Share News

Paddy Procurement ధాన్యం కొనుగోలుకు రంగం సిద్ధం

ABN , Publish Date - Oct 24 , 2025 | 11:41 PM

Stage Set for Paddy Procurement జిల్లాలో ఖరీఫ్‌ ధాన్యం కొనుగోలుకు రంగం సిద్ధమైంది. వచ్చేనెల పదో తేదీ నుంచి ప్రక్రియ చేపట్టేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధమ వుతుంది. ఈ మేరకు 281 ఆర్‌ఎస్‌కేల(రైతు సేవా కేంద్రాలు) పరిధిలో మొత్తంగా 180 కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

  Paddy Procurement  ధాన్యం కొనుగోలుకు రంగం సిద్ధం
కోతకు సిద్ధంగా ఉన్న వరి పంట

  • నవంబరు 10 నుంచి ప్రక్రియ ప్రారంభం

  • 27 నుంచి సిబ్బందికి శిక్షణ తరగతులు

పార్వతీపురం, అక్టోబరు24(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఖరీఫ్‌ ధాన్యం కొనుగోలుకు రంగం సిద్ధమైంది. వచ్చేనెల పదో తేదీ నుంచి ప్రక్రియ చేపట్టేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధమ వుతుంది. ఈ మేరకు 281 ఆర్‌ఎస్‌కేల(రైతు సేవా కేంద్రాలు) పరిధిలో మొత్తంగా 180 కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కాగా రైతులు ముందస్తుగా ధాన్యం విక్రయించినా కొనుగోలు చేయనున్నారు. అయితే అధికారికంగా నవంబరు 10 నుంచి కేంద్రాలను ప్రారంభించనున్నారు.

ఇదీ పరిస్థితి..

- ఈ ఏడాది జిల్లాలో 2.57 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. గత ఏడాది 2.24 లక్షల మెట్రిక్‌ టన్నులను కొనుగోలు చేసి.. గంటల వ్యవధిలోనే రైతుల ఖాతాలకు నగదు జమ చేశారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలతో అన్నదాతలు ఎంతో సంబరపడ్డారు. వాస్తవంగా వారు గత వైసీపీ ప్రభుత్వ కాలంలో ధాన్యం కొనుగోలుకు అష్టకష్టాలు పడేవారు. సకాలంలో నగదు జమ అయ్యేది కాదు. దీంతో అత్యధిక రైతులు ఇతర జిల్లాల మిల్లర్లకు ధాన్యం విక్రయించుకునేవారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారి ఇక్కట్లు తొలగిపోయాయి. సర్కారు ఆదేశాలతో గత ఏడాది జిల్లాలో రికార్డు స్థాయిలో ధాన్యం సేకరించగా.. ఈ సంవత్సరం 2.57 లక్షల మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. అదేవిధంగా ధాన్యం విక్రయించే రైతుల ఖాతాల్లో సకాలంలో నగదు జమయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

- జిల్లాలో 100 కిలోల ఏ-గ్రేడ్‌ రకం ధాన్యం మద్దతు ధర రూ.2,381, సాధారణ రకం రూ. 2,369గా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 27 నుంచి దీనిపై రైతులకు అవగాహన కల్పించ నున్నారు. జిల్లాలోని 281 రైతు సేవా కేంద్రాల్లో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.

- ఈ నెల 27 నుంచి ధ్యాన్యం కొనుగోలుపై సంబంధిత సిబ్బందికి శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ఉండే టెక్నికల్‌ అసిస్టెంట్స్‌, సహాయకులు, ఇతర సిబ్బంది, సచివాలయ అగ్రికల్చర్‌ ఉద్యోగులు హాజరవ్వాల్సి ఉంది.

- ధాన్యం కొనుగోలుకు సంబంధించి 33 శాతం గోనె సంచులు మిల్లర్ల ద్వారా సరఫరా చేసేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. రైతులు గోనె సంచులను స్వయంగా ఏర్పాటు చేసుకుంటే దానికి సంబంధించి సొమ్మును వారి ఖాతాల్లోకి జమ చేయనున్నారు. అదే విధంగా లోడింగ్‌కు సంబంధించి క్వింటాకు రూ.22 చొప్పునవారికి చెల్లించనున్నారు. రైతులు లోడింగ్‌ చేయకపోతే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అధికారులే ఆ ప్రక్రియ చేపడతారు.

పర్యవేక్షణ అవసరం...

జిల్లాకు సరిహద్దుల్లో ఉన్న ఒడిశా గ్రామాల నుంచి ధాన్యం సేకరించి కొన్నాళ్లుగా ఇక్కడ విక్రయించే పరిస్థితి ఉంది. కొంతమంది దళారులు ఇష్టారాజ్యంగా ఈ దందా సాగిస్తున్నారు. వారి వల్ల జిల్లా రైతులు నష్టపోతుండగా.. వారి ధాన్యం విక్రయాలు ఆలస్యమవుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు ప్రత్యేకంగా పర్యవేక్షించాల్సి ఉంది. అర్హులైన రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడమే లక్ష్యంగా పనిచేయాల్సి ఉంది. కొనుగోలు కేంద్రాల ఇన్‌చార్జిలు, సచివాలయ, వ్యవసాయశాక సిబ్బందికి పూర్తిస్థాయి ఆదేశాలు జారీ చేసి.. ఎటువంటి పొరపాట్లు లేకుండా ప్రక్రియ చేపట్టాలని జిల్లావాసులు కోరుతున్నారు.

ధాన్యం కొనుగోలుకు చర్యలు

‘జిల్లాలో నవంబరు పదో తేదీ నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కానున్నాయి. 2.57 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ నెల 27 నుంచి సిబ్బందికి శిక్షణ తరగతులు నిర్వహిస్తాం. ’ అని సివిల్‌ సప్లైస్‌ జిల్లా మేనేజర్‌ శ్రీనివాసరావు తెలిపారు.

Updated Date - Oct 24 , 2025 | 11:41 PM