Hostel Students వసతిగృహ విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ
ABN , Publish Date - Aug 20 , 2025 | 12:07 AM
Special Attention to the Health of Hostel Students జిల్లాలో వెనుకబడిన తరగతులు, సాంఘిక సంక్షేమ వసతిగృహ విద్యార్థుల ఆరోగ్యం, విద్యపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్ ఆదేశిం చారు. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
పార్వతీపురం, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో వెనుకబడిన తరగతులు, సాంఘిక సంక్షేమ వసతిగృహ విద్యార్థుల ఆరోగ్యం, విద్యపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్ ఆదేశిం చారు. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. మంగళవారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో మాట్లాడుతూ.. ఏటా టెన్త్‌లో వసతిగృహ విద్యార్థుల ఉత్తీర్ణత బాగుంది. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా కొనసాగాలి. ఒక్కో హాస్టల్‌ను ఒక మండల ప్రత్యేకాధికారి దత్తతను తీసుకున్నారు. వారి సందర్శన సమయంలో వసతిగృహంలో ఎటువంటి లోటుపాట్లు ఉండరాదు. విద్యార్థులకు సంబంధించి హెల్త్ రిజిస్టర్లు నిర్వహించాలి. భవిత కార్డులను కూడా వినియోగించాలి. హాస్టలో గదుల్లో వెలుతురు, గాలి వచ్చేలా ట్యూబ్‌లైట్లు , ఫ్యాన్స్ ఉండాలి.’ అని తెలిపారు.
మెరుగైన వైద్యసేవలు అందించాలి
పార్వతీపురం రూరల్: రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించి వారి మన్ననలు పొందా లని కలెక్టర్ ఆదేశించారు. డోకిశిలా పీహెచ్‌సీని సందర్శించి.. రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. అనంతరం మందులు, రికార్డులు పరిశీలించారు. అక్కడి నుంచి పుట్టూరు గ్రామానికి ఆయన వెళ్లగా గామస్థులు, రైతుల విన్నపం మేరకు సాకిగెడ్డను పరిశీలించారు. తక్షణమే ఆ ప్రాంతంలో ఆక్రమణలు తొలగించాలని ఆదేశించారు. గెడ్డ వరద ప్రవాహం పంటలపై రాకుండా చూడాలని ఇరిగేషన్ శాఖ అధికారులకు సూచించారు.
అడారి గెడ్డ పరిశీలన
మక్కువ రూరల్: దుగ్గేరుకు సమీపంలోని అడారిగెడ్డను కలెక్టర్ పరిశీలించారు. ఈ నెల 15న ఇద్దరు వ్యక్తులు బైక్‌తో పాటు గెడ్డ వరద ఉధృతిలో కొట్టుకుపోయి.. తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. దీనిపై పత్రికల్లో కథనాలు రావడంతో కలెక్టర్ మంగళవారం ఆప్రాంతాన్ని సందర్శించారు. గెడ్డవాగు ప్రాంతాల్లో ప్రజలకు ముప్పువాటికల్లకుండా హెచ్చరిక బోర్డులు పెట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అంతకుముందు ఆయన గుంటభద్ర సమీపం లో మినీ వంతెన నిర్మాణానికి ప్రతిపాదించిన గెడ్డ ప్రాంతాన్ని పరిశీలించారు. గత ప్రభుత్వ హయాంలో దుగ్గేరు-మెండంగి మధ్య అడారిగెడ్డపై వంతెన నిర్మాణానికి రూ.6కోట్లు మంజూరు కాగా కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో నిధులు రద్దయినట్లు ఇంజనీరింగ్ అధికారులు వివరించారు. నవంబరు తరువాత వంతెన నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఇదే సమయంలో వంతెన నిర్మాణంపై ఆదివాసి ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ జేఏసీ రాష్ట్రకార్యదర్శి మండల గిరిదర వినతి పత్రం అందజేశారు. ఆ తర్వాత కలెక్టర్ దుగ్గేరులేని ఎరువుల షాపును తనిఖీ చేశారు. స్టాకు వివరాలు, బిల్లు బుక్కులు పరిశీలించారు. జిల్లాలో యూరియా స్టాకు లేదని, త్వరలో రప్పిస్తామని ఆయన స్థానిక రైతులు తెలియజేశారు. నానో యూరియా, డీఏపీ వాడడం వల్ల అఽధిక దిగుబడులు వస్తాయన్నారు.