Share News

ఏజెన్సీలో మూగ వేదన!

ABN , Publish Date - Jul 13 , 2025 | 11:43 PM

ఏజెన్సీ ప్రాంతాల్లో పశుసంవర్థక శాఖను సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది.

 ఏజెన్సీలో మూగ వేదన!
సీతంపేటలోని వెటర్నరీ డిస్పెన్సరీ కేంద్రం

పశువైద్యం.. దైన్యం

భర్తీకాని వైద్యాధికారుల పోస్టులు

వేధిస్తున్న సిబ్బంది కొరత

శిఽథిలావస్థలో భవనాలు

సకాలంలో మూగజీవాలకు అందని సేవలు

ఇబ్బందుల్లో గిరిజన రైతులు

సీతంపేట రూరల్‌, జూలై 13(ఆంధ్రజ్యోతి): ఏజెన్సీ ప్రాంతాల్లో పశుసంవర్థక శాఖను సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. వసతి సమస్య కూడా వెంటాడుతుంది. ప్రధానంగా గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో పోస్టుల భర్తీకి ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయిలో వైద్యులు, సిబ్బంది లేకపోవడంతో గిరిజన ప్రాంతాల్లో మూగ జీవాలకు ఆశించిన స్థాయిలో సేవలు అందడం లేదు. మరోవైపు ఏటా సీజనల్‌ వ్యాధులకు గురై పాడి పశువులు, మేకలు, గొర్రెలు మృత్యువాత పడుతున్నాయి. దీంతో గిరిజన రైతులు తలలు పట్టుకుంటున్నారు.

ఇదీ పరిస్థితి..

జిల్లాలోని 15 మండలాల్లో 38 మంది పశు వైద్యాధికారులు ఉండాలి. అయితే 18మంది మాత్రమే ఉన్నారు. మిగిలిన 20 పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. వెటర్నరీ ఏడీ పోస్టులు ఏడు ఉండగా.. గరుగుబిల్లి మండలంలో పోస్టును ఇంత వరకు భర్తీ చేయలేదు. అంతేకాకుండా క్షేత్రస్థాయి సిబ్బంది కొరత కూడా వేధిస్తోంది. సీతంపేటలోని వెటర్నరీ డిస్పెన్సరీ కార్యాలయంలో డాటా ఎంట్రీ ఆపరేటర్‌ పోస్టును గడిచిన ఏడేళ్ల కిందట పొరుగుసేవల ప్రాతిపదికన భర్తీ చేశారు. అయితే ఇక్కడ డీఈవోగా(డాటా ఎంట్రీ ఆపరేటర్‌)పనిచేయాల్సిన సిబ్బందిని శ్రీకాకుళం డిప్యుటేషన్‌పై వేశారు. దీంతో ఇక్కడ కంప్యూటర్‌ రికార్డు వర్క్‌ ముందుకు సాగడం లేదు.

- ఏడీ కార్యాలయంలో డీఈవో లేకపోవడంతో ఏడీ శ్రీనివాసరావు కార్యాలయంలో కంప్యూటర్‌ వర్క్‌ చేసుకుంటున్నారు. ఇదేంటని అడిగితే సదరు ఆపరేటర్‌ జీతం ఇక్కడ తీసుకొని సేవలు శ్రీకాకుళం అందిస్తున్నట్లు చెప్పారు.

- సీతంపేట ప్రాంతీయ పశువైద్యశాల పరిధిలో ఉన్న సీతంపేట, భామిని మండలాల్లో ఐదుగురు పశు వైద్యాధికారులు ఉండాలి. కానీ సీతంపేట మండలంలో ఇద్దరు పశు వైద్యులు సేవలందిస్తున్నారు.

-ఒక్కో పశు వైద్యాధికారి రెండు లేక మూడు పశు వైద్యశాలలను చూస్తుండడంతో గ్రామస్థాయిలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

- సీతంపేట, పొల్ల, చినబగ్గ, దోనుబాయి, భామిని, బత్తిలిలో ఆఫీస్‌ సబార్డినేటర్‌తో పాటు అటెండర్‌ పోస్టులను కూడా భర్తీ చేయాల్సి ఉంది.

- ఈ వర్షాకాల సీజన్‌లో గొర్రెలు, మేకలు, లేగదూడలకు వింత వ్యాధులు సంక్రమిస్తాయి. అయితే పూర్తిస్థాయిలోపశువైద్యులు లేకపోవడంతో పాడి రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. సకాలంలో వైద్యం అందని కారణంగా కొన్ని పశువులు మృత్యువాత పడుతున్నాయి. దీనిపై కూటమి ప్రభుత్వం స్పందించి తగు చర్యలు తీసుకోవాలని గిరిజన రైతులు కోరుతున్నారు.

వేధిస్తున్న వసతి సమస్య

జిల్లాలో పశువైద్య కేంద్రాలకు పక్కా భవనాలు లేవు. దీంతో కొన్నాళ్లుగా వసతి సమస్య వేధిస్తోంది. కొన్ని భవనాలు శిఽథిలావస్థలో ఉంటే ... మరికొన్ని చోట్ల అద్దె భవనాల్లో ఈ పశువైద్య శాలలను నిర్వహిస్తున్నారు. పొల్ల, దోనిబాయి, చినబగ్గలో పశువైద్యశాలలకు పక్కా భవనాలు లేవు. అక్కడ రైతుసేవా కేంద్రంలోనే మూగజీవాలకు వైద్యసేవలు అందిస్తున్నారు. భామిని, బత్తిలిలో శిథిలావస్థకు చేరిన భవనాలకు అప్పుడప్పుడు చిన్నపాటి మరమ్మతులు చేపట్టి వినియోగిస్తున్నారు.

జేడీ ఏమన్నారంటే...

‘ పశు వైద్య శాఖలో చాలావరకు పోస్టులు భర్తీ కావాల్సి ఉంది. దీనిపై ప్రభుత్వానికి నివేదిక పంపించాం. సీతంపేటలోని పశువైద్య కేంద్రంలోని డీఈవో పోస్టు జిల్లా విభజనలో శ్రీకాకుళం తరలిపోయింది. జీతం మాత్రం ఇక్కడే చెల్లిస్తున్నారు. ఈ విషయాన్ని కూడా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం.’ అని జేడీ మన్మథరావు తెలిపారు.

Updated Date - Jul 13 , 2025 | 11:43 PM