Share News

Six years of waiting! ఆరేళ్లుగా ఎదురుచూపులు!

ABN , Publish Date - Sep 01 , 2025 | 12:27 AM

Six years of waiting! జిల్లాలో ఒకరు కాదు..ఇద్దరు కాదు 5753 మంది ‘పెళ్లికానుక’ కోసం వైసీపీ హయాంలో దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కరికీ కానుక అందలేదు.

Six years of waiting! ఆరేళ్లుగా ఎదురుచూపులు!

ఆరేళ్లుగా ఎదురుచూపులు!

విడుదల కాని ‘పెళ్లికానుక’ నిధులు

5753 మందికి రూ.30.77 కోట్లు పెండింగ్‌

రూపాయి విడుదల చేయని వైసీపీ ప్రభుత్వం

ఇంకా దృష్టిసారించని కూటమి ప్రభుత్వం

- రాజాంకు చెందిన రమేష్‌ది నిరుపేద కుటుంబం. 2022లో కుమార్తెకు వివాహం చేశారు. దాదాపు రూ.5 లక్షల వరకూ ఖర్చుచేశారు. పెళ్లికానుకకు దరఖాస్తు చేసుకున్నారు. బ్యాంకు ఖాతాలో నగదు జమ అవుతుందని అప్పట్లో అధికారులు చెప్పుకొచ్చారు. అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేశారు. మూడేళ్లు దాటుతుండడంతో పెళ్లికానుకపై ఆశలు వదులుకున్నాడు.

- విజయనగరానికి చెందిన చిరు వ్యాపారి పాపారావు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ మూడేళ్ల కిందట అతి కష్టమ్మీద కుమార్తె వివాహం చేశాడు. పెళ్లికానుకపై ఆశలు పెట్టుకున్నాడు. ఆ డబ్బులు వస్తే అప్పుల ఒత్తిడి నుంచి కొంత వెసులుబాటు లభిస్తుందని భావించాడు. దరఖాస్తు చేసుకొని ఏళ్లు గడుస్తున్నా ఇంతవరకూ సాయం లేదు.

రాజాం, ఆగస్టు31(ఆంధ్రజ్యోతి):

జిల్లాలో ఒకరు కాదు..ఇద్దరు కాదు 5753 మంది ‘పెళ్లికానుక’ కోసం వైసీపీ హయాంలో దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కరికీ కానుక అందలేదు. దాదాపు రూ.30.77 కోట్లు చెల్లించాల్సి ఉంది. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత పథకంపై కదలిక వచ్చింది కానీ చెల్లింపులు మాత్రం జరగడం లేదు. దీంతో కానుక కోసం పేదింటి తల్లిదండ్రులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

పేదిళ్లలో పిల్లల వివాహం తల్లిదండ్రులకు ఆర్థిక భారం. చేతిలో లక్షలాది రూపాయలు ఉండాల్సిందే. స్థోమత ఉన్నవారికి పర్వాలేకున్నా.. సామాన్య, మధ్యతరగతి వారికి రుణం తప్పదు. కొందరైతే ఉన్న ఆస్తిని విక్రయించి పిల్లల పెళ్లిళ్లు చేస్తుంటారు. అటువంటి వారి కోసం టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రన్న పెళ్లి కానుక పేరిట పథకాన్ని ప్రకటించారు. అమలుచేసే బాధ్యతను వెలుగు శాఖకు అప్పగించారు. వివాహమైన కోద్దిరోజులకే నగదు మొత్తాన్ని అందించే ఏర్పాట్లు చేసేవారు. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చాక పథకాన్ని పట్టించుకోలేదు. దరఖాస్తు చేసుకున్నా నిధులు ఇవ్వడం లేదు. దరఖాస్తుదారుల సంఖ్య 5,753కు చేరింది. ప్రోత్సాహకం చెల్లించకపోవడంతో కొన్నేళ్లుగా కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య తగ్గిపోయింది. గత టీడీపీ ప్రభుత్వంలో బీసీ అయితే రూ.35 వేలు, బీసీ అయి ఉండి కులాంతర వివాహం చేసుకుంటే రూ.50 వేలు, ఎస్సీలకు రూ.40 వేలు, వధువు ఎస్సీ అయి ఉండి కులాంతర వివాహం చేసుకుంటే రూ.75 వేలు, ఎస్టీలకు రూ.75 వేలు పెళ్లికానుకగా అందించేవారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న 2019 వరకూ ఎప్పటికప్పుడు సక్రమంగా చెల్లింపులు జరిగాయి. వైసీపీ వచ్చాక పథకం పడకేసింది.

రిజిస్ర్టేషన్లకే వైసీపీ పరిమితం

వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు రావడంతో 2020 సెప్టెంబరులో పథకానికి పేరు మార్చింది. వైఎస్సార్‌ పెళ్లి కానుకగా మార్చి సాయాన్ని సైతం పెంచుతున్నట్టు ప్రకటించింది. ఎస్సీ వధువుకు రూ.లక్ష, కులాంతర వివాహం చేసుకుంటే రూ.1.20 లక్షలు, ఎస్టీ అయితే రూ.లక్ష, కులాంతర వివాహం చేసుకుంటే రూ.1.20 లక్షలు, బీసీలైతే రూ.50 వేలు, కులాంతర వివాహం అయితే రూ.75 వేలు, మైనార్టీలకు రూ.లక్ష, దివ్యాంగులకు రూ.1.50 లక్షలు, కార్మిక కుటుంబాలకు రూ.40 వేలు అందిస్తామని చెప్పింది. కానీ ఆ నాలుగేళ్లలో ఒక్క రూపాయి అందించిన దాఖలాలు లేవు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఉత్తర్వులు వస్తాయని భావించినా..ఎటువంటి కదలిక లేకపోవడంతో లబ్ధిదారులకు ఇప్పుడూ నిరాశ తప్పడం లేదు.

ప్రభుత్వానికి నివేదించాం

ప్రస్తుతం రిజిస్ర్టేషన్‌ వెబ్‌సైట్‌ నిలిచిపోయింది. దరఖాస్తుల వివరాలను ప్రభుత్వానికి ఇప్పటికే నివేదించాం. జిల్లాలో ఐదు వేల మందికిపైగా రిజిస్ర్టేషన్‌ చేసుకున్నారు. దీనిపై రాష్ట్ర స్థాయిలో నిర్ణయం తీసుకోవాలి. ప్రభుత్వం నిధులు విడుదల చేసిన వెంటనే లబ్ధిదారుల ఖాతాల్లో జమచేసే ఏర్పాట్లు చేస్తున్నాం.

- శ్రీనివాస్‌, డీఆర్డీఏ పీడీ, విజయనగరం

Updated Date - Sep 01 , 2025 | 12:27 AM