Show us the way. మాకో దారి చూపండి
ABN , Publish Date - Jun 06 , 2025 | 12:21 AM
Show us the way.అప్పన్నపాలెం పంచాయతీ జిందాల్‌నగర్‌లో ఉన్న జేఎస్‌ఎల్ కర్మాగారంలో లాకౌట్ విధించి సుమారు నాలుగు నెలలు గడుస్తున్నా యాజమాన్యం నుంచి ఎటువంటి స్పందన కనిపించక పోవడంతో కార్మికులు అయోమయంలో పడ్డారు. తమకో పరిష్కారం చూపితే బయటకు వెళ్లడానికి సిద్ధపడుతున్నారు. ఇప్పటికే కొందరు ప్రత్యామ్నాయ ఉపాధి పనులు చేసుకుంటున్నారు.
మాకో దారి చూపండి
జేఎస్‌ఎల్ యాజమాన్యాన్ని కోరుతున్న కార్మికులు
ప్రత్యామ్నాయ ఉపాధి బాటపట్టిన కొందరు
కొత్తవలస, జూన్ 5 (ఆంధ్రజ్యోతి) : అప్పన్నపాలెం పంచాయతీ జిందాల్‌నగర్‌లో ఉన్న జేఎస్‌ఎల్ కర్మాగారంలో లాకౌట్ విధించి సుమారు నాలుగు నెలలు గడుస్తున్నా యాజమాన్యం నుంచి ఎటువంటి స్పందన కనిపించక పోవడంతో కార్మికులు అయోమయంలో పడ్డారు. తమకో పరిష్కారం చూపితే బయటకు వెళ్లడానికి సిద్ధపడుతున్నారు. ఇప్పటికే కొందరు ప్రత్యామ్నాయ ఉపాధి పనులు చేసుకుంటున్నారు.
కర్మాగారంలో ఎప్పటికప్పుడు యాజమాన్యం లాకౌట్ విధిస్తుండడంతో ఇప్పటికే కార్మికులు విసిగిపోయారు. ఒకసారి లాకౌట్ ఎత్తి ఆరు నెలలు కూడా గడవక ముందే మళ్లీ లాకౌట్ విధించడంతో తీవ్ర నిరాశలో ఉన్నారు. మూడు కార్మిక సంఘాలు(టీఎన్‌టీయూసి, సీఐటీయు, వైఎస్‌ఆర్ ట్రేడ్‌యూనియన్) ఆందోళన చేసినా యాజమాన్యంలో ఎటువంటి చలనం కనిపంచడం లేదని ఆందోళనలు విరమించారు. కర్మాగారంలో 59 మంది వరకు ఎంప్లాయిస్(రెగ్యులర్)కార్మికులు, మరో 300 మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారు. వీరిలో చాలా మంది ఇప్పటికే పదవీ విరమణకు దగ్గరలో ఉండడంతో ఇక పోరాటాలు చేసి సాధించేది ఏమిలేదనే నిర్ణయానికి వచ్చారు. యాజమాన్యం కార్మికులకు పూర్తి పరిష్కారం చేయడానికి చర్చలకు పిలిస్తే చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని కొంతమంది కార్మికులే తెలిపారు. అయితే యాజమాన్యం లాకౌట్ ఎత్తి వేయడానికి గాని, పూర్తి పరిష్కారం చేయడానికిగాని ముందుకు రావడం లేదు.
- కర్మాగారంలో పనిచేస్తున్న కార్మికులకు నెల వారీ వేతనం రూ.12 వేలకు మించి రావడం లేదు. దీంతో బయట పనులకు వెళ్లిపోతే రోజుకు 7 నుంచి 8 వందల వరకు వేతనం వస్తోంది. కర్మాగారంలో పని చేసుకునేకంటే రోజువారీ పనులకు పోవడం మంచిదని ఇప్పటికే చాలామంది కార్మికులు మండలంలోని జాతీయ రహదారుల నిర్మాణ పనులకు వెళ్లిపోతున్నారు. ఇంకొందరు లక్కవరపుకోట మండంలోని వివిధ కర్మాగారాల్లో రోజువారీ వేతనంపై పనిచేసుకుంటున్నారు. వీరంతా ఫ్యాక్టరీ యాజమాన్యం ఏదో ఒకటి తేల్చాలని కోరుతున్నారు.
---------------------