Share News

Spring Water వారి దాహం తీర్చేది ఊటనీరే!

ABN , Publish Date - Dec 30 , 2025 | 11:29 PM

Spring Water Quenches Their Thirst! మండల కేంద్రానికి కేవలం 19 కిలోమీటర్లు దూరంలోనే ఉన్న మెండంగి గిరిశిఖర గ్రామస్థులకు తాగునీటి కష్టాలు తీరడం లేదు. ఏళ్లు గడుస్తున్నా.. వారి సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదు. దీంతో ఆ ప్రాంతవాసులకు కొండపై నుంచి వచ్చే ఊటనీరే జీవనాధారంగా మారింది.

Spring Water   వారి దాహం తీర్చేది  ఊటనీరే!
కొండపై నుంచి పైపు ద్వారా వస్తున్న ఊట నీటిని పడుతున్న మెండంగి గ్రామ గిరిజన మహిళలు

  • ఏళ్లు గడుస్తున్నా.. పరిష్కారం కాని సమస్య

  • గిరిజనులకు తప్పని తాగునీటి కష్టాలు

  • ఉన్నతాధికారులు స్పందించాలని విన్నపం

మక్కువ రూరల్‌, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): మండల కేంద్రానికి కేవలం 19 కిలోమీటర్లు దూరంలోనే ఉన్న మెండంగి గిరిశిఖర గ్రామస్థులకు తాగునీటి కష్టాలు తీరడం లేదు. ఏళ్లు గడుస్తున్నా.. వారి సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదు. దీంతో ఆ ప్రాంతవాసులకు కొండపై నుంచి వచ్చే ఊటనీరే జీవనాధారంగా మారింది. కాగా ఈ కలుషిత నీటి కారణంగా తరచూ రోగాలపాలవుతున్నారు. మరోవైపు ఏటా వేసవిలో కొండల నుంచి నీరు రాకపోవడంతో ఆ గ్రామస్థులు తాగునీటికి కటకటలాడాల్సి వస్తోంది. మెండంగితో పాటు చిలకమెండంగి, బాగుజోల, బెలుగొండ తదితర గిరిజన గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. దీనిపై ఆయా ప్రాంతవాసులు ఎన్నిసార్లు అధికారులకు విన్నవిస్తున్నా.. ఫలితం శూన్యం. కనీస చర్యలు తీసుకోకపోవడంతో వారు మండిపడుతున్నారు.

ఇదీ పరిస్థితి..

పనసభద్ర పంచాయతీ పరిధి మెండంగి గిరిశిఖర గ్రామంలో 115 కుటుంబాలు నివసి స్తున్నాయి. ఇక్కడ సుమారు 400 మంది జనాభా ఉన్నారు. ఈ గ్రామంలో రక్షిత నీటి పథకం లేదు. దీని ఏర్పాటుకు అవకాశాలున్నప్పటికీ అధికారులు ఆ దిశగా చర్యలు చేసుకోవడం లేదు. ప్రభుత్వాలు మరుతున్నా.. ప్రజాప్రతినిధులు కూడా దీనిపై చొరవచూపడం లేదు. దీంతో గ్రామ స్థులు కొండలపై నుంచి వచ్చే ఊటనీటినే తాగునీటిగా వినియోగించాల్సి వస్తోంది. గ్రామానికి కిలోమీటరున్నర దూరంలో కొండపై నుంచి వచ్చే ఊట నీటిని ఒడిసిపట్టి పైపులద్వారా ట్యాంక్‌ నింపుతున్నారు. అందులో చేరిన నీరు కుళాయిల ద్వారా సరఫరా అయ్యే విధంగా గ్రామస్థులు ఏర్పాట్లు చేశారు. వర్షాకాలంలో ఊటనీటికి ఏ ఇబ్బంది లేకపోగా.. వేసవిలో మాత్రం ఆ ప్రాంతవాసులకు దాహార్తి తప్పడం లేదు. ఎండాకాలంలో ఊట నీరు ఇంకిపోవడంతో తాగు నీటికి వారు కటకటలాడాల్సి వస్తోంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపి.. తాగునీటి ఇక్కట్లు తొలగించాలని గ్రామస్థులు కోరుతున్నా.. ఎవరికీ పట్టడం లేదు. ఊట నీటితో అనారోగ్య పాలవుతున్నామని..కనీసం బోరు ఏర్పాటు చేయాలని గ్రామపెద్దలు రెండేళ్ల కిందట అధికారు లను కోరారు. దీంతో గ్రామానికి పడమర భాగంలో బోరు ఏర్పాటు చేశారు. అయితే అది మూణ్నాళ్ల ముచ్చటగానే మారింది. కొద్దిరోజులు బాగానే పనిచేసిన బోరు ఆ తర్వాత మొరాయించింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వేసవి రాకమునుపే తగు చర్యలు తీసుకోవాలని ఆ ప్రాంతవాసులు కోరుతున్నారు. దీనిపై ఆర్‌డబ్ల్యూఎస్‌ డీఈ పీఎంకే రెడ్డిని వివరణ కోరగా.. ఆ గ్రామాన్ని సందర్శించి సమస్యను తెలుసుకుంటామన్నారు. గ్రామ ప్రజల అభిప్రాయం మేరకు శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Updated Date - Dec 30 , 2025 | 11:29 PM