Special Officer ప్రతి వసతిగృహానికీ ప్రత్యేకాధికారి
ABN , Publish Date - Jul 21 , 2025 | 11:41 PM
Special Officer for Every Hostel జిల్లాలో ప్రతి వసతిగృహానికీ ఒక ప్రత్యేకాధికారిని నియమించాలని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు. ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన ‘వసతి గృహాలు.. సమస్యల లోగిళ్లు’ అనే కథనంపై ఆయన స్పందించారు. సోమవారం కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్ అనంతరం అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
‘ఆంధ్రజ్యోతి’ కథనంపై స్పందన
పార్వతీపురం, జూలై 21 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ప్రతి వసతిగృహానికీ ఒక ప్రత్యేకాధికారిని నియమించాలని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు. ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన ‘వసతి గృహాలు.. సమస్యల లోగిళ్లు’ అనే కథనంపై ఆయన స్పందించారు. సోమవారం కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్ అనంతరం అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ ప్రతి వసతిగృహానికి తహసీల్దార్ ప్రత్యేక అధికారిగా ఉండాలి. అదే ప్రాంతంలో ఉన్న మరో వసతి గృహాన్ని సమీపంలో ఉన్న గ్రామ సచివాలయ సిబ్బంది పర్యవేక్షించాలి. అక్కడి సమస్యలను పరిష్కరించాలి. ఇకపై ప్రతినెలా వసతి గృహాలపై ప్రత్యేక సమావేశం నిర్వహించాలి. ఈ సమావేశానికి పాఠశాల ఉపాధ్యాయులు కూడా హాజరవ్వాలి.’ అని తెలిపారు.
మరమ్మతులు చేపట్టాలి..
అంగన్‌వాడీ, పాఠశాలల భవనాలకు అవసరమైన చోట మరమ్మతులు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. వీలుంటే మరొక భవనంలోకి మార్చాలన్నారు. ‘వరద ప్రవాహం ఎక్కువగా ఉంటే.. వాగులు, నదులు దాటుకొని వచ్చే పిల్లలకు సెలవు ప్రకటించాలి. పాఠశాల లేదా వసతిగృహానికి పిల్లలు రాకపోతే దానికి తగిన కారణాలు తెలుసుకోవాలి. ఆరోగ్య సమస్యలుంటే వెంటనే పిల్లలకు వైద్య సేవలు అందించాలి. ‘తల్లికి వందనం’ పథకం వర్తించలేదని చాలా దరఖాస్తులు వస్తు న్నాయి. ఆయా అర్జీలను పరిశీలించి ఒక జాబితాను తయారు చేయాలి. అర్హులైన వారి పేర్లును ప్రభుత్వానికి పంపించాలి. ఎక్కడా తాగునీటి సమస్య ఉండరాదు. కొమరాడ మండలంలో గిరిజన మహిళలకు చెందిన భూ ఆక్రమణపై విచారణ చేపట్టాలి. సీతానగరం మండలం రంగంపేటలో 15వ ఆర్థిక సంఘం నిధులు వినియోగంపై నివేదిక అందించాలి. ప్రభుత్వ కార్యాలయాల్లో గాని పంచాయతీల్లో గానీ ఎవరైనా సక్రమంగా పనిచేయకపోతే వెంటనే ఉన్నతాధికారులకు తెలియ జేయాలి. బడి ఈడు పిల్లలు బడి బయట ఉండరాదు.’ అని తెలిపారు.
పీ-4పై ప్రత్యేక దృష్టి
ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న పీ-4 కార్యక్రమం, గ్రామసభలు తదితర వాటిపై అధికార యంత్రాంగంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని కలెక్టర్ ఆదేశించారు. బంగారు కుటుంబాల జాబితాలపై వచ్చే అభ్యంతరాలపై గ్రామసభలను నిర్వహించాలని ఆదేశించారు. అభ్యంతరాలు, ఇతర వివరాలను రికార్డు చేయాలని స్పష్టం చేశారు. జిల్లాలో 33,309 కుటుంబా లను దత్తత తీసుకోవాల్సి ఉండగా, ఇప్పటికే 13 వేల కుటుంబాలు మ్యాపింగ్ అయ్యాయన్నారు. మిగిలిన 20 వేల కుటుంబాలను మార్గదర్శకులకు అనుసంధానం చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. భామిని, వీరఘట్టం మండలాల్లోని ఆదర్శ గ్రామాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై శ్రద్ధ వహించాలన్నారు.
పచ్చిరొట్ట ఎరువులతో మట్టికి జీవం
పచ్చిరొట్ట ఎరువులతో మట్టికి జీవం వస్తుందని, భూమి సారవంతమవుతుందని కలెక్టర్ తెలిపారు. జీవన ఎరువులతో పంటకు బలం వస్తుందన్నారు. పది శాతం ఎరువులు ఆదా చేయొచ్చని తెలిపారు. అనంతరం వ్యవసాయశాఖ రూపొందించిన పచ్చిరొట్ట విత్తనాలపై పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జేసీ శోభిక, సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ, డీఆర్వో కె.హేమలత తదితరులు పాల్గొన్నారు.