Steps Towards Cleanliness స్వచ్ఛతే లక్ష్యంగా అడుగులు
ABN , Publish Date - Nov 20 , 2025 | 12:29 AM
Steps Towards Cleanliness స్వచ్ఛ జిల్లాయే లక్ష్యంగా కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ‘నా ఊరు నా బాధ్యత’ అనే నినాదంతో గ్రామాల పరిశుభ్రతకు నడుం బిగించారు. మొదటి దశలో జిల్లాలో ప్రతి మండలం నుంచి ఒక గ్రామాన్ని సూపర్‌పైలెట్‌గా ఎంపిక చేయాలని నిర్ణయించారు.
పైలెట్ పంచాయతీల్లో ప్రత్యేక కార్యక్రమాలు
పార్వతీపురం, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): స్వచ్ఛ జిల్లాయే లక్ష్యంగా కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ‘నా ఊరు నా బాధ్యత’ అనే నినాదంతో గ్రామాల పరిశుభ్రతకు నడుం బిగించారు. మొదటి దశలో జిల్లాలో ప్రతి మండలం నుంచి ఒక గ్రామాన్ని సూపర్‌పైలెట్‌గా ఎంపిక చేయాలని నిర్ణయించారు. ఆ ప్రాంతంలో పూర్తిస్థాయిలో పారిశుధ్య పనులు చేపట్టాల్సి ఉంది. అదే విధంగా అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాల ప్రాంగణాలు, రోడ్లుకు ఇరువైపులా మొక్కలు నాటాలి. సంస్కృతి, సంప్రదాయాలు, పర్యాటకం తదితర వాటిపై ఆ గ్రామస్థులకు అవగాహన కల్పించాల్సి ఉంది. చెత్తలు, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించాల్సి ఉంది. క్లీన్ జిల్లాగా మన్యాన్ని తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించి.. మహిళా సంఘాలు, స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు, యువతతో కలిసి ప్రత్యేక సమావేశం నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. దీనిలో భాగంగా జిల్లా యంత్రాంగం పైలెట్ గ్రామాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. స్థానిక అధికారులు, సిబ్బంది, టీచర్లతో పాటు సర్పంచ్‌లు కూడా ఇందులో భాగస్వాములవుతున్నారు. ‘నా ఊరు.. నా బాధ్యత’ కార్యక్రమంలో భాగంగా గ్రామ పరిశుభ్రతపై అధికారులుసర్వే చేయాల్సి ఉంది. రోజువారీ చెత్త ఉత్పత్తి అంచనా వేసి, ప్రధాన సమస్యలను గుర్తించాలి. కాలువల నిర్వహణ, తాగునీటి సరఫరాపై ఆరా తీయాలి. పాఠశాల, అంగన్‌వాడీ, అంబేడ్కర్ భవనాలు ఉన్న ప్రాంతాల్లో గ్రామ చిత్రపటాలను ఉంచాలి. ప్రతి ఆదివారం శ్రమదానం చేయాల్సి ఉంది. పారిశుధ్యంపై అవగాహన ర్యాలీలు చేపట్టాలి. గ్రామ పంచాయతీ కార్యదర్శి, గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ గ్రామ రెవెన్యూ అధికారి, గ్రామ శుభ్రత కమిటీలకు ఆయా కార్యాక్రమాల నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. దీనిపై సంబంధిత అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.