌ఎంఈ పరిశ్రమల నిర్మాణానికి మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌, స్థానిక ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి భూమి పూజ చేశారు. ఈ పనులను కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి ఇటీవల పరిశీలించారు. ఔత్సహక పారిశ్రామిక వేత్తలకు సహకారం అందిస్తామని అన్నారు.

Updated Date - Oct 18 , 2025 | 12:07 AM