ration Cards! ఆ కార్డుల రద్దుకు రంగం సిద్ధం!
ABN , Publish Date - Nov 16 , 2025 | 10:59 PM
Stage Set for Scrapping Those Cards! పేదల ముసుగులో రేషన్‌కార్డులు పొందిన వారిపై జిల్లా అధికారులు దృష్టి సారించారు. ప్రతినెలా రేషన్ విడిపించని వారు, ఈకేవైసీ చేయించుకోని వారి కార్డులను రద్దు చేయనున్నట్లు తెలుస్తోంది. వాస్తవంగా ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలకు రేషన్‌కార్డులు తప్పనిసరి. ఇందుకోసం జిల్లాలో ఎంతోమంది సంపన్నులు రేషన్‌కార్డులు పొందారు. ఎన్నో ఏళ్లుగా వారి ఆటలు సాగుతున్నా.. పట్టించుకునే వారే కరువయ్యారు.
రేషన్ తీసుకోరు.. ఈకేవైసీ చేయించుకోరు..
సంక్షేమ పథకాలకు మాత్రం అర్హులు
ఇప్పటివరకు స్మార్ట్‌కార్డులు తీసుకోని వైనం
ఇటువంటి వారిపై అధికారుల దృష్టి
పార్వతీపురం, నవంబరు16(ఆంధ్రజ్యోతి): పేదల ముసుగులో రేషన్‌కార్డులు పొందిన వారిపై జిల్లా అధికారులు దృష్టి సారించారు. ప్రతినెలా రేషన్ విడిపించని వారు, ఈకేవైసీ చేయించుకోని వారి కార్డులను రద్దు చేయనున్నట్లు తెలుస్తోంది. వాస్తవంగా ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలకు రేషన్‌కార్డులు తప్పనిసరి. ఇందుకోసం జిల్లాలో ఎంతోమంది సంపన్నులు రేషన్‌కార్డులు పొందారు. ఎన్నో ఏళ్లుగా వారి ఆటలు సాగుతున్నా.. పట్టించుకునే వారే కరువయ్యారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్‌కార్డులు ప్రవేశపెట్టడం, ఈకేవైసీ తప్పనిసరి చేయడంతో కొంతమంది ఆందోళన చెందుతున్నారు. తమ బండారం ఎక్కడ బయటపడుతుందోనని టెన్షన్ పడుతున్నారు. దీనిలో భాగంగా జిల్లాలో కొంతమంది ఇప్పటివరకు స్మార్ట్‌కార్డులను కూడా తీసుకోలేదు. ఇంకా పాత కార్డులనే వినియోగిస్తూ సంక్షేమ పథకాలు పొందుతున్నారు.
ఇదీ పరిస్థితి..
జిల్లాలో 2,58,936 రేషన్‌కార్డులు ఉన్నాయి. ఇందులో ఇప్పటివరకు 17,150 రేషన్‌కార్డులకు సంబంధించి ఈకేవైసీ పూర్తికాలేదు. నెలలు గడుస్తున్నా ఆయా కార్డులకు సంబంధించిన వారు ముందుకు రావడం లేదు. వాస్తవంగా ప్రభుత్వం స్మార్ట్‌కార్డులు జారీ చేసిన తర్వాత ఈకేవైసీ తప్పనిసరి చేసింది. అయితే ఈ ప్రక్రియ జిల్లాలో ఇంకా పూర్తి కాలేదు. ప్రతినెలా 90 నుంచి 92 శాతం మంది మాత్రమే రేషన్ తీసుకుంటున్నారు. మిగిలిన వారు రేషన్ తీసుకోవడం లేదు. కాగా జిల్లాలో 17,50 రేషన్‌కార్డులకు సంబంధించి వారు ఈకేవైసీకి ఇదిగో.. అదిగో అంటూ కాలయాపన చేస్తున్నారు. రేషన్‌కార్డు ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు, వైద్య సేవలు పొందుతున్న వారు ఈకేవైసీకి మాత్రం ముందుకు రాక పోవడం వెనుక అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా రేషన్ కార్డుదారుల్లో వలసలు వెళ్లిపోయిన వారు, మరికొంతమంది మృతులు ఉన్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా తక్షణమే రేషన్‌కార్డుల ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేసి అనర్హుల లెక్క తేల్చాలని జిల్లావాసులు కోరుతున్నారు.
నెలాఖరులోగా పూర్తిచేస్తాం
ఈ నెలాఖరులోగా రేషన్‌కార్డుల ఈకేవైసీ పూర్తిచేస్తాం. ఇందులో కొంతమంది మృతులు , మరికొంతమంది వలస వెళ్లిన వారున్నారు. ఏదేమైనా ఈకేవైసీ ప్రక్రియ త్వరగా పూర్తిచేయాలని సిబ్బందిని ఆదేశించాం.
- బాల సరస్వతి, డీఎస్‌వో, పార్వతీపురం మన్యం