విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ
ABN , Publish Date - Oct 09 , 2025 | 11:45 PM
జిల్లాలో ప్రతి విద్యార్థి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు.
కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి
కురుపాం/రూరల్, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ప్రతి విద్యార్థి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం కురుపాం సామాజిక ఆరోగ్యకేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఆసుపత్రిలోని రికార్డులను తనిఖీ చేసి వైద్య సేవలపై డాక్టర్ సునీల్‌ను అడిగి తెలుసుకున్నారు. అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కురుపాం గురుకుల విద్యార్థుల్లో 70 మందిని డిశ్చార్జి చేసి ఇళ్లకు పంపించినట్లు వైద్యులు తెలిపారు. మరో 12 మంది గురువారం డిశ్చార్జి అయినట్లు చెప్పారు. ప్రతి విద్యార్థికీ ఏఎన్‌ఎం, కార్యదర్శి, వీఆర్వోలను అటాచ్ చేస్తూ వారి బాగోగులను ప్రతిరోజూ తెలుసుకుంటున్నట్లు కలెక్టర్ వివరించారు. విద్యార్థులు బాగా చదువుకుని మంచి ఉపాధి అవకాశాలు పొందాలని ఆకాంక్షించారు. కొత్తగా నిర్మిస్తున్న కురుపాం ఆసుపత్రిని పరిశీలించి వెంటనే పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం దండుసూర గ్రామంలో ప్రతి ఇంటినీ కలెక్టర్ సందర్శించారు. వృద్ధులు, గర్భిణిలు, పిల్లలు, విద్యార్థులు, యువతను కలిసి ముచ్చటించారు. ప్రతిఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతను తప్పనిసరిగా పాటించాలని, మరుగుదొడ్లను వినియోగించాలని సూచించారు. చిన్నపాటి ఆరోగ్య సమస్య ఉన్నా వెంటనే ఆశావర్కర్ లేదా ఏఎన్‌ఎంకు తెలియజేయాలన్నారు. ఇంటికే వాహనం పంపి వారిని ఆస్పత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తామని తెలిపారు. కురుపాం గురుకుల పాఠశాల విద్యార్థినులు అస్వస్థతకు గురైన నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా ఆ గ్రామంలో కూడా ప్రత్యేక పారిశుధ్య పనులు చేపడుతున్నట్లు కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో పాలకొండ సబ్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ జగన్నాథ్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఎస్.భాస్కరరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.