speed up to msme parks వడివడిగా అడుగులు
ABN , Publish Date - Oct 15 , 2025 | 11:27 PM
speed up to msme parks చంద్రబాబు ఇచ్చిన హామీ అమలు దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ ప్రాంత ప్రజల కోరిక మేరకు శృంగవరపుకోట నియోజకవర్గాన్ని విశాఖ జిల్లాలో కలిపేందుకు ఇప్పటికే సన్నాహాలు పూర్తయ్యాయి. మరోవైపు జిందాల్‌కు అప్పగించిన భూముల్లో ఎంఎస్‌ఎంఈ పార్కుల నిర్మాణంపైనా ప్రభుత్వం దృష్టిసారించింది.
వడివడిగా అడుగులు
జిందాల్‌కు అప్పగించిన భూముల్లో ఎంఎస్‌ఎంఈ పార్కులు
మంత్రి వర్గం ఆమోదంతో యువతలో అనందం
హామీను నెరవేర్చే ప్రయత్నంలో సీఎం చంద్రబాబు
ఎస్.కోట నియోజకవర్గాన్ని విశాఖలో కలిపేందుకు సన్నాహాలు
- శృంగవరపుకోట నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తాను. ఈ నియోజకవర్గం విశాఖపట్నం జిల్లాకు ఆనుకొని ఉంది. ఆ జిల్లాలో కలిపేస్తే సమానంగా అభివృద్ధి చెందుతుంది. జిల్లాల పునర్వీభజన సమయంలో వైసీపీ ప్రభుత్వం రాజకీయ కోణంలో చూసింది. పార్లమెంటు పరిధిలో ఉన్న నియోజకవర్గాలను ఒక జిల్లాగా గుర్తిస్తామని చెప్పి అందుకు విరుద్ధంగా చేశారు. తాము అధికారంలోకి రాగానే దీన్ని సరిదిద్దుతాము. ఆపై పలు పరిశ్రమలు వస్తాయి. స్థానిక యువత ఇతర ప్రాంతాలకు వలస వెళ్లకుండా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం.
- ఎస్.కోట సార్వత్రిక ఎన్నికల ప్రచార సభలో ప్రస్తుత సీఎం నారాచంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ
శృంగవరపుకోట అక్టోబర్ 15 (ఆంధ్రజ్యోతి)
చంద్రబాబు ఇచ్చిన హామీ అమలు దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ ప్రాంత ప్రజల కోరిక మేరకు శృంగవరపుకోట నియోజకవర్గాన్ని విశాఖ జిల్లాలో కలిపేందుకు ఇప్పటికే సన్నాహాలు పూర్తయ్యాయి. మరోవైపు జిందాల్‌కు అప్పగించిన భూముల్లో ఎంఎస్‌ఎంఈ పార్కుల నిర్మాణంపైనా ప్రభుత్వం దృష్టిసారించింది. ఈ భూముల్లో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల నిర్మాణం చేపట్టేందుకు జెఎస్‌డబ్ల్యూ ఇండస్ట్రీయల్ పార్క్ లిమిటెడ్ ప్రతిపాదనలకు ఐదు రోజుల క్రితం కేబినెట్ ఆమోదం తెలిసింది. రూ.531 కోట్ల పెట్టుబడితో 45వేల మందికి ఉపాధి కల్పించాలని లక్ష్యం పెట్టుకున్నారు. ఈ భూముల్లో నిర్మించనున్న ఎంఎస్‌ఎంఈ పార్కుల్లో వస్త్రాలు, వ్యవసాయం ప్రోసెసింగ్, ఎలకా్ట్రనిక్ వాహనాల తయారీ, గ్రీన్ హైడ్రోజన్, లాజిస్టిక్స్ వంటి పరిశ్రమలు రానున్నాయి. అలాగే ఔత్సాహికులకు మూడు లక్షల క్యాపిటల్ సబ్సిడీ, భూమి మార్పిడి, వినియోగ మార్పు, లేవుట్ అమోదం చార్జీలలో వంద శాతం మినహాయింపు ఇచ్చేలా కేబినెట్ తీసుకున్న నిర్ణయంతో నిరుద్యోగ యువతలో అనందం వ్యక్తమవుతోంది.
- జందాల్‌కు శృంగవరపుకోట మండలం కిల్తంపాలెం, చీడిపాలెం, ముషిడిపల్లి, చినఖండేపల్లి, మూలబొడ్డవర గ్రామాల పరిధిలో 18సంవత్సరాల క్రితం 1166 ఎకరాలను ప్రభుత్వం సేకరించి ఇచ్చింది. ఆ భూముల్లో ఇంతవరకు జిందాల్ యాజమాన్యం ఎలాంటి నిర్మాణం చేపట్టలేదు. ప్రాతిపాదిత పరిశ్రమ కాకుండా ఎంఎస్‌ఎంఈ పార్కుల నిర్మాణానికి ముందుకు వచ్చింది. ఇందుకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం అంగీకారం తెలపడంతో ఇన్నాళ్ల తరువాత తొలి అడుగుపడింది. నవంబర్ 14న విశాఖపట్టణంలో జరగనున్న పారిశ్రామిక వేత్తల సమావేశానికి వచ్చేముందు జిందాల్ భూముల్లో ఎంఎస్‌ఎంఈ పార్కులకు సీఎం చంద్రబాబు భూమి పూజ చేస్తారని ప్రచారం జరుగుతోంది.
- బొబ్బిలి గ్రోత్ సెంటర్‌కు కేటాయించిన భూముల కంటే జిందాల్‌కు సేకరించి ఇచ్చిన భూములు ఎక్కువ. ఈ భూముల్లో సూక్ష్మ, చిన్న, మద్యతరహా పరిశ్రమల నిర్మాణం ద్వారా స్థానిక యువత ప్రత్యక్షంగా, పరోక్షంగాను లాభపడనున్నారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం ఒక్కోక్కటిగా అమలు చేసేందుకు అవసరమైన చర్యలు ఊపందుకోవడంతో నియోజకవర్గ ప్రజల్లో ఆశలు చిగిరిస్తున్నాయి. ఈ నియోజకవర్గం విశాఖ మహానగరానికి ఆనుకుని ఉన్నప్పటికీ ఆ జిల్లా పరిధిలో లేదు. విశాఖ పార్లమెంటు పరిధిలో ఉన్నప్పటికీ ప్రయోజనం లేకపోతోంది. దీంతో అభివృద్ధిలో చాలా వెనకబడింది.
- అరకు పర్యాటక ప్రాంతానికి ఈ నియోజకవర్గ గ్రామాల మీదుగా వున్న జాతీయ రహదారి విస్తరణకు ఎదురు చూస్తోంది. విశాఖపట్నం జిల్లా పరిధిలో ఉన్న ఈ రోడ్డు విస్తరించి రెండు దశాబ్దాలు పూర్తి చేసుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మరోసారి దృష్టి సారించింది. టెండర్ పూర్తి చేసుకొని రేపో,మాపో పనులు ప్రారంభించేందుకు చూస్తున్నారు. ఎస్.కోట నియోజకవర్గం విశాఖ జిల్లాలో కలవడం, దీనికి ఆనుకుని ఉన్న అరకు రోడ్డు విస్తరణ పనులకు మార్గం సుగమం కావడం, జిందాల్‌కు అప్పగించిన భూమిల్లో ఎంఎస్‌ఎంఈ పార్కుల ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం సిద్ధపడడం ద్వారా ఈ నియోజకవర్గ అభివృద్ధికి సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నారు.
అభివృద్ధి పనులు వేగవంతం చేయండి
బలిఘట్టాం ఎంఎస్‌ఎంఈ పార్కును పరిశీలించిన కలెక్టర్ రామసుందర్‌రెడ్డి
కొత్తవలస, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): ఎంఎస్‌ఎంఈ పార్కులో అభివృద్ధి, ఇతర మౌలిక సదుపాయాల పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ రామసుందర్‌రెడ్డి ఆదేశించారు. కొత్తవలస పంచాయతీ బలిఘట్టాం గ్రామ రెవెన్యూలో ఎంఎస్‌ఎంఈ పార్కు కోసం కేటాయించిన స్థలాన్ని ఆయన గురువారం సందర్శించారు. సర్వే నెంబర్ 141 లో 57ఎకరాల తొమ్మిది సెంట్లను ప్రభుత్వం ఈ పార్కు కోసం కేటాయించింది. ఇక్కడే మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఎంఎస్‌ఎంఈ పార్కునకు శంకుస్థాపన చేశారు. పార్కులో అభివృద్ధి పనులను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. ఔత్సాహికులైన యువ పారిశ్రామిక వేత్తలు ముందుకు వచ్చి చిన్న పరిశ్రమలను ఏర్పాటు చేయదలిస్తే ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందన్నారు. త్వరగా పనులు పూర్తిచేయాలని సూచించారు. ఆయన వెంట తహసీల్దార్ అప్పలరాజు, ఆర్‌ఐ షణ్ముఖ తదితరులు ఉన్నారు.