రూ.10 కోట్లతో శ్రీకూర్మక్షేత్రం అభివృద్ధి
ABN , Publish Date - Oct 20 , 2025 | 12:10 AM
శ్రీకూర్మక్షేత్రాన్ని రూ.10 కోట్లతో అభివృద్ధి చేస్తామని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు.
- మౌలిక సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యత
- కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు
గార, అక్టోబరు19 (ఆంధ్రజ్యోతి): శ్రీకూర్మక్షేత్రాన్ని రూ.10 కోట్లతో అభివృద్ధి చేస్తామని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు. ఆదివారం శ్రీకాకుళం, విజయనగరం ఎమ్మెల్యేలు గొండు శంకర్, అదితి గజపతిరాజు, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌తో కలిసి ఆయన శ్రీకూర్మం క్షేత్రాన్ని దర్శించుకున్నారు. స్వామివారి సన్నిధిలో వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ట్రస్ట్ బోర్డు సభ్యులు, స్థానిక పెద్దలతోకలసి శ్వేత పుష్కరిణి పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు మాట్లాడుతూ.. ఈ దేవస్థానాన్ని ఆధ్యాత్మికంగా మరింత అభివృద్ధి చేసేందుకు అవసరమైన ప్రణాళికలను రూపొందిస్తామని తెలిపారు. ‘ఎమ్మెల్యే శంకర్, వంశపారంపర్య ధర్మకర్త, గోవా గవర్నర్ అశోక్‌గజపతిరాజు సహకారంతో చర్యలు తీసుకుంటాం. సీఎస్‌ఆర్ కార్యకలాపాల్లో భాగంగా ఇండిగో సంస్థ రూ.10 కోట్ల వ్యయంతో ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేసేందుకు ముందుకు వచ్చింది. ఇందులో భాగంగా తొలుత శ్వేత పుష్కరిణి అభివృద్ధి పరిచేందుకు అవసరమైన డిజైన్ రూపొందిస్తాం. వసతి సౌకర్యాలు, నిత్యాన్నదాన పథకం మరింత విస్తరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. పర్యాటకంగా కూడా మరింత అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎంతో ఆసక్తితో ఉన్నారు.’ అని తెలిపారు. వీరికి ఆలయ అధికారి కె.నరసింహనాయుడు, ప్రధాన అర్చకులు సీతారామ నరసింహచార్యులు స్వామివారి ప్రసాదం, చిత్రపటాన్ని అందజేశారు. కార్యక్రమంలో ట్రస్ట్ బోర్డు సభ్యులు కైబాడి కుసుమకుమారి, అరవెల్లి శ్వేతబిందు, అంధవరపు మౌనిక, గొండు శ్రీనివాసరావు, జమ్ము లక్ష్మి, కూటమి నాయకులు మెండ దాసునాయుడు, అరవల రవీంద్ర, బడగల వెంకట అప్పారావు, తదితరులు పాల్గొన్నారు.