మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి
ABN , Publish Date - Dec 12 , 2025 | 12:22 AM
యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని ఎస్పీ మాధవరెడ్డి, ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ అన్నారు.
ఎస్పీ మాధవరెడ్డి, ఎమ్మెల్యే జయకృష్ణ
పాలకొండలో ‘అభ్యుదయ’ యాత్ర
పాలకొండ, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని ఎస్పీ మాధవరెడ్డి, ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ అన్నారు. మాదక ద్రవ్యాల వినియోగంతో కలిగే దుష్ప్రభావాలను ప్రజలకు వివరించాలనే సంకల్పంతో పోలీసు శాఖ అభ్యుదయం పేరిట విశాఖపట్నం రేంజ్ పరిధిలోని పాయకరావుపేట నుంచి ఇచ్ఛాపురం వరకు సైకిల్ యాత్రను నిర్వహిస్తుంది. ఈ మేరకు గురువారం పాలకొండ పట్టణంలో ఎస్పీ, ఎమ్మెల్యేతో పాటు సబ్ కలెక్టర్ పవర్ స్వప్నిల్ జగన్నాథ్, పోలీస్ అధికారులు, సిబ్బంది అభ్యుదయ సైకిల్ యాత్రను నిర్వహించారు. విద్యార్థులు, ప్రజలు, యువతతో కలిసి ప్లకార్డులను ప్రదర్శిస్తూ, డ్రగ్స్ వద్దు బ్రో అంటూ నినాదాలు చేస్తూ సైకిల్ యాత్ర చేపట్టారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ మాధవరెడ్డి, ఎమ్మెల్యే జయకృష్ణ మాట్లాడుతూ.. సమాజంలో మార్పు కోసం ఒక దృఢ సంకల్పంతో విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి ప్రతిష్ఠాత్మకంగా అభ్యుదయ సైకిల్ యా త్రను ప్రారంభించారన్నారు. విద్యార్థులు, యువత మత్తుకు బానిసైతే జీవితాలు నాశనం అవుతాయన్నారు. కొన్నిమార్లు జైలుకు వెళ్లాల్సి ఉంటుందన్నారు. స్వచ్ఛమైన మనుషులు, మాదక ద్రవ్యాల రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ ర్యాలీ పాలకొండ పోలీస్‌స్టేషన్ నుంచి ప్రారంభమైన గాంధీ బొమ్మ జంక్షన్ వరకు కొనసాగింది. కార్యక్రమంలో డీఎస్పీ ఎం.రాంబాబు, పోలీసులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.