Share News

బడుల్లో సోలార్‌ కాంతులు

ABN , Publish Date - Oct 11 , 2025 | 11:21 PM

పాఠశాలల్లో సోలార్‌ కాంతులు విరజిల్లనున్నాయి. బడుల్లో సోలార్‌ పలకలను అధికారులు ఏర్పాటు చేసి విద్యుత్‌ను ఉత్పత్తి చేయనున్నారు.

బడుల్లో సోలార్‌ కాంతులు

-పీఎం శ్రీ పథకం కింద మూడు పాఠశాలల్లో పలకలు ఏర్పాటు

- విద్యుత్‌ ఉత్పత్తి చేసేలా చర్యలు

- త్వరలో ప్రారంభంకానున్న పనులు

- విద్యార్థులకు తప్పనున్న కరెంటు కష్టాలు

సీతంపేట రూరల్‌, అక్టోబరు 11(ఆంధ్రజ్యోతి): పాఠశాలల్లో సోలార్‌ కాంతులు విరజిల్లనున్నాయి. బడుల్లో సోలార్‌ పలకలను అధికారులు ఏర్పాటు చేసి విద్యుత్‌ను ఉత్పత్తి చేయనున్నారు. తద్వారా విద్యార్థులకు కరెంట్‌ కష్టాలు తప్పడంతో మిగులు విద్యుత్‌ను అమ్మడం వల్ల పాఠశాలలకు ఆదాయం సమకూరనుంది. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు పాఠశాలల్లో మౌలిక సౌకర్యాల కల్పనే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పని చేస్తోన్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి స్కూల్స్‌ ఫర్‌ రైజింగ్‌ ఇండియా(పీఎం శ్రీ) పథకాన్ని 2022లో ప్రవేశపెట్టింది. ఈ పథకం పాఠశాలల పాలిట వరంలా మారింది. దీనికి ఎంపికైన పాఠశాలలను ఆదర్శంగా మార్చడానికి ఇప్పటికే అధికారులు ప్రణాళికలు తయారు చేసి అమలు చేస్తున్నారు. దీనిలో భాగంగా సీతంపేట ఐటీడీఏ పరిధిలోని మూడు పాఠశాలలు పీఎం శ్రీకి గతంలో ఎంపికయ్యాయి. ఈ పాఠశాలల్లో చదువుతున్న గిరిజన విద్యార్థుల కోసం తరగతి గదుల నిర్మాణం, వసతులు కల్పన, బోధనా సదుపాయాలు (నాణ్యమైన విద్య), సాంకేతికతకు అనుగుణంగా ఆధునిక విద్యలో తర్ఫీదు వంటివి అధికారులు అందించనున్నారు. అలాగే, సోలారు పలకలను ఏర్పాటు చేసి విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు చర్యలు చేపడుతున్నారు.

ఐటీడీఏ పరిధిలో ఇలా..

ఉమ్మడి జిల్లాలో పీఎం శ్రీ పథకానికి సీతంపేట ఏపీఆర్‌ బాలుర గురకుల పాఠశాల, బొమ్మిక, వెన్నెలవలస ఆశ్రమ పాఠశాలలు ఎంపికయ్యాయి. ఈ పాఠశాలల్లో మొత్తం వెయ్యి మందికి పైగా గిరిజన విద్యార్థులు చదువుతున్నారు. ఈ పథకం కింద పాఠశాలల్లో మొదటి విడతగా అదనపు భవనాల నిర్మాణాలకు ఇప్పటికే అధికారులు ప్రతిపాదనలు పంపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి భవన నిర్మాణాలకు సంబంధించి నిధులు కూడా మంజూరు కావడంతో త్వరలో పనులు ప్రారంభంకానున్నాయి. అలాగే, ఈ మూడు పాఠశాలల్లో సోలార్‌ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సోలార్‌ యూనిట్ల ఏర్పాటు వల్ల విద్యుత్‌ బిల్లుల భారాన్ని వదిలించుకోవడంతో పాటు అదనంగా వచ్చే విద్యుత్‌ను అమ్మడం ద్వారా ఆయా పాఠశాలలకు ఆదాయం సమకూరనుంది. ఒక్కో పాఠశాలలో 3.25కిలోవాట్ల వరకు విద్యుత్‌ ఉత్పత్తి చేసేలా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. త్వరలో సోలార్‌ విద్యుత్‌ పలకలను అమర్చనున్నారు. దీంతో ఆయా పాఠశాలల్లో నిరంతరం వెలుగులు రానున్నాయి. ఈ విషయమై డిప్యూటీ డైరెక్టర్‌ (టీడబ్ల్యూ)ఎం.అన్నదొరను వివరణ కోరగా.. పాఠశాలల్లో సోలార్‌ యూనిట్ల ఏర్పాటుకు సంబంధించి తమకు ఇంకా సమాచారం అందలేదని అన్నారు.

Updated Date - Oct 11 , 2025 | 11:21 PM