Share News

Showed the Way! ‘దారి’ చూపించారు!

ABN , Publish Date - Nov 08 , 2025 | 11:54 PM

Showed the Way! గత వైసీపీ ప్రభుత్వం రోడ్ల విషయంలో ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించిందో తెలిసిందే. కనీసం మరమ్మతులు కూడా చేపట్టని పరిస్థితి. ఎంతో హడావుడిగా జిల్లాలో రోడ్డు నిర్మాణాలకు శంకుస్థాపన చేసినా.. బిల్లులు మాత్రం చెల్లించలేక పోయింది. ఈ క్రమంలో కాంట్రాక్టర్లు చేతులెత్తేయడంతో రోడ్డు పనులకు బ్రేక్‌ పడింది.

 Showed the Way!  ‘దారి’ చూపించారు!
పూర్తయిన తోటపల్లి-గుణుపూర్‌ రహదారి

  • అసంపూర్తిగా నిలిచిన వాటిపై కూటమి ప్రభుత్వం దృష్టి

  • పెండింగ్‌ బిల్లుల చెల్లింపు.. పనుల వేగవంతానికి చర్యలు

  • మరోవైపు నూతన రహదారుల నిర్మాణానికి భారీగా నిధుల మంజూరు

పార్వతీపురం, నవంబరు 8(ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వం రోడ్ల విషయంలో ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించిందో తెలిసిందే. కనీసం మరమ్మతులు కూడా చేపట్టని పరిస్థితి. ఎంతో హడావుడిగా జిల్లాలో రోడ్డు నిర్మాణాలకు శంకుస్థాపన చేసినా.. బిల్లులు మాత్రం చెల్లించలేక పోయింది. ఈ క్రమంలో కాంట్రాక్టర్లు చేతులెత్తేయడంతో రోడ్డు పనులకు బ్రేక్‌ పడింది. ఈ నేపథ్యంలో అడుగుకో గుంతతో జిల్లాలో వాహనదారులు, ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు. పట్టుమని కిలోమీటరు కూడా సాఫీగా ప్రయాణించలేని దుస్థితి. ఒకవైపు రహదారులపై గోతులు పూడ్చక.. మరోవైపు నిర్మాణాలు పూర్తికాక ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిపై దృష్టి సారించింది. ప్రజా సమస్యలను పరి గణనలోకి తీసుకుని.. సుమారు రూ.25 కోట్ల వరకూ పెండింగ్‌ బిల్లులను చెల్లించి రోడ్డు పనులు పునఃప్రారంభమయ్యే విధంగా చర్యలు చేపట్టింది. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో రహదారుల నిర్మాణానికి భారీగా నిధులు మంజూరు చేసింది. దీనిపై జిల్లావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

బిల్లుల చెల్లింపు ఇలా..

- గత వైసీపీ ప్రభుత్వ కాలంలో పాలకొండ నియోజకవర్గ పరిధి నవగాం-జంపరకోట రహదారి నిర్మాణాన్ని ప్రారంభించారు. అయితే బిల్లులు చెల్లించకపోవడంతో పనులకు బ్రేక్‌ పడింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.కోటి 37లక్షలు చెల్లించి ఆ పనులు పునఃప్రారంభమయ్యే విధంగా చర్యలు తీసుకుంది.

- కురుపాం నియోజకవర్గంలో తోటపల్లి నుంచి గుణుపూర్‌ రహదారి పనులకూ వైసీపీ సర్కారు బిల్లులు చెల్లించలేదు. కూటమి ప్రభుత్వం రూ.మూడు కోట్ల 91 లక్షల వరకూ బిల్లులు చెల్లించి ఆ పనులను పూర్తి చేయించింది.

- పార్వతీపురం-కోరాపుట్‌ రహదారి నిర్మాణానికి అప్పటి పాలకులు అట్టహాసంగా శంకుస్థాపన చేశారు. కానీ పనులు మాత్రం పూర్తి చేయించలేకపోయారు. ఈ నేపథ్యంలో ప్రజల ఇబ్బందులను పరిగణనలోకి తీసుకున్న కూటమి ప్రభుత్వం ఆ పనుల పూర్తికి రూ.8కోట్ల 45 లక్షలు చెల్లించింది.

- గత వైసీపీ సర్కారు హయాంలో చేపట్టిన సాలూరు-దుగ్గేరు రహదారి నిర్మాణానికి కూడా బ్రేక్‌ పడింది. దీంతో కూటమి ప్రభుత్వం రూ. 4.5 కోట్ల వరకు పెండింగ్‌ బిల్లులు చెల్లించింది.

నిధులు మంజూరు ఇలా...

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రహదారుల నిర్మాణానికి భారీగా నిధులు మంజూరు చేసింది. దీనిలో భాగంగా కళింగపట్నం- శ్రీకాకుళం నుంచి పార్వతీపురం వరకు రహ దారి అభివృద్ధి కోసం రూ.మూడు కోట్లు కేటాయించింది. సాలూరు-మక్కువ రహదారి నిర్మాణానికి 5.5 కోట్లు, చినబోగిలి-మక్కువకు రూ.50 లక్షలు, పాలకొండ నియోజకవర్గంలో కోడిశ -ఓండ్రుజోలకు రూ.3.5 కోట్లు, అల్లెన రహదారి నిర్మాణానికి రూ. కోటి కేటాయించారు. పార్వ తీపురం నియోజకవర్గంలో బలిజిపేట-అరసాడ రోడ్డుకు రూ. రెండున్నర కోట్లు, పనుకువలస- బలిజిపేటకు రూ. కోటి 50 లక్షలు, కురుపాం నియోజకవర్గంలో కూనేరు రహదారికి రూ.4 కోట్లు, జియ్యమ్మవలస- వనజకు రూ. కోటి మంజూరు చేశారు.

రూ.25కోట్లు చెల్లించాం

జిల్లాలో అసంపూర్తిగా నిలిచిన రహదారుల నిర్మాణాలకు సంబంధించి ఇప్పటివరకు సుమారు రూ.25 కోట్ల వరకు పెండింగ్‌ బిల్లులు చెల్లించాం. ఇందులో కొన్ని పనులు పునఃప్రారంభమ య్యాయి. మరికొన్ని పూర్తి చేశాం. కొత్త రహదారి నిర్మాణాలకు చర్యలు చేపడుతున్నాం. కొన్నింటికి టెండర్లు పిలవాల్సి ఉంది.

- రాధాకృష్ణ, జిల్లా ఇంజనీరింగ్‌ అధికారి, ఆర్‌అండ్‌బీ

Updated Date - Nov 08 , 2025 | 11:54 PM