Share News

cyber criminals : సెల్‌ఫోన్లు దొంగిలించి.. యూపీఐతో నగదు మళ్లించి

ABN , Publish Date - May 02 , 2025 | 12:04 AM

cyber criminals : సెల్‌ఫోన్లను దొంగిలించి యూపీఐ ద్వారా నగదును కొల్లగొడుతున్న సైబర్‌ ముఠా పాలకొండ పోలీసులకు పట్టుబడింది.

cyber criminals : సెల్‌ఫోన్లు దొంగిలించి.. యూపీఐతో నగదు మళ్లించి
వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ రాంబాబు

- ముగ్గురు సైబర్‌ నేరగాళ్ల అరెస్టు

- రూ.90,200 స్వాధీనం

పాలకొండ, మే 1 (ఆంధ్రజ్యోతి): సెల్‌ఫోన్లను దొంగిలించి యూపీఐ ద్వారా నగదును కొల్లగొడుతున్న సైబర్‌ ముఠా పాలకొండ పోలీసులకు పట్టుబడింది. ముగ్గురు సైబర్‌ నేరగాళ్లను అరెస్టు చేసి వారి నుంచి రూ.90,200 స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను గురువారం పాలకొండ డీఎస్పీ ఎం.రాంబాబు విలేకరులకు వెల్లడించారు. గత నెల 20న భామినికి చెందిన నారాయణరావు అనే వ్యక్తి పాలకొండ పట్టణంలోని ఓ ఏటీఎం కేంద్రానికి వచ్చాడు. అక్కడ ఆయన సెల్‌ఫోన్‌ను సైబర్‌ నేరగాళ్లు దొంగిలించారు. వెంటనే ఆ ఫోన్‌లోని యూపీఐ యాప్‌ ద్వారా రూ.92,700 నగదును మరో ఖాతాకు ట్రాన్స్‌ఫర్‌ చేశారు. దీనిపై నారాయణరావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సైబర్‌ క్రైమ్‌ అధికారులు నారాయణరావు అకౌంట్‌ను ఫ్రీజ్‌ చేసి లావాదేవీల ఆధారంగా విచారణ చేపట్టి నిందితులను గుర్తించారు. ఈ మేరకు పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడుకు చెందిన మేకల వెంకటేష్‌, మహ్మద్‌ భాషా, గజపతినగరానికి చెందిన పసుపురెడ్డి గోపీచంద్‌ను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.90,200 రికవరీ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. గతంలో వీరు ఏటీఎం కార్డులను క్లోన్‌ చేసి మోసాలకు పాల్పడినట్లు గుర్తించారు. కేసు ఛేదనలో చురుగ్గా పనిచేసిన సీఐ చం ద్రమౌళి, ఎస్‌ఐ ప్రయోగమూర్తిని డీఎస్పీ అభినందించారు.

Updated Date - May 02 , 2025 | 12:04 AM