Status Quo యథాతథం
ABN , Publish Date - Dec 30 , 2025 | 12:10 AM
Status Quo పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో ఎటువంటి మార్పులు లేవు. యథాతథంగా కొనసాగించనున్నారు. ఈ మేరకు సోమవారం సీఎం చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు.
స్పష్టత ఇచ్చిన మంత్రివర్గ సమావేశం
సాలూరు రూరల్, డిసెంబరు29(ఆంధ్రజ్యోతి): పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో ఎటువంటి మార్పులు లేవు. యథాతథంగా కొనసాగించనున్నారు. ఈ మేరకు సోమవారం సీఎం చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. రాష్ట్రంలో మరో రెండు కొత్త జిల్లాలు, 17 జిల్లాల్లో 25 మార్పులు, చేర్పులతో కేబినేట్ ఆమోదం తెలిపింది. కాగా పార్వతీపురం మన్యం, విజయనగరంతో సహా తొమ్మిది జిల్లాల్లో ఎటువంటి మార్పులు, చేర్పులు చేయలేదు. జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ జీవోఎం ( మంత్రుల ఉపసంఘం ) ఈ ఏడాది అక్టోబరు 29న, నవంబరు 5న సమావేశం నిర్వహించింది. కొత్త జిల్లాలు, ప్రస్తుత జిల్లాల్లో సరిహద్దుల మార్పులు, చేర్పులపై చర్చించి నివేదిక తయారు చేసింది. ప్రస్తుతం పార్వతీపురం మన్యం జిల్లాలో సాలూరు నియోజకవర్గంలో సాలూరు, పాచిపెంట, మక్కువ మండలాలు ఉన్నాయి. మరో మండలం మెంటాడ విజయనగరం జిల్లాలో ఉంది. కురుపాం నియోజకవర్గంలో జియ్యమ్మవలస, కురుపాం, గుమ్మలక్ష్మీపురం మండలాలు పాలకొండ రెవిన్యూ డివిజన్‌లో ఉండగా కొమరాడ, గరుగుబిల్లి మండలాలు పార్వతీపురం రెవిన్యూ డివిజన్‌లో ఉన్నాయి. కాగా ఒక అసెంబ్లీ స్థానంలో ఉన్న మండలాలన్ని ఒకే రెవెన్యూ డివిజన్‌లో ఉండడం వల్ల ప్రజలకు ఇబ్బందులుం డవని ఉపసంఘం అభిప్రాయపడింది. దీంతో ఉమ్మడి జిల్లాలో మండలాల్లో మార్పులు, చేర్పులకు అవకాశముంటుందని అంతా భావించారు. మరోవైపు పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గాన్ని జిల్లాగా లేదా శ్రీకాకుళం జిల్లాలో విలీనం చేయాలని కొందరు వినతులిచ్చారు. అయితే జిల్లాల పునర్ వ్యవస్థికరణ జీవోఎం ( మంత్రుల ఉపసంఘం ) ఉమ్మడి విజయనగరం జిల్లాకు సంబంధించి ఎటువంటి ప్రతిపాదనలు చేయలేదు. ఉమ్మడి జిల్లాను యథావిధిగా కొనసాగించాలని నిర్ణయించింది. కాగా గత వైసీపీ ప్రభుత్వం జిల్లాల విభజనలో పార్లమెంట్ నియోజకవర్గాన్ని ప్రాతిపదికగా చేసుకుంది. అయితే అరకు పార్లమెంట్ నియోజకవర్గాన్ని మాత్రం అల్లూరి సీతారామరాజు , పార్వతీపురం మన్యం జిల్లాలుగా రెండు జిల్లాలుగా చేసింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వంఅల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్న రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లాను ఏర్పాటు చేసింది. దీంతో అరకు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో మూడు జిల్లాలు ఉన్నట్టు అయ్యింది.