Sirimanotsavam to enhance the fame of Vizianagaram విజయనగరం ఖ్యాతిని పెంచేలా సిరిమానోత్సవాలు
ABN , Publish Date - Aug 30 , 2025 | 11:45 PM
Sirimanotsavam to enhance the fame of Vizianagaram విజయనగరం ఖ్యాతిని పెంచేలా పైడితల్లమ్మ సిరిమానోత్సవాలు నిర్వహించాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. అక్టోబరు 6, 7 తేదీల్లో జరగనున్న పైడిమాంబ సిరిమానోత్స వాలకు సంబంధించిన ఏర్పాట్లపై కలెక్టరేట్‌లో శనివారం జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తొలుత ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, కలెక్టర్ అంబేడ్కర్, ఎస్పీ వకుల్ జిందాల్, ఆలయ ఈవో శీరిషాతో పాటు జిల్లా అధికారులతో కలిసి దేవస్థానం రూపొందించిన ప్రత్యేక పోస్టర్‌ను మంత్రి ఆవిష్కరించారు.
విజయనగరం ఖ్యాతిని పెంచేలా సిరిమానోత్సవాలు
అమ్మవారి జాతరపై విస్తృత ప్రచారం చేయండి
మంత్రి కొండపల్లి శ్రీనివాస్
విజయనగరం, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి):
విజయనగరం ఖ్యాతిని పెంచేలా పైడితల్లమ్మ సిరిమానోత్సవాలు నిర్వహించాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. అక్టోబరు 6, 7 తేదీల్లో జరగనున్న పైడిమాంబ సిరిమానోత్స వాలకు సంబంధించిన ఏర్పాట్లపై కలెక్టరేట్‌లో శనివారం జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తొలుత ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, కలెక్టర్ అంబేడ్కర్, ఎస్పీ వకుల్ జిందాల్, ఆలయ ఈవో శీరిషాతో పాటు జిల్లా అధికారులతో కలిసి దేవస్థానం రూపొందించిన ప్రత్యేక పోస్టర్‌ను మంత్రి ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ సిరిమానోత్సవానికి లక్షలాది మంది భక్తులు రానున్న నేపథ్యంలో అందుకు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. అమ్మవారి ఉత్సవాలతో భక్తుల్లో మధురానుభూతి కలగాలన్నారు. ఆహ్లాదకర వాతావరణంలో వేడుకలు జరగాలని, గత ఏడాది కంటే వైభవంగా నిర్వహించాలన్నారు. ఉత్సవాలకు వారం రోజుల ముందు నగరమంతా విద్యుత్ కాంతులతో ప్రత్యేకంగా అలంకరించాలని, తాగునీటి సరఫరా, పారిశుధ్యం నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. సిరిమాను ఊరేగింపు 3 గంటలకు ప్రారంభించి 5 గంటలకు ముగిసేలా చూడాలని ఆదేశించారు.
భక్తులకు ఇబ్బంది లేకుండా వీఐపీ దర్శనాలు
కలెక్టర్ బీఅర్ అంబేడ్కర్ మాట్లాడుతూ, సాధారణ దర్శనానికి ఇబ్బంది కలగకుండా వీఐపీ దర్శనాలను ఏర్పాటు చేయాలని దేవదాయశాఖాధికారులను కలెక్టర్ అంబేడ్కర్ అదేశించారు, ప్రసాదాలు నాణ్యంగా ఉండాలని... గత ఏడాది కంటే రెండు శాతం అధికంగా ప్రసాదాలు సిద్ధం చేయాలన్నారు. కంట్రోల్ రూంలు, ఉచిత వైద్య శిబిరాలు, 108 సేవలు నిరంతరం కొనసాగేలా చూడాలన్నారు. సీసీ కెమెరాలు ఎక్కడికక్కడ ఏర్పాటు చేయాలన్నారు. మూడు రోజుల ముందునుంచే పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించాలని, తాగునీరు సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. సిరిమాను రథం ఫిట్‌నెస్‌ను అటవీశాఖాధికారులు తనిఖీ చేయాలని, ఆర్‌డీవో, అటవీశాఖాధికారులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. ఒకే దగ్గర ప్రజలు గుమిగూడకుండా ముఖ్య కూడళ్లలో ఎల్‌ఈడీ స్ర్కీన్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు. భక్తులు వచ్చే రూట్లలో అధిక సంఖ్యలో బస్సులు ఏర్పాటు చేయాలన్నారు. బారికేడ్లను పటిష్టంగా ఏర్పాటు చేయాలని ఆర్ అండ్ బీ అధికారులను ఆదేశించారు. సిరిమానోత్సవం అనంతరం జరిగే తెప్పోత్సవం సమయానికి గజ ఈతగాళ్లను సిద్ధం చేయాలని మత్స్యశాఖను ఆదేశించారు. ఉత్సవాలపై జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లాస్థాయిలో కమిటీ ఏర్పాటు చేస్తామని, ఉత్సవాల కోసం ప్రభుత్వం రూ.50 లక్షలు కేటాయించిందని తెలిపారు. ఎస్పీ వకుల్‌జిందాల్ మాట్లాడుతూ, పైడిమాంబ ఉత్సవాలకు 2 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తామని, ముఖ్య కూడళ్లల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి భద్రత ఏర్పాట్లు కట్టుదిట్టం చేస్తామని అన్నారు. సమావేశంలో జేసీ సేతు మాధవన్, డీఆర్‌వో శ్రీనివాసమూర్తి, డీసీఎంఎస్ చైర్మన్ గొంప కృష్ణ, ఆలయ ఈవో శిరీషా, ప్రధాన పూజారి బంటుపల్లి వెంకటరావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.