Something has to be decided! ఏదో ఒకటి తేల్చాల్సిందే!
ABN , Publish Date - Jun 01 , 2025 | 11:35 PM
Something has to be decided!శృంగవరపుకోట మండలం కిల్తంపాలెం, మూలబొడ్డవర, చినఖండేపల్లి, చీడిపాలెం, ముషిడిపల్లి గ్రామ పరిధిలో దాదాపు 600 కటుంబాల నుంచి 1127.76 ఎకరాలను పదిహేనేళ్ల క్రితం జిందాల్ సౌత్ వెస్ట్ అల్యూమినా పరిశ్రమ (జిందాల్) స్థాపన కోసం తీసుకున్నారు. ఇంతవరకు ఈ భూముల్లో ఎటువంటి పరిశ్రమ నిర్మాణం జరగలేదు. కనీసం పునాదిరాయి పడలేదు.
ఏదో ఒకటి తేల్చాల్సిందే!
భూములు తిరిగిచ్చేయండి
ప్రభుత్వమైనా స్వాధీనం చేసుకోవాలి
జిందాల్ నిర్వాసితుల డిమాండ్
రాజుకుంటున్న వివాదం
పరిశ్రమ స్థాపించకపోవడంపై ఆగ్రహం
పెద్దల సహకారంతో ఉద్యమ బాట
ఎంఎస్‌ఎంఈ పార్కు పేరుతో నమ్మబలుకుతున్న యాజమాన్యం
జిందాల్ నిర్వాసితులతో పోరాడుతాం.
పరిశ్రమ స్థాపిస్తామని రైతుల నుంచి జిందాల్ యాజమానులు భూములు తీసుకున్నారు. భూములిచ్చినవారిలో ఎకరా, రెండు ఎకరాల పొలం ఉన్న గిరిజన రైతులే ఎక్కువ. వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న వారంతా భూములు ఇచ్చేందుకు తొలుత నిరాకరించారు. పరిశ్రమ నిర్మాణంతో ఈ ప్రాంతం జీవన స్థితిగతులు మారుతాయని, ఉపాధి దొరుకుతుందని నమ్మబలికి భూములు ఇచ్చేలా ఒప్పించారు. ఇది జరిగి పదిహేను సంవత్సరాలు గడుస్తోంది. కనీసం పునాది రాయి పడలేదు. అడిగినప్పుడల్లా పరిశ్రమ పెడతామంటున్నారు. గిరిజన రైతులకు ఇటు వ్యవసాయం చేసుకొనేందుకు భూమి లేక, ఉపాధికి నోచుకోక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. దీంతో తిరిగి తమ భూములు తమకు ఇప్పించాలని అడుగుతున్నారు. కుదరకపోతే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. లేకుంటే భూ నిర్వాసిత రైతులతో పోరాడుతాం.
- ఇందుకూరి రఘురాజు, ఎమ్మెల్సీ
రైతులతో చర్చించాలి
జిందాల్ పరిశ్రమ ఏర్పాటుకు మూడు ఎకరాల భూమిని అప్పగించాను. 2008లో ఈ ప్రాంతంలో భూములు తీసుకున్న యాజమాన్యం పరిశ్రమను స్థాపించలేదు. దీంతో గత కొంత కాలంగా రైతులతో సమావేశం ఏర్పాటు చేయాలని జిందాల్ యాజమాన్యాన్ని కోరుతున్నాం. దీనికి ముందుకు రాకుండా మూడు సంవత్సరాలుగా ఏటా ఎంఎస్‌ఎంఈ పార్కులను స్థాపిస్తామని చెబుతూ వస్తోంది. ఆచరణలో కనిపించడం లేదు. తీసుకున్న భూముల్లో పరిశ్రమ నిర్మాణం జరగక ఇటు ఉద్యోగాలు లేక ఆటు వ్యవసాయం చేసుకొనే వీలులేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాం. రైతులతో సమావేశం ఏర్పాటు చేయడంతో పాటు అన్ని విషయాలపై చర్చ జరపాలి.
- కర్రి సత్యనారాయణ, అధ్యక్షుడు,
శ్రీరామ జిందాల్ భూ నిర్వాసితుల సేవా సమితి
శృంగవరపుకోట, జూన్1 (ఆంధ్రజ్యోతి):
శృంగవరపుకోట మండలం కిల్తంపాలెం, మూలబొడ్డవర, చినఖండేపల్లి, చీడిపాలెం, ముషిడిపల్లి గ్రామ పరిధిలో దాదాపు 600 కటుంబాల నుంచి 1127.76 ఎకరాలను పదిహేనేళ్ల క్రితం జిందాల్ సౌత్ వెస్ట్ అల్యూమినా పరిశ్రమ (జిందాల్) స్థాపన కోసం తీసుకున్నారు. ఇంతవరకు ఈ భూముల్లో ఎటువంటి పరిశ్రమ నిర్మాణం జరగలేదు. కనీసం పునాదిరాయి పడలేదు. ఈ పరిశ్రమను ఇక్కడ నిర్మించే అవకాశమే లేదని తెలుస్తోంది. 15 ఏళ్లుగా నిరీక్షించిన నిర్వాసిత రైతులు భూములను తిరిగిచ్చేయాలని లేదంటే ప్రభుత్వ భూములుగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందుకోసం ఉద్యమానికి సిద్ధమవుతున్నారు.
రాష్ట్ర విభజన అనంతరం ఏర్పడిన టీడీపీ ప్రభుత్వం అరకులో బాక్సైట్ తవ్వకాలను నిషేధించింది. జిందాల్ పరిశ్రమకు ఇదే ముడిసరుకు. దీంతో పరిశ్రమ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. గత వైసీపీ ప్రభుత్వం బాక్సైట్ తవ్వకాలకు అనుమతులు ఇచ్చేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. బాక్సైట్ తవ్వకాలకు గిరిజనులు ఒప్పుకోలేదు. గిరిజన ప్రాంతాల్లో ఆదరణ కోల్పోతామని భయపడిన వైసీపీ తర్వాత బాక్సైట్ జోలికి పోలేదు. అయితే ఎస్.కోటలో జిందాల్ పరిశ్రమకు భూములిచ్చిన రైతులను సంతృప్తి పరిచేందుకు సార్వత్రిక ఎన్నికలకు రెండేళ్ల ముందునుంచి ఎంఎస్‌ఎంఈ పార్కు(మైక్రో స్మాల్ మీడియం ఎంటర్‌ప్రైజెస్)ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటిస్తూ వచ్చింది. కానీ చేయలేదు. ఇప్పుడు తిరిగి జనసేన, బీజేపీలతో కలసి టీడీపీ అధికారంలో ఉంది. బాక్సైట్ తవ్వకాలకు అడ్డుపడిన ఈ పార్టీ తిరిగి పునఃసమీక్షించుకొనే అవకాశం లేదు. ఇక ఈ భూముల్లో పరిశ్రమ వచ్చే అవకాశం లేదు.
భూసేకరణ ద్వారా జిందాల్ యాజమాన్యం 208.54 ఎకరాల ప్రభుత్వ భూములు, 919.22 ఎకరాలు డి.పట్టా భూములను 2008లో ప్రభుత్వం నుంచి రిజిస్ట్రేషన్ చేయించుకుంది. ఆ సమయంలో షేర్లు, ఉద్యోగాలు, ఇళ్లు లేని వారికి నివాసాలు, విద్యుత్ సదుపాయంతో రోడ్లు, సామాజిక భవనం, ఉపాది అవకాశాల మెరుగుకు శిక్షణ కేంద్రం, ఆరోగ్య కేంద్రం, చైల్డ్ కేర్ సెంటర్, చిన్న పిల్లల సంరక్షణతో పాటు ప్రాథమిక పాఠశాల, ఆటస్థలాలు, పశువుల సంరక్షణకు స్థలం వంటి సదుపాయాలను కల్పిస్తామని నమ్మబలికారు. ఇవేవీ జరగలేదు.
కాగా అప్పట్లో రెండు వందల కోట్ల రూపాయల ధర ఉన్న ఈ భూమి ఇప్పుడు రెండు, మూడు వేల కోట్లకు చేరింది. భూములిచ్చిన రైతులకు మాత్రం కూలి పని చేసుకొనేందుకు కూడా అవకాశం లేకుండా పోయింది. ఎకరా భూమికి రూ.2లక్షల వరకు ఇచ్చారు. ఇవి అప్పుడే ఖర్చుపెట్టేశారు. ఖాళీగా వున్న భూమిని తిరిగి ఇచ్చేస్తే వ్యవసాయం చేసుకుంటామని గిరిజన రైతులు ప్రాధేయపడుతున్నారు. కనీసం ప్రభుత్వ భూమిగానైనా ప్రకటించి ఈ భూముల్లో వ్యవసాయం చేసుకొనేందుకు అవకాశం కల్పించాలని అడుగుతున్నారు. స్థానిక పెద్దల సహకారంతో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఉద్యమానికి సిద్ధపడుతున్నారు.