Siri Celebrations Soar Sky-High అంబరాన ‘ సిరి’ సంబరం
ABN , Publish Date - Jun 04 , 2025 | 12:19 AM
Siri Celebrations Soar Sky-High జిల్లా కేంద్రం పార్వతీపురంలో సిరిమాను సంబరాలు అంబరాన్నంటాయి. మూడేళ్లకొకసారి జరిగే అక్కాచెల్లెళ్లు ఇప్పలపోలమ్మ, యర్రకంచమ్మ సిరిమానోత్సవాలు తిలకించేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. మంగళవారం అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
భక్తిశ్రద్ధలతో బెలగాం బంగారమ్మ తల్లి ఘటాల ఊరేగింపు
వేలాదిగా తరలివచ్చిన భక్తజనం.. కిటకిటలాడిన ఆలయాలు
పార్వతీపురం సందడే సందడి
పార్వతీపురం/టౌన్ జూన్3(ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రం పార్వతీపురంలో సిరిమాను సంబరాలు అంబరాన్నంటాయి. మూడేళ్లకొకసారి జరిగే అక్కాచెల్లెళ్లు ఇప్పలపోలమ్మ, యర్రకంచమ్మ సిరిమానోత్సవాలు తిలకించేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. మంగళవారం అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పసుపు కుంకుమలతో పాటు నైవేద్యాలు సమర్పించి మొక్కుబడులు చెల్లించుకున్నారు. మొత్తంగా పట్టణంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. మరోవైపు బంధువులు, స్నేహితులతో పట్టణంలో ప్రతి వీధి కళకళలాడింది. సుమారు 3 లక్షల మంది వరకు ప్రజలు తరలిరావడంతో జిల్లా కేంద్రం కిటకిటలాడింది. అంతటా సందడి వాతావరణం నెలకొంది.
ఆలయాలకు భక్తుల తాకిడి..
పార్వతీపురం పట్టణం, జగన్నాథపురం, బెలగాం ప్రజల ఇలవేల్పులు ఇప్పలపోలమ్మ, యర్రకంచమ్మల , బంగారమ్మ ఆలయాలు మంగళవారం ఉదయం ఐదు గంటల నుంచే భక్తులతో కిటకిటలాడాయి. సొంత జిల్లా నుంచే కాకుండా విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు, ఒడిశా నుంచి భారీగా ప్రజలు తరలివచ్చారు. క్యూలైన్లలో గంటల కొద్దీ నిరీక్షించిన అనంతరం అమ్మవార్లను దర్శించుకుని పులకించిపోయారు. మరోవైపు ఉత్సవ కమిటీ సభ్యులు అమ్మవార్లకు ప్రత్యేక అలంకరణ, పూలంగిసేవ నిర్వహించారు. బెలగాం బంగారమ్మ తల్లి ఘటాలను భక్తజనం నడుమ ఊరేగింపు నిర్వహించారు.
సిరిమానోత్సవాలు ఇలా..
- పట్టణంలోని నాయుడు వీధిలోని ఇప్పలపోలమ్మకు మంగళవారం సాయంత్ర ఏడు గంటలకు విశేష పూజలు చేశారు. పూజారి ఆరిక రాజారావు సిరిమానును అధిరోహించిన తర్వాత రెడ్డివీధిలోని బుడుమూరు శ్రీను ఇంటి నుంచి సిరిమానోత్సవం ప్రారంభమైంది. టౌన్ పోలీసు స్టేషన్ వీధి నుంచి నాలుగు రోడ్లు కూడలి(ఎడమవైపు), పాతబస్టాండ్, కుసుమగుడ్డి వీధి, తెలకవీధి మీదుగా మళ్లీ టౌన్ పోలీసుస్టేషన్ వీధి , నాలుగురోడ్ల కూడలి( కుడివైపు) గాంధీ సత్రం వరకు సిరిమానోత్సవం సాగింది. అక్కడ నుంచి ఘటాలను వనం గుడికి తీసుకెళ్లిన తర్వాత అనుపోత్సవం నిర్వహించారు.
- జగన్నాథపురం యర్రకంచమ్మ ఆలయంలో సాయంత్రం 6.30 గంటలకు పూజారి నక్కా వాసుదేవరావు ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత రెడ్డి సీతారాం ఇంటి వద్ద సిరిమాను అధిరోహించారు. కొత్తవీధి, రాయగడ రోడ్డు, పాతబస్టాండ్, పోలీసుస్టేషన్ వీధి, తెలకలవీధి మీదుగా ప్రధాన ఆలయం వరకు సిరిమానోత్సవం సాగింది.