Spiritual charm for the city నగరానికి ఆధ్యాత్మిక శోభ
ABN , Publish Date - Sep 16 , 2025 | 11:44 PM
Spiritual charm for the city నగరంలో మంగళవారం ఆధ్యాత్మిక శోభ కన్పించింది. అక్టోబరు తొలి వారంలో జరిగే సిరిమానోత్సవానికి ముందే పైడిమాంబ భక్తులు తమ, తమ ప్రాంతాల నుంచి ముర్రాటలతో ఊరేగింపులు నిర్వహించడం ఆనవాయితీ.
నగరానికి ఆధ్యాత్మిక శోభ
వాడవాడలా పైడిమాంబకు మొక్కుబడులు
ఘాటాలతో ఊరేగింపులు.. అమ్మవారికి ప్రత్యేక పూజలు
విజయనగరం రూరల్/కల్చరల్, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): నగరంలో మంగళవారం ఆధ్యాత్మిక శోభ కన్పించింది. అక్టోబరు తొలి వారంలో జరిగే సిరిమానోత్సవానికి ముందే పైడిమాంబ భక్తులు తమ, తమ ప్రాంతాల నుంచి ముర్రాటలతో ఊరేగింపులు నిర్వహించడం ఆనవాయితీ. ఈ నెల 12న పందిరిరాటతో సిరిమానోత్సవానికి అంకురార్పణ జరగ్గా, ఆ రోజు నుంచి ముర్రాటలు సమర్పించే ప్రక్రియ విస్తృతమైంది. నగరంలోని బూడివీధి ప్రాంతానికి చెందిన పైడిమాంబ భక్తులు ఇప్పటికే భారీ ఎత్తున ఊరేగింపు నిర్వహించగా, 19న కొత్తపేట, యాదవవీధి నుంచి ముర్రాటలు సమర్పిస్తారు. వీటితో పాటు జొన్నగుడ్డి, లంకాపట్టణం, బూర్లిపేట ఇలా పలు ప్రాంతాల్లో ఈ తంతు జరుగనుంది. కాగా మంగళవారం నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధికంగా ముర్రాటలిస్తూ పైడిమాంబను దర్శించుకున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకూ ఆలయంలో భక్తుల తాకిడి కన్పించింది. మంగళవారం పైడిమాంబకు అత్యంత ప్రీతిపాత్రమైన రోజు కావడంతో దేవస్థానం ఆధ్వర్యంలో చండీహోమాన్ని నిర్వహించారు. అదే విధంగా పైడిమాంబను వివిధ రకాల పూలతో ప్రత్యేకంగా అలంకరించారు. రైల్వేస్టేషన్ రోడ్డులో వున్న వనంగుడిలో కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సిరిమాను, ఇరుసుమాను చెట్ల గుర్తింపు
నేడు కొండతామరాపల్లిలో పూజలు
విజయనగరం రూరల్/గంట్యాడ/ కల్చరల్, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): పైడిమాంబ సిరిమానోత్సవానికి సంబంధించి కీలక ఘట్టం మంగళవారం జరిగింది. సిరిమాను, ఇరుసుమాను చెట్లను గుర్తించారు. వాటికి బుధవారం పూజలు చేయనున్నారు. సిరిమాను కోసం ఒక చెట్టు, సిరిమానుకు అమర్చేదానిని ఇరుసుమాను అంటారు. ఈ రెండు చెట్ల గుర్తింపు ప్రక్రియ పూర్తయ్యింది. పూజారి బంటుపల్లి వెంకటరావు కలలో పైడిమాంబ సాక్షాత్కరించి సిరిమాను చెట్లను గంట్యాడ మండలం కొండతామరాపల్లి గ్రామంలోని చల్ల అప్పలనాయుడు, చల్ల నారాయణమూర్తి, చల్లా రామకృష్ణల కళ్లాల్లో గుర్తించారు. అదే విధంగా ఇరుసుమాను చెట్టును లోకవరపు సత్యం కళ్లాల్లో గుర్తించారు. ఆ చెట్లకు సంప్రదాయబద్ధంగా దేవదాయశాఖాధికారులు, పైడిమాంబ ఆలయ అర్చకులు, పూజారి వెంకటరావు పూజలు నిర్వహించడం అనవాయితీగా వస్తోంది. ఇందుకు పురోహితులు బుధవారం ఉదయం 9.15 గంటలకు ముహూర్తంగా నిర్ణయించారు. దేవదాయశాఖాధికారులు ఆయా చెట్ల యాజమానుల వద్దకు వెళ్లి విషయం చెప్పి వాటికి పూజలు నిర్వహించనున్నారు. సిరిమాను, ఇరుసుమాను చెట్లను తమ గ్రామంలో గుర్తించినందుకు కొండతామరాపల్లి గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 22 తరువాత భారీ ఊరేగింపు నడుమ సిరిమాను చెట్లను విజయనగరం తీసుకువస్తారు.