Malaria Prevention మలేరియా నివారణకు ప్రత్యేక చర్యలు
ABN , Publish Date - Jun 25 , 2025 | 11:24 PM
Special Measures Launched for Malaria Prevention జిల్లాలో మలేరియా నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు డీఎంహెచ్‌వో భాస్కరరావు తెలిపారు.
డ్రోన్లతో పిచికారీ
డీఎంహెచ్‌వో భాస్కరరావు
పార్వతీపురం, జూన్ 25(ఆంధ్రజ్యోతి): జిల్లాలో మలేరియా నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు డీఎంహెచ్‌వో భాస్కరరావు తెలిపారు. బుధవారం తన కార్యాలయంలో విలేఖర్లతో ఆయన మాట్లాడుతూ.. ‘ మన్యంలో 248 గ్రామాల్లో మలేరియా తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు గుర్తించాం. ఆయా ప్రాంతాల్లో మొదటి విడత స్ర్పేయింగ్ పూర్తయిది. జిల్లాలో తొలిసారిగా ఏజెన్సీ ప్రాంతాల్లో పైలెట్ ప్రాజెక్టు కింద డ్రోన్ల సాయంతో దోమలమందు పిచికారీ కార్యక్రమం ప్రారంభించాం. ఇప్పటివరకు 1231 మలేరియా పాజిటివ్ కేసులను గుర్తించాం. 155 ఆశ్రమ పాఠశాలలో దోమలు నివారణకు స్ర్పేయింగ్ పూర్తి చేశాం. 915 గ్రామాల్లో స్ర్పేయింగ్ నిర్వహిస్తున్నాం. జిల్లాకు నాలుగు లక్షల దోమతెరలు అవసరమని గుర్తించి ప్రతిపాదనలు పంపించాం. వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఇప్పటికే వైద్యులు, వైద్య సిబ్బందికి ఆదేశాలు జారీ చేశాం. జిల్లాలో జ్వరాల తీవ్రత లేదు.’ అని తెలిపారు.
ఆశా కార్యకర్తల నియామకాలకు నోటిఫికేషన్
ఆశా కార్యకర్తల నియామకాలకు నోటిఫకేషన్ జారీ చేసినట్లు డీఎంహెచ్‌వో ఎస్.భాస్కరరావు తెలిపారు. గ్రామీణ, గిరిజన గ్రామ సచివాలయాల పరిధిలో మొత్తంగా 34 పోస్టులను భరీ చేస్తామన్నారు. గ్రామ సచివాలయ పరిధిలో నివసించే వారు, వివాహితులు, వితంతువులు, విడాకులు తీసుకున్న వారికి ప్రాధాన్యం ఉంటుందన్నారు. 25 నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు, టెన్త్ పాసైన వారు అర్హులన్నారు. పార్వతీపురం మన్యం .ఏపీ.జీవోవీ.ఇన్ వెబ్‌సైట్‌లో దరఖాస్తును డౌన్‌లోడ్ చేసుకొని జూలై 5వ తేదీలోపు సమర్పించాలని సూచించారు.