skrbtaifus fever కలకలం
ABN , Publish Date - Dec 18 , 2025 | 12:18 AM
skrbtaifus fever గరివిడి మండలం ఓ గ్రామానికి చెందిన బాలికకు స్క్రబ్ టైఫస్ లక్షణాలు ఇటీవల కనిపించాయి. ఆమెను విశాఖలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆ బాలిక కాలుపై పురుగు కుట్టింది. ఆ భాగంలో నల్లని మచ్చ ఏర్పడింది. తీవ్రమైన జ్వరం, శ్వాస కోస ఇబ్బందులతో బాధపడుతోంది.
కలకలం
ఎక్కడికక్కడ స్క్రబ్ టైఫస్ కేసులు
గ్రామాల్లో ఎక్కువగా నమోదు
అందుబాటులో చికిత్స
నిర్లక్ష్యం చేయొద్దంటున్న వైద్యులు
శృంగవరపుకోట, డిసెంబరు 17(ఆంధ్రజ్యోతి):
- గరివిడి మండలం ఓ గ్రామానికి చెందిన బాలికకు స్క్రబ్ టైఫస్ లక్షణాలు ఇటీవల కనిపించాయి. ఆమెను విశాఖలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆ బాలిక కాలుపై పురుగు కుట్టింది. ఆ భాగంలో నల్లని మచ్చ ఏర్పడింది. తీవ్రమైన జ్వరం, శ్వాస కోస ఇబ్బందులతో బాధపడుతోంది.
ఇలా జిల్లాలో ఇటీవల కొందరిలో స్క్రబ్ టైఫస్ అనుమానిత లక్షణాలు కనిపించాయి. ఎక్కడికక్కడ కేసులు వస్తుండడంతో ప్రజలు కలవర పడుతున్నారు. దీంతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. అవగాహన సదస్సులు నిర్వహిస్తోంది. పాంప్లెట్స్ ద్వారా వ్యాధి సోకేందుకు గల కారణాలను వివరిస్తోంది. జాగ్రత్తలను కూడా చెబుతోంది. స్క్రబ్ టైఫస్‌ను పూర్తిగా నివారించేందుకు ప్రభుత్వం కూడా వేగంగా కదులుతోంది. జాతీయ స్థాయి వైద్యనిపుణులతో ప్రత్యేక టాస్క్‌ఫోర్సు ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. పశువులు ఆవాసం ఉండే చోట చిగ్గర్ మైట్ అనే క్రిమి మనుషులను కుడితే స్క్రబ్ టైఫస్ సోకుతుందని వైద్యులు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పశువులు, గడ్డి, పొదలు ఉండే ప్రాంతాల్లో తిరిగే పెద్దలు, పిల్లలు, ఎక్కువగా స్క్రబ్ టైఫస్ వ్యాధి బారిన పడే ప్రమాదం ఉంది. నగరాలు, పట్టణ ప్రాంతాల వారికి దీని ముప్పు తక్కువే. ఈ కీటకం కుట్టిన చోట నల్లటి మచ్చ ఏర్పడుతుంది. వ్యాధి లక్షణాలు ఎక్కువగా మలేరియాను పోలి ఉంటాయి. తీవ్రమైన జ్వరం, ఒళ్లు నొప్పులు, తలనొప్పి, గొంతులోని లింఫ్‌నోడ్ గ్రంథులు ఉబ్బడం లాంటివి కనిపిస్తాయి. ప్రాథమిక దశలో చికిత్స అందకపోతే మెదడు, కాలేయం, మూత్రపిండాలు తదితర అవయవాలపై దుష్ప్రభావం పడుతుంది. కొన్ని సందర్భాల్లో ప్రాణాలకు ముప్పుతెస్తుంది. చలికాలంలో స్క్రబ్ టైఫస్ ఎక్కువగా సోకే ప్రమాదం ఉంది. వ్యాధి లక్షణాలు బయటపడడానికి సాధారణంగా 6 నుంచి 21రోజుల సమయం పడుతుంది.
జాగ్రత్తలు అవసరం
స్క్రబ్ టైఫస్ అనేది చిన్న సైజు పురుగు ద్వారా వస్తుంది. ఈ పురుగు గడ్డి, గోదాముల్లో ఎక్కువగా తిరుగుతుంది. ఆ ప్రాంతాల్లో చిన్నపిల్లలు తిరగకుండా చూడాలి. ఇది కుడితే రాస్‌లా వస్తుంది. చలి, జ్వరం, వాంతులు, నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. వెంటనే చికిత్స తీసుకోవాలి. గడ్డిలోకి వెళ్లినప్పుడు కాళ్లకు బూట్లు, చేతులకు గ్లౌజ్‌లు వేసుకోవాలి. శరీరమంతా కప్పేలా దుస్తులు ధరించాలి.
- డాక్టర్ ఎస్.వి సత్యశేఖర్, సివిల్ అసిస్టెంట్ సర్జన్