Irrigation Water Storage సాగునీటి నిల్వలకు ప్రత్యేక చర్యలు
ABN , Publish Date - May 16 , 2025 | 11:17 PM
Special Measures for Irrigation Water Storage వర్షాధార ప్రాంతాల్లో సాగునీటి నిల్వలకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ తెలిపారు. శుక్రవారం కొంకడివరంలో చెరువు ఫీడర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
రైతుల ఆర్థికాభివృద్ధికి ప్రణాళికలు
గరుగుబిల్లి, మే16(ఆంధ్రజ్యోతి): వర్షాధార ప్రాంతాల్లో సాగునీటి నిల్వలకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ తెలిపారు. శుక్రవారం కొంకడివరంలో చెరువు ఫీడర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..‘ సాగునీరు వృఽథాగా పోకుండా ఉండేందుకు ఉపాధి హామీ నిధులతో జిల్లాలో 120 చెరువులను అభివృద్ధి చేస్తాం. రైతుల ఆర్థికాభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నాం. పంట పొలాలు బీడు భూములుగా మారకుండా ఉండేందుకు చర్యలు చేపడుతున్నాం. గరుగుబిల్లి మండలానికి సంబంధించి 11 చెరువు పనులు మంజూరు చేశాం.’ అని తెలిపారు. అనంతరం ఉపాధి వేతనదారుల సమస్యలు తెలుసుకున్నారు. వేతనాలు ఏ మేరకు అందుతున్నాయని వారిని అడిగి తెలుసుకున్నారు. వడదెబ్బకు గురికాకుండా ఉదయం పూట పనులకు వేగంగా హాజరుకావాలన్నారు. నిర్ధేశించిన ప్రాంతంలో కొలతల మేరకు పనులు సక్రమంగా నిర్వహించాలని సూచించారు. సమయపాలన పాటిస్తే వేతనం గిట్టుబాటు అవుతుందన్నారు. రైతులకు బహుళ ప్రయోజనాలు చేకూర్చేందుకు ఫాంపాండ్స్, సాగునీటి కాలువలు, చెరువులను కలిపే విధంగా నిర్మాణాలు చేపడుతున్నట్లు తెలిపారు. పంచాయతీల్లో నిర్వహించిన పనులకు చెల్లింపులు కావడం లేదని సర్పంచ్ అల్లు అప్పలనాయుడు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. కొద్దిరోజుల్లో చెల్లింపులు జరుగుతాయని కలెక్టర్ చెప్పారు. ఉపాధికి సంబంధించి నిధులు సమస్య లేదని, పంచాయతీల వారీగా మంజూరైన పనులను సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డ్వామా పీడీ కె.రామచంద్రరావు, ఎంపీడీవో జి.పైడితల్లి, ఏపీవో ఎం.గౌరీనాథ్, టీడీపీ ప్రతినిధులు, జల వనరులశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.