Share News

Special Focus on Girl Students’ Health విద్యార్థినుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ

ABN , Publish Date - Oct 07 , 2025 | 12:39 AM

Special Focus on Girl Students’ Health గిరిజన విద్యార్థినుల ఆరోగ్యమే తమకు ప్రధానమని, వారిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. కురుపాం ఘటనను రాద్దాంతం చేసి రాజకీయం చేయడం వైసీపీకి తగదన్నారు.

Special Focus on Girl Students’ Health  విద్యార్థినుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ
విద్యార్థులను పరామర్శిస్తున్న మంత్రులు అచ్చెన్నాయుడు, సంధ్యారాణి

  • ఇన్‌చార్జి మంత్రితో కలిసి జిల్లాకేంద్రాసుపత్రి సందర్శన

  • బాలికలు పూర్తిగా కోలుకునే వరకు వైద్యం అందించాలని ఆదేశం

పార్వతీపురం/బెలగాం, అక్టోబరు6(ఆంధ్రజ్యోతి): గిరిజన విద్యార్థినుల ఆరోగ్యమే తమకు ప్రధానమని, వారిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. కురుపాం ఘటనను రాద్దాంతం చేసి రాజకీయం చేయడం వైసీపీకి తగదన్నారు. జిల్లా కేంద్రాసుపత్రిలో పచ్చకామెర్లతో చికిత్స పొందుతున్న కురుపాం విద్యార్థినులను సోమవారం ఆమెతో పాటు జిల్లా ఇన్‌చార్జి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ప్రభుత్వ విప్‌ తోయక జగదీశ్వరి, ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర, కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి తదితరులు పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. బాలికలు త్వరగా కోలుకునే విధంగా వైద్యం అందించాలని ఆదేశించారు.

అసత్య ప్రచారాలు తగవు

అనంతరం మంత్రి సంధ్యారాణి విలేఖర్లతో మాట్లాడుతూ.. ‘దసరా సెలవుల్లో ఇళ్లకు వెళ్లిన గురుకులం విద్యార్థినులు అనారోగ్యపాలై మృతి చెందారు. దీంతో జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశాం. కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి ఆదేశాలతో వైద్య సిబ్బంది కురుపాం గురుకుల విద్యార్థినుల ఇళ్లకు వెళ్లి వారితో పాటు తల్లిదండ్రుల రక్త నమూనాలు సేకరించారు. వాటిని ల్యాబ్‌లో పరీక్షంచగా.. పచ్చకామెర్లు ఉన్న బాలికలను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాం. జాండీస్‌ లక్షణాలు ఎక్కువగా ఉన్న వారిని మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్‌కు పంపించాం. ఇందులో ఒకరికి సికిల్‌ సెల్‌ అనీమియా ఉన్నట్లు గుర్తించాం. విద్యార్థినుల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని జిల్లా యంత్రాంగం పనిచేస్తుంటే .. దీనిపై వైసీపీ నాయకులు అసత్య ప్రచారాలు చేయడం ఎంతవరకు సమంజసం. ఇద్దరు బాలికలు మృతి చెందితే 11 మంది మృతి చెందారని అవగాహన రాహిత్యంతో మాజీ సీఎం జగన్‌ మాట్లాడుతున్నారు. సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు తనను ఉద్దేశించి గాడిదలు కాస్తున్నారా? అని సంభోదించడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా.. ఆయన వ్యాఖ్యలు చూస్తుంటే.. గిరిజనులు, మహిళలంటే గౌరవం లేదని స్పష్టమవుతోంది. ఇకపై ఇలా మాట్లాడితే సహించేది లేదు. సీఎం చంద్రబాబు గురించి మాట్లాడే హక్కు ఆయనకు లేదు.’ అని తెలిపారు.

నాడు ఒక్కరైనా పరామర్శించారా?

వైసీపీ హయాంలో 108 మంది విద్యార్థులు మృతి చెందితే జగన్‌ గాని, వైసీపీ నాయకులు గాని పరామర్శించారా? అని మంత్రి సంధ్యారాణి ప్రశ్నించారు.‘ అప్పట్లో పాము కాటు వల్ల కురుపాంలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. రక్షణ గోడ లేకపోవడం వల్ల ఈ ఘటన సంభవించింది. అయితే ఇవి అప్పటి ప్రభుత్వ హత్యలా? గత వైసీపీ పాలనలో కురుపాం గురు కులంలో పూర్తిస్థాయిలో మరుగుదొడ్లు ఏర్పాటు చేయలేదు. ప్రస్తుతం అక్కడ 40 మరుగుదొడ్లు అదనంగా నిర్మిస్తున్నాం. ఆర్వో ప్లాంట్‌ ఏర్పాటు చేస్తున్నాం. ఇక కురుపాం గురుకుల విద్యార్థిను లందరూ బాగానే ఉన్నారు. వారు పూర్తిగా కోలుకునే వరకు చికిత్స అందించి ఆ తర్వాత డిశ్చార్జి చేస్తాం. వారి ఆరోగ్యంపై ప్రత్యేక పర్యవేక్షణ ఉంటుంది. రాష్ట్రంలో 199 గురు కులాలు, 371 ఆశ్రమ పాఠశాలలు, 187 విద్యాలయాలకు చెందిన వసతి గృహాల్లో అదనపు మరుగుదొడ్లు, తరగతి గదులు, ఇతర మౌలిక వసతుల కోసం రూ.155 కోట్లు మంజూరు చేశాం. కాస్మెటిక్‌ చార్జీలు కూడా ఇస్తున్నాం. ’ అని తెలిపారు. మంత్రుల వెంట జేసీ యశ్వంత్‌కుమార్‌ రెడ్డి, సబ్‌ కలెక్టర్‌ వైశాలి, డీసీహెచ్‌ఎస్‌ నాగభూషణరావు, డీఎంహెచ్‌వో భాస్కరరావు, సూపరింటెండెంట్‌ నాగశివజ్యోతి తదితరులు ఉన్నారు.

అన్ని పాఠశాలల్లో వైద్య పరీక్షలు

కురుపాం, అక్టోబరు16(ఆంధ్రజ్యోతి): కురుపాం ఘటనను కేస్‌ స్టడీగా తీసుకుని జిల్లాలోని అన్ని గిరిజన సంక్షేమ ఆశ్రమ, గురుకుల పాఠశాలల్లో ప్రత్యేక బృందాలతో విద్యార్థులకు వైద్య పరీక్షలు చేయించనున్నామని జిల్లా ఇన్‌చార్జి మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. సోమవారం ఆయన కురుపాం గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలను సందర్శించారు. తొలుత వైద్య, గిరిజన సంక్షేమ, ఇంజనీరింగ్‌ శాఖాధికారులతో సమీక్షించారు. విద్యార్థినుల అస్వస్థతకు గల కారణాలపై సమగ్ర నివేదిక అందించాలని ఆదేశించారు. అనంతరం విలేఖర్లతో మాట్లాడుతూ.. ‘అస్వస్థతకు గురైన కురుపం విద్యార్థినులంతా కోలుకుంటున్నారు. విశాఖ కేజీహెచ్‌లో ఉన్న 43 మంది ఆరోగ్యం కూడా మెరుగైంది. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. బాధిత కుంటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది. కురుపాం పాఠశాలలో బాలికలు ఎక్కువగా ఉండగా పూర్తిస్థాయిలో వసతి సౌకర్యం లేదు. ఈ పాఠశాలకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించి ఒక మోడల్‌గా తీర్చిదిద్దుతాం.’ అని తెలిపారు. ఆయన వెంట సబ్‌ కలెక్టర్‌ పవార్‌ స్వప్నిల్‌ జగన్నాథ్‌, డీడీ కృష్ణవేణి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వీరేష్‌ చంద్రదేవ్‌ తదితరులు ఉన్నారు.

మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నాం.. : డీఎంహెచ్‌వో

కురుపాం, అక్టోబరు6(ఆంధ్రజ్యోతి): పార్వతీపురం జిల్లాకేంద్రాసుపత్రిలో ప్రస్తుతం 93 మంది కురుపాం గురుకుల బాలికలు వైద్య సేవలు పొందుతున్నారని, విశాఖ కేజీహెచ్‌లో 43 మంది ఉన్నారని డీఎంహెచ్‌వో భాస్కరరావు తెలిపారు. విద్యార్థినులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నమని, వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడించారు. సోమవారం కురుపాం గురుకులంతో పాటు పక్కనే ఉన్న ఏకలవ్య పాఠశాలను సందర్శించారు. విద్యార్థులకు జరుపుతున్న వైద్య పరీక్షలను పరిశీలించారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని సీహెచ్‌సీలు, జిల్లా ఆసుపత్రిలో చేర్పిస్తున్నామన్నారు. ఇళ్లకు చేరిన విద్యార్థినులను ఏఎన్‌ఎంలు, ఎంఎల్‌హెచ్‌పీలు, ఆశావర్కర్లు పర్యవేక్షిస్తారని తెలిపారు. ఈ పరిశీలనలో డీప్యూటీ డీఎంహెచ్‌వో పద్మావతి, డీఎంవో వై.మణి, జిల్లా ప్రోగాం అధికారి టి.జగన్మోహనరావు తదితరులు ఉన్నారు.

Updated Date - Oct 07 , 2025 | 12:39 AM