Speed up వేగం పెంచాలి
ABN , Publish Date - Sep 30 , 2025 | 11:30 PM
Speed up చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో కదలిక వచ్చింది. ఐదేళ్ల వైసీపీ పాలనలో నిర్వీర్యమైన వీటిని చక్కదిద్దే పనిలో ఆయన నిమగ్నం అయ్యారు. ఇప్పటికే కొన్నింటికి నిధులు కూడా విడుదల చేశారు. అయితే ఈ పనులను త్వరగా పూర్తిచేసి ప్రయోజనం కలిగించాలని రైతులు కోరుకుంటున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక రెండోసారి జిల్లాకు వస్తున్న చంద్రబాబు.. ఆ దిశగా దృష్టి సారించాలని వారు విన్నవించుకుంటున్నారు.
వేగం పెంచాలి
జిల్లాలో అస్తవ్యస్తంగా సాగునీటి ప్రాజెక్టులు
ఐదేళ్లు తీవ్ర నిర్లక్ష్యం చేసిన వైసీపీ ప్రభుత్వం
కూటమి ప్రభుత్వం రాకతో మొదలైన పనులు
త్వరగా పూర్తిచేయాలని జిల్లావాసుల వేడుకోలు
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో కదలిక వచ్చింది. ఐదేళ్ల వైసీపీ పాలనలో నిర్వీర్యమైన వీటిని చక్కదిద్దే పనిలో ఆయన నిమగ్నం అయ్యారు. ఇప్పటికే కొన్నింటికి నిధులు కూడా విడుదల చేశారు. అయితే ఈ పనులను త్వరగా పూర్తిచేసి ప్రయోజనం కలిగించాలని రైతులు కోరుకుంటున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక రెండోసారి జిల్లాకు వస్తున్న చంద్రబాబు.. ఆ దిశగా దృష్టి సారించాలని వారు విన్నవించుకుంటున్నారు.
విజయనగరం, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): విజయనగరం వ్యవసాయాధారిత జిల్లా. సాగుతో పాటు అనుబంధ రంగాలు అభివృద్ధి చెందితేనే ఫలితం ఉంటుంది. వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లపాటు వీటిని పట్టించుకోలేదు. కూటమి అధికారంలోకి రాగానే.. ప్రభుత్వం వీటిపై దృష్టి సారించింది. కొన్నింటిని ప్రాధాన్యతగా గుర్తించి నిధులు కూడా కేటాయించింది. ఈ నేపథ్యంలో జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు, వాటి పరిస్థితిపై కథనం..
తోటపల్లి ప్రాజెక్టు
ఉమ్మడి జిల్లాతో పాటు శ్రీకాకుళం జిల్లాకు తోటపల్లి ప్రాజెక్టు అత్యంత కీలకమైనది. 19,85,221 ఎకరాల ఆయకట్టుకు నీరు అందించాలన్న లక్ష్యంతో తొలుత దీనికి రూ.1127.58 కోట్లతో పాలనా అనుమతి లభించింది. ఇప్పటివరకు రూ.900 కోట్లు వరకు వెచ్చించినట్టు గణాంకాలు చెబుతున్నాయి. కానీ ఏటా ఖరీఫ్‌లో 80 వేల ఎకరాలకు కూడా నీరు అందడం గగనంగా మారింది. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో బడ్జెట్ కేటాయింపు రూ.655.19 కోట్లు చేసినా.. విడుదల చేసింది మాత్రం రూ.61.82 కోట్లే. అప్పట్లో ఏడాదికి రూ.100 కోట్లు ఇచ్చినా ప్రధాన పనులు పూర్తయ్యేవని అధికారులు చెబుతున్నారు. జగన్ ప్రభుత్వం చివరకు కాంట్రాక్టర్‌కు రూ.6 కోట్ల బిల్లులు కూడా పెండింగ్ పెట్టింది. చంద్రబాబు సీఎం అయ్యాక వీటిని చెల్లించారు. ఆ తర్వాత పనులు కూడా ప్రారంభం అయ్యాయి. వీటిని త్వరితగతిన పూర్తి చేయాలని రైతులు కోరుతున్నారు.
తారకరామతీర్థ సాగర్
తారకరామ తీర్థసాగర్ ప్రాజెక్టుదీ అదే దయనీయం. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. ఇంకా కాంట్రాక్టర్‌కు రూ.18 కోట్ల వరకు బకాయి పెట్టినట్టు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుకు రూ.739 కోట్లకు పాలనా ఆమోదం లభించింది. ఇప్పటివరకు రూ.310 కోట్ల పనులు మాత్రమే జరిగినట్టు తెలుస్తోంది. ఇంకా రూ.429 కోట్ల పనులు చేయాల్సి ఉంది. కనీసం వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏడాదికి రూ.100 కోట్లు విడుదల చేసినా పెండింగ్ పనులు పూర్తయ్యేవి. కానీ అధికారులు చేసిన ప్రతిపాదనలను జగన్ సర్కారు బుట్టదాఖలు చేసింది. మరోవైపు నిర్వాసితుల సమస్యకు పరిష్కారం చూపలేక పోయింది. 300 ఎకరాల వరకు భూసేకరణ చేయాల్సి ఉన్నా.. దాని జోలికి పోలేదు. చంద్రబాబు సీఎం అయ్యాక తారకరామ తీర్థసాగర్‌ను ప్రాధాన్యత ప్రాజెక్టుగా చేర్చారు.
గజపతినగరం కెనాల్ బ్రాంచ్
తోటపల్లి కుడి ప్రధాన కాలువ కింద చీపురుపల్లి సమీపంలో 97.7 కిలోమీటర్ల నుంచి ఐదు మండలాలు 41 గ్రామాల పరిధిలో 15 వేల ఎకరాల మెట్ట భూములకు సాగునీరు అందించేందుకు గజపతినగర్ కెనాల్ బ్రాంచ్ తవ్వాలని 2008లోనే నిర్ణయించారు. రూ.84 కోట్ల వ్యయంతో పాలనాపరమైన ఆమోదం లభించింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో పనులు కొంతవరకూ ప్రారంభమయ్యాయి. కానీ గత ఐదేళ్లలో ఈ పనులు చేయడంలో వైసీపీ ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహించింది. బ్రాంచ్ కెనాల్ పొడవు 45 కిలోమీటర్లు. ఇందులో 25 కిలోమీటర్లు ప్రధాన కాలువ. మిగతా 20 కిలోమీటర్లు పిల్ల కాలువలు. అయితే ఇంతవరకూ భూసేకరణ జరగలేదు. దీనిని త్వరితగతిన పూర్తిచేయాల్సిన అవసరం ఉంది.
జైకా నిధులపై నిర్లక్ష్యం
గత ఐదేళ్లలో జైకా నిధులపైనా నిర్లక్ష్యం కొనసాగింది. వైసీపీ ప్రభుత్వం వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయింది. వట్టిగెడ్డకు రూ.38 కోట్ల జైకా నిధులు విడుదలయ్యాయి. కానీ కాంట్రాక్టర్‌కు బిల్లలు చెల్లించలేదు. దీంతో రూ.5 కోట్ల విలువైన పనులు చేసిన తరువాత కాంట్రాక్టర్ పనులు నిలిపివేశాడు. వెంగళరాయసాగర్‌కు రూ.64 కోట్లతో టెండరు ఆమోదించారు. రూ.53 కోట్లతో పనులు చేపట్టిన కాంట్రాక్టర్‌కు రూ.5 కోట్లు చెల్లించాల్సి ఉండడంతో మధ్యలో పనులు నిలిపివేశాడు. పెద్దఅంకలాం ప్రాజెక్టుకు రూ.14 కోట్లతో పనులు చేపట్టారు. ఇంకా కోటి రూపాయలు కాంట్రాక్టర్‌కు పెండింగ్‌లో పెట్టేశారు. ఆండ్ర ప్రాజెక్టుది అదే పరిస్థితి. రెండేళ్లక్రితం గేట్ల వద్ద లీకేజీ అయి నీరు వృథాగా పోతున్నా పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి.
నారాయణపురం ఆనకట్ట..
సంతకవిటి మండలం రంగారాయపురం, శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం నారాయణపురం సమీపంలో నాగావళి నదిపై 1959-63 మధ్య నారాయణపురం ఆనకట్టను నిర్మించారు. సంతకవిటితో పాటు శ్రీకాకుళం జిల్లాలో 38 వేల ఎకరాలకు ఈ ఆనకట్ట సాగునీరు అందిస్తూ వచ్చింది. గత ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. దీంతో షట్టర్ల వ్యవస్థ, రెగ్యులేటర్లు, స్పిల్‌వే, కాలువలు, గట్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. 2018లో టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.112.10 కోట్ల జైకా నిధులు వచ్చాయి. కొంతమేర పనులు జరిగాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పనులు నిలిపివేసింది. కొన్నిరోజులు పనులు అంటూ హడావుడి చేశారే తప్ప పూర్తిచేయలేదు. అయినా 35 శాతం పనులు చేశామని చెప్పి రూ.14 కోట్ల ఖర్చును గణాంకాల్లో చూపారు. పరిస్థితి చూస్తే ఎక్కడివేసిన గొంగళి అన్న చందంగా ఉంది. ఈ ఏడాది ఖరీఫ్‌లో ఆయకట్టులో 10 వేల ఎకరాలకు సాగునీరు అందలేదని రైతులు చెబుతున్నారు. ప్రభుత్వం ఈ ఆనకట్టపై దృష్టి సారించల్సి ఉంది.
మడ్డువలస ఇలా..
మడ్డువలస ప్రాజెక్టు రాజాం నియోజకవర్గంలోని నాలుగు మండలాలతో పాటు శ్రీకాకుళం జిల్లాలోని కొన్ని ప్రాంతాలకు సాగునీరు అందిస్తోంది ఈ ప్రాజెక్టు. 30 వేల ఎకరాలకు సాగునీరు అందించాలన్నది లక్ష్యం. కానీ ప్రాజెక్టు పూర్తిగా శిథిలమైంది. రిజర్వాయర్ గర్భంలో పూడిక పేరుకుపోయింది. దీంతో సంగాం, ఓనీ అగ్రహారం, మగ్గూరు తదితర గ్రామాలకు సాగునీరు అందని దుస్థితి. ఈ రిజర్వాయర్‌కు 11గేట్లు ఉన్నాయి. ఇందులో 5,6,10,11 గేట్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో నిత్యం నీరు వృథాగా కింది ప్రాంతాలకు పోతోంది. గత ప్రభుత్వ హయాంలో రూ.1.81 కోట్లు మంజూరయ్యాయని చెప్పి పనులు ప్రారంభించారు. అసంపూర్తిగా విడిచిపెట్టారు. రాత్రి వేళల్లో వరద పర్యవేక్షణకు స్పిల్ వే, ఇతర ప్రాంతాల్లో 50 విద్యుత్ దీపాలను ఏర్పాటుచే శారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్వహణ లేక అవి మూలకు చేరాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత కొంతవరకూ బాగుచేశారు. రిజర్వాయర్‌తో పాటు కాలువల ఆధునికీకరణకు రూ.2.50 కోట్లు అవసరమని అధికారులు ప్రతిపాదనలు పంపారు. వీటిన్నింటిపై సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించాలని జిల్లా వాసులు కోరతున్నారు.