Share News

Tourism Development పర్యాటకాభివృద్ధికి చర్యలు

ABN , Publish Date - Oct 08 , 2025 | 10:55 PM

Steps for Tourism Development జిల్లాలోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. బుధవారం క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సంబంధిత అఽఽధికారులతో సమీక్షించారు.

  Tourism Development   పర్యాటకాభివృద్ధికి చర్యలు
కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి

పార్వతీపురం, అక్టోబరు 8(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. బుధవారం క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సంబంధిత అఽఽధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘జిల్లాలో పర్యాటక ప్రాంతాలపై వీడియో తీసి సోషల్‌ మీడియా ద్వారా ప్రమోట్‌ చేయాలన్నారు. పర్యాటకులను ఆకర్షించడమే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. వాటి వివరాలు, వసతుల గురించి వెబ్‌సైట్‌లో నమోదు చేయాలన్నారు. ఆన్‌లైన్‌ ద్వారా పర్యాటక ప్రాంతాల్లోని గదులను బుకింగ్‌ చేసుకొనే సదుపాయాన్ని కల్పించాలని తెలిపారు. దీనిపై నివేదికను సిద్ధం చేసి తనకు అందించాలని ఆదేశించారు. తాడికొండ, తోణాం, దళాయివలస, మెట్టుగూడ, ఆడలి వంటి తదితర పర్యాటక ప్రాంతాలకు వచ్చే వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు. రహదారికి ఇరువైపులా జంగిల్‌ క్లియరెన్స్‌ చేపట్టాలని, ఫుడ్‌ ఇతర స్టాల్స్‌ ఏర్పాటు చేయాలని సూచించారు. మౌలిక వసతుల కల్పనతో హోమ్‌ స్టేలను ఏర్పాటు చేయాలన్నారు. పర్యాటక ప్రాంతాలకు అందుబాటులో ఉన్న గృహాలను హోమ్‌ స్టేలుగా మార్చి.. మంచాలు, స్నానపు గదులు, మరుగుదొడ్లు వంటి కనీస వసతులు ఉండేలా చూసుకోవాలన్నారు. . ప్రభుత్వం ఆధీనంలో ఉన్న షాపులను గుర్తించి వాటిని స్వయం సహాయక సంఘ సభ్యులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. షాపులకు కనీస అద్దెను నిర్ణయిస్తూ బహిరంగ వేలం ద్వారా ధరను ఖరారు చేయాలన్నారు. ఈ సమావేశంలో జేసీ సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి, సబ్‌ కలెక్టర్‌ పవార్‌ స్వప్నిల్‌ జగన్నాథ్‌, ఏపీవో ఏ.మురళీధర్‌, డీఆర్‌డీఏ పీడీ ఎం.సుధారాణి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 08 , 2025 | 10:55 PM