Share News

Single-use plastic is no longer valid. సింగిల్‌ యూజ్డ్‌ ప్లాస్టిక్‌కు ఇక చెల్లు

ABN , Publish Date - Jun 20 , 2025 | 12:00 AM

Single-use plastic is no longer valid. ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్‌ కవర్లు ఇక ఉండవా..వాటిని వ్యాపారులు విక్రయించరా.. ఎక్కడ కొనాలన్నా దొరకవా.. వాటి స్థానంలో క్లాత్‌ బ్యాగులు వస్తాయా.. ఈ ప్రశ్నలకు అవుననే ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. సింగిల్‌ యూజ్డ్‌ ప్లాస్టిక్‌పై ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి సారించింది.

Single-use plastic is no longer valid. సింగిల్‌ యూజ్డ్‌ ప్లాస్టిక్‌కు  ఇక చెల్లు

సింగిల్‌ యూజ్డ్‌ ప్లాస్టిక్‌కు

ఇక చెల్లు

దృష్టిసారించిన ప్రభుత్వం

అధికారులకు తాజాగా దిశానిర్దేశం చేసిన ముఖ్యమంత్రి

మున్సిపాలిటీలకు ఆదేశాలు జారీచేసిన మున్సిపల్‌ పరిపాలనా విభాగం

అక్టోబర్‌ 2 నాటికి పూర్తిగా కట్టడి చేయాలి

జిల్లాలో విచ్చలవిడిగా ప్లాస్టిక్‌ వినియోగం

ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్‌ కవర్లు ఇక ఉండవా..వాటిని వ్యాపారులు విక్రయించరా.. ఎక్కడ కొనాలన్నా దొరకవా.. వాటి స్థానంలో క్లాత్‌ బ్యాగులు వస్తాయా.. ఈ ప్రశ్నలకు అవుననే ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. సింగిల్‌ యూజ్డ్‌ ప్లాస్టిక్‌పై ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి సారించింది. కట్టడి చేయాలని సరాసరి ముఖ్యమంత్రే తాజాగా అధికార యంత్రాంగానికి ఆదేశించారు. దీనిపై మున్సిపల్‌ పరిపాలనా విభాగం కూడా మున్సిపాలిటీలకు ఉత్తర్వులు జారీచేసింది. అక్టోబర్‌ 2 నాటికి పూర్తిగా కట్టడి చేయాలని నిర్దేశించింది.

రాజాం రూరల్‌, జూన్‌ 19(ఆంధ్రజ్యోతి):

‘సింగిల్‌ యూజ్డ్‌ ప్లాస్టిక్‌ను ఈ ఏడాది అక్టోబర్‌ 2 నాటికల్లా పూర్తిగా అరికట్టాలి. క్లాత్‌ బ్యాగ్‌ల వినియోగాన్ని పెంచాలి. పేరుకుపోయిన చెత్తను వెంటనే తొలగించాలి. 90 రోజుల్లో రీ సైక్లింగ్‌, చెత్తను వేరు చేయడంపై పకడ్బందీ కార్యాచరణ ప్రణాళిక ఇవ్వాలి’ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు ఇటీవల దిశానిర్దేశం చేశారు. ఈనెల 17న రాష్ట్ర సచివాలయంలో సర్క్యులర్‌ ఎకానమీపై అధికారులతో నిర్వహించిన సమీక్షలో సింగిల్‌ యూజ్డ్‌ ప్లాస్టిక్‌పై సమరశంఖం పూరించాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర మున్సిపల్‌ పరిపాలనా విభాగం అన్ని కార్పొరేషన్లతో పాటు మున్సిపాలిటీలకు ఆదేశాలు జారీ చేసింది. విజయనగరం కార్పొరేషన్‌తో పాటు రాజాం, బొబ్బిలి మున్సిపాలిటీలకు కూడా ఆ ఉత్తర్వులు అందాయి.

అధికారుల్లో కదలిక..

ఈ ఏడాది అక్టోబర్‌ 2 నాటికి ప్లాస్టిక్‌ నిషేధం అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు ఈనెల 18న ఉత్తర్వులు జారీ చేయడంతో జిల్లా యంత్రాంగంలో కదలిక ప్రారంభమైంది. వాస్తవానికి స్వచ్ఛభారత్‌లో భాగంగా 2018 అక్టోబర్‌ 2 నుంచి అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ప్లాస్టిక్‌పై నిషేధం అమలులోకి తెచ్చింది. అయితే 2019లో రాష్ట్రంలో అధికారపగ్గాలు చేపట్టిన వైసీపీ ప్రభుత్వం ప్లాస్టిక్‌ నిషేధాన్ని పూర్తిగా నీరుగార్చింది. దీంతో పట్టణాలు, నగరాలలోని కాల్వలు, డంపింగ్‌యార్డుల్లో ప్లాస్టిక్‌ వ్యర్థాలు గుట్టల్లా పేరుకుపోయాయి. తాజాగా ముఖ్యమంత్రి ఆదేశించడంతో అక్టోబర్‌ 2 నాటికి సింగిల్‌ యూజ్డ్‌ ప్లాస్టిక్‌ నిఽషేధం అమలు చేయాలని మున్సిపల్‌ యంత్రాంగం భావిస్తోంది. ఒకసారి వాడిపడేసే ప్లాస్టిక్‌ కవర్లు, టీ గ్లాసులు, థర్మాకోల్‌ వంటి అమ్మకాలపై నిఘా పెట్టేందుకు అధికారులు సన్నద్ధం అవుతున్నారు.

ఆరంభ శూరత్వం కాదు కదా..

ప్లాస్టిక్‌ నిషేధం విషయంలో విజయనగరం కార్పొరేషన్‌తో పాటు మున్సిపాలిటీల యంత్రాంగం తీరు ఆరంభశూరత్వంగా కనిపిస్తూ వస్తున్నాయి. ప్రభుత్వం ప్రకటన చేసిన కొద్డిరోజుల పాటు అధికారులు రోడెక్కి తోపుడుబళ్ల వ్యాపారులు, చిన్న చిన్న పండ్ల వ్యాపారులు, పాన్‌షాపులు, టిఫిన్‌ సెంటర్లు, కూరగాయల వ్యాపారులపై ఝలుం చూపిస్తున్నారు. ఆయా చిరు వ్యాపారుల నుంచి తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్‌ కవర్లు స్వాధీనం చేసుకుంటున్నారు. వారికి రూ.500 నుంచి రూ.1000 వరకూ జరిమానా విధిస్తున్నారు. కవర్లను స్వాధీనం చేసుకుని మున్సిపల్‌ కార్యాలయాల్లో ఓ మూలన పడేస్తున్నారు. వీటిని మున్సిపాలిటీలలోని దిగువస్థాయి సిబ్బంది తిరిగి పండ్ల వ్యాపారులు, తోపుడుబళ్లు వారికి అందజేయడం పరిపాటిగా మారింది. ఈసారి అలా కాకూడదని ప్రభుత్వం స్పష్టంగా చెబుతోంది.

అక్కడి నుంచే చెక్‌ పెట్టాలి..

లక్షలాది రూపాయల విలువ చేసే సింగిల్‌ యూజ్డ్‌ ప్లాస్టిక్‌తో పాటు తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్‌ కవర్లను దిగుమతి చేసుకుని గిడ్డంగుల్లో టన్నుల కొద్దీ నిల్వచేసే వ్యాపారుల వైపు కన్నెత్తి చూడడం లేదన్న ఆరోపణలు మున్సిపల్‌ యంత్రాంగంపై లేకపోలేదు. హోటళ్లలో విచ్చలవిడిగా తక్కువ మందం కలిగిన కవర్లలో వేడివేడి పప్పు, కూరలు, రసం, సాంబార్‌, టీ, కాఫీలు వేసి అమ్మకం చేస్తున్న వారి పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వాటర్‌ప్యాకెట్ల అమ్మకం నిషేధించినా బహిరంగమార్కెట్లో విచ్చలవిడిగా అమ్మకాలు సాగిస్తున్నారు. ప్రధానంగా వివాహాది శుభకార్యాల్లో వందల కొద్దీ సింగిల్‌ యూజ్డ్‌ ప్లాస్టిక్‌ను బహిరంగంగా వినియోగిస్తున్నా తమకెందుకులే అనేధోరణిలో అధికారులు ఉంటున్నారు. ఈసారైనా మార్పు వస్తుందేమో చూడాలి.

ప్రోత్సాహాలు సైతం..

క్యారీ బ్యాగుల వినియోగాన్ని పెంచుతూ, వ్యర్థాల నిర్వహణలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన వారికి ప్రోత్సాహకంగా వచ్చే ఏడాది అక్టోబరు 2 నుంచి స్వచ్ఛత అవార్డులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. స్థానిక సంస్థలు, డ్వాక్రా సంఘాలు, అంగన్వాడీలు, పాఠశాలలు, కళాశాలలు, బస్టాండ్లు, ఆసుపత్రులు, ఎన్జీఓలు, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు అవార్డులు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇదే సమయంలో ప్రజల్లో కూడా మార్పు రావాలని, స్వచ్ఛందంగా ప్లాస్టిక్‌ భూతాన్ని తరిమివేసేందుకు నడుం బిగించాలని ప్రభుత్వం విజ్ణప్తి చేసింది.

---------------------

Updated Date - Jun 20 , 2025 | 12:00 AM