పాలమెట్ట కాలువ ఆధునికీకరణకు చర్యలు
ABN , Publish Date - Jun 22 , 2025 | 11:28 PM
పాలమెట్ట వాట ర్‌హెడ్ కాలువ ఆధునికీకరణకు నిధులు మంజూరు చేయిస్తానని ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ తెలిపారు.
వీరఘట్టం, జూన్ 22 (ఆంధ్రజ్యోతి): పాలమెట్ట వాట ర్‌హెడ్ కాలువ ఆధునికీకరణకు నిధులు మంజూరు చేయిస్తానని ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ తెలిపారు. ఆదివారం నీలానగరం గ్రామంలో నీలానగరం వాటర్ రెగ్యులేటర్ అనుబంధ పాలమెట్ట వాటర్‌హెడ్ కాలువ రైతుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని, మాట్లాడారు. కాలువ మరమ్మతులకు రూ.11 లక్షల నిధులు మంజూరయ్యాయన్నారు. వాటితో కాలువ మరమ్మతులు చేపడతామని చెప్పారు. ఈ కాలువ ద్వారా 8 గ్రామాల్లో 2,200 ఎకరాలకు సాగునీరు అందుతుందని, ఆధునికీకరణ పనులు చేపడితే సంవత్స రానికి రెండు పంటలు పండించుకోవచ్చునన్నారు. గత టీడీపీ ప్రభుత్వ కాలంలో తోటపల్లి ఎడమ కాలువల ఆధునికీకరణకు 197 కోట్లు నిధులు మంజూరు చేసేలా కృషి చేశారని అన్నారు. 17 శాతం పనులు పూర్తయిన తర్వాత ప్రభుత్వం మార డంతో వైసీపీ ప్రభుత్వం ఆధునికీకరణ పనులు గాలికి వదిలేశారన్నారు. వీరఘట్టం మండలంలో 8 బీటీ రహదారులు నిర్మించామని, సిమెంట్ రహదారుల నిర్మాణం చేపట్టామని చెప్పారు. వండువ సెంటర్ నుంచి నవగాం సెంటర్ వరకు ప్రధాన రహదారి గోతులమ యంగా ఉండి ప్రజలు ఇబ్బందులు పడేవారన్నారు. నిధులు మంజూరు చేయించి రోడ్డు మరమ్మతులు చేపట్టామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ కొరికాన రవికుమార్, మాజీ ఏఎంసీ చైర్మన్ పొదిలాపు కృష్ణమూర్తినాయుడు, టీడీపీ మండల అధ్యక్షుడు ఉదయాన ఉదయ్‌భాస్కర్, నీటి సంఘం అధ్యక్షుడు హరినాథ్, మాజీ జడ్పీటీసీ గేదెల రమేష్, కర్నేన అప్పలనాయుడు, పలువురు నాయకులు, రైతులు పాల్గొన్నారు.