Sirimanu works speed సిరిమాను పనులు షురూ..
ABN , Publish Date - Oct 04 , 2025 | 12:56 AM
Sirimanu works speed పైడిమాంబ సిరిమానోత్సవానికి రథ చక్రాలు సిద్ధమవుతున్నాయి. పూజారి బంటుపల్లి వెంకటరావు నివాసముండే హుకుంపేటలో రథాలను వండ్రంగులు తయారు చేస్తున్నారు.
సిరిమాను పనులు
షురూ..
చివరి దశకు చేరిన రథాల తయారీ
పర్యవేక్షిస్తున్న అధికారులు
విజయనగరం కల్చరల్, అక్టోబరు 3 (ఆంఽధ్రజ్యోతి): పైడిమాంబ సిరిమానోత్సవానికి రథ చక్రాలు సిద్ధమవుతున్నాయి. పూజారి బంటుపల్లి వెంకటరావు నివాసముండే హుకుంపేటలో రథాలను వండ్రంగులు తయారు చేస్తున్నారు. కొన్ని రథాలకు చక్రాలన్నీ ఉన్నప్పటికీ వాటి పీటలు, ఇరుసులను కొత్తవి ఏర్పాటు చేస్తున్నారు. సిరిమానును నాటుబండిపై ఊరేగించడం ఆనవాయితీ. దీంతో పాటు జాలరి వల, అంజలి రథం, పాలధార రథాలకు సంబంధించిన బండ్లు పూజారి పర్యవేక్షణలో రూపుదిద్దుకుంటున్నాయి. ఇటీవల గంట్యాడ మండలం కొండతామరాపల్లి నుంచి సిరిమాను చెట్టును విజయనగరం తీసుకువస్తుండగా రామవరం వద్ద బండి చక్రం విరిగిపోయిన సంఘటన తెలిసిందే. గతంలో కూడా సిరిమానోత్సవంలో ఇలాంటి సంఘటనలు జరిగాయి. ఈ నేపథ్యంలో అధికారులు, సిరిమానోత్సవానికి సంబంధించిన అన్ని రథాలను పక్కాగా తయారుచేసి నాణ్యతలో రాజీ పడకుండా చూస్తున్నారు. సిరిమాను చెట్టు మానుగా మలిచే ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఆదివారం నాటికి సిరిమానుతో పాటు రథచక్రాలన్నీ సిద్ధం చేయడానికి ఏర్పాట్లు ఊపందుకున్నాయి.
పైడిమాంబ ఆలయానికి ధర్మకర్తల మండలి
విజయనగరం రూరల్, అక్టోబరు 3(ఆంధ్రజ్యోతి): పైడిమాంబ ఆలయ ధర్మకర్తల మండలిని నియమిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రంలోని అన్ని ప్రముఖ ఆలయాలకు ధర్మకర్తల మండళ్లని నియమించినా ఈ దేవస్థానానికి ఇంతవరకు నియామకం జరగలేదు. ఇదే విషయమై ఆంధ్రజ్యోతిలో పలు కథనాలు వచ్చాయి. తాజాగా ప్రభుత్వం ధర్మకర్తల మండలిని నియమిస్తూ శుక్రవారం నిర్ణయం తీసుకుంది. ధర్మకర్తల మండలికి చైర్మన్‌గా దేవస్థానం వంశ పారంపర్య ధర్మకర్త పూసపాటి అశోక్‌గజపతిరాజు, సభ్యులుగా కె.కామేశ్వరరావు, జి.ఆనందరావు, ఎల్.కుమారి, వి.వెంకటలక్ష్మీ, డి.కృష్ణంరాజు, పి.రామయ్యపంతులు, ఎల్.స్వాతికుమారి, కె.తులసీ, డి.పద్మావతి, కె.గోపాల్‌రెడ్డి నియమితులయ్యారు.
- ప్రభుత్వ ధర్మకర్తల మండలికి సంబంధించి ఉత్తర్వులు ఇవ్వడంతో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. సోమవారం తొలేళ్ల ఉత్సవం ప్రారంభం కానునుండంతో దేవస్థానం అధికారులు శనివారం నాడే వీలైతే ప్రమాణ స్వీకారం చేయించేలా ప్రణాళిక సిద్ధం చేశారు.
ఉత్సవాలకు ఏర్పాట్లు
కలెక్టర్‌తో చర్చించిన ఎంపీ, ఎమ్మెల్యే
విజయనగరం కలెక్టరేట్, అక్టోబరు 3(ఆంధ్రజ్యోతి): విజయనగరం ఉత్సవాల ఏర్పాట్లపై పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే పూసపాటి అదితిగజపతిరాజు శుక్రవారం కలెక్టర్ రామసుందర్‌రెడ్డిని కలిసి సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ గత ఏడాది నిర్వహించిన అన్ని వేదికల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, వెన్యూ ఇన్‌చార్జి అధికారులంతా ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారని చెప్పారు. అమ్మవారి గుడి నుంచి బొంకులు దిబ్బ వరకూ చేపట్టే ర్యాలీని జిల్లా ఇన్‌చార్జి మంత్రి వంగలపూడి అనిత ప్రారంభిస్తారని చెప్పారు.
గోవా గవర్నర్‌ను కలిసిన కలెక్టర్
విజయనగరం కలెక్టరేట్, అక్టోబరు 3(ఆంధ్రజ్యోతి): గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజును ఆయన క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ రామసుందర్ రెడ్డి గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. విజయనగరం ఉత్సవాలు, అమ్మవారి పండుగపై కొద్దిసేపు మాట్లాడుకున్నారు.
============