Share News

Show shortage... increase price కొరత చూపి... ధర పెంచి

ABN , Publish Date - Aug 29 , 2025 | 12:12 AM

Show shortage... increase price జిల్లాలోని ప్రైవేటు దుకాణాల్లో సాగుతున్న ఎరువుల విక్రయాల్లో అక్రమాలు జరుగుతున్నాయనడానికి ఈ రెండు ఘటనలు ఉదాహరణలు మాత్రమే. చాలా మంది వ్యాపారులు ఎరువులు ఉండి కూడా కృత్రిమ కొరత సృష్టించి ఆపై ధరలు పెంచి విక్రయిస్తున్నారు.

Show shortage... increase price కొరత చూపి... ధర పెంచి

కొరత చూపి... ధర పెంచి

ఎరువుల విక్రయాల్లో వ్యాపారుల మాయలు

కృత్రిమ కొరతతో లాభాలు

రైతులకు అవస్థలు

తాజాగా అధికారులకు పట్టుబడుతున్న నిల్వలు

వివిధ దుకాణాలపై కేసులు

శృంగవరపుకోట, ఆగస్టు 28(ఆంధ్రజ్యోతి):

- శృంగవరపుకోట పట్టణ పరిధిలోని ఎరువుల దుకాణాలను వ్యవసాయ శాఖ, విజిలెన్స్‌ అధికారులు ఇటీవల తనిఖీలు చేశారు. ఓ ఎరువుల దుకాణంలో బిల్లుల్లో వ్యత్యాసం గమనించారు. 6ఏ కేసు నమోదు చేశారు. రూ.10లక్షల విలువైన ఎరువును సీజ్‌ చేశారు.

- రాజాం పట్టణ పరిధిలోని ఓ ఎరువుల దుకాణంలో మూడు రోజుల కిందట రూ.15.91 లక్షల విలువైన 75 టన్నుల ఎరువును వ్యవసాయ శాఖ, విజిలెన్స్‌ అధికారులు పట్టుకున్నారు. ఎంఆర్‌పీలో లోపం, బిల్లు పుస్తకంలో ఒకరి పేరుంటే వేలిముద్రలు వేరొకరివి ఉండడం వంటి అవకతవకలను గుర్తించారు. కేసు నమోదు చేశారు.

జిల్లాలోని ప్రైవేటు దుకాణాల్లో సాగుతున్న ఎరువుల విక్రయాల్లో అక్రమాలు జరుగుతున్నాయనడానికి ఈ రెండు ఘటనలు ఉదాహరణలు మాత్రమే. చాలా మంది వ్యాపారులు ఎరువులు ఉండి కూడా కృత్రిమ కొరత సృష్టించి ఆపై ధరలు పెంచి విక్రయిస్తున్నారు. ఇంకొందరు తప్పుడు బిల్లులతో అధికారులను బోల్తా కొట్టిస్తున్నారు. జిల్లాలో సరిపడా ఎరువులు అందుబాటులో ఉన్నాయని వ్యవసాయ శాఖ చెబుతుంది. మరోవైపు నెల రోజుల నుంచి రైతులు ఎరువుల కోసం పరితపిస్తున్నారు. యూరియా, డీఏపీ ఎక్కడుందంటే అక్కడకు పరుగులు తీస్తున్నారు. రైతు సేవా కేంద్రాలకు వెళితే మరో రెండు, మూడు రోజులు పడుతుందని సమాధానం ఇస్తున్నారు. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల్ని సంప్రదిస్తే ఇండెంట్‌ పెట్టామంటూ తిరిగి పంపించేస్తున్నారు. చివరకు ప్రైవేటు ఎరువుల దుకాణంలో అడుగుపెట్టడంతోనే యజమాని తల తిప్పేస్తున్నాడు. ఎక్కడా ఎరువు దొరక్కపోవడంతో అదునుకు అనుగుణంగా వరి చేనుకు ఎరువును అందించలేకపోతే దిగుబడులపై ప్రభావం చూపుతుందని రైతులు భయపడుతున్నారు.

విస్తృతంగా తనిఖీలు

ఎరువుల కోసం రైతులు పడరాని పాట్లు పడుతున్నారని తెలుసుకున్న వ్యవసాయ శాఖ విజిలెన్స్‌ అధికారులతో కలిసి ప్రైవేటు ఎరువుల దుకాణాల్లో తనిఖీలు చేస్తోంది. ఎక్కడ తనిఖీలు చేపట్టినా ఎంతోకొంత ఎరువు పట్టుబడుతోంది. సోమ, మంగళవారాల్లో రెండు రోజుల పాటు జరిగిన వరుస తనిఖీల్లో రూ.35లక్షల విలువైన 139 టన్నులకు పైబడి ఎరువును స్వాధీనం చేసుకున్నారు. గురువారం కూడా తనిఖీలు చేయగా కొన్నిచోట్ల లోపాలు గుర్తించారు. దీన్ని బట్టి ఎరువుల కృతిమ కొరతను వ్యాపారులే సృష్టిస్తున్నారని తెలుస్తోంది. దాదాపుగా జిల్లాలోని అత్యధిక ఎరువుల దుకాణ యజమానులు అవకతవకలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కానీ పది దుకాణాలపై దాడులు జరిగితే ఒక్క దుకాణంలో మాత్రమే అక్రమ నిల్వలు దొరుకుతున్నాయి. అంటే వ్యవసాయ శాఖ, విజిలెన్స్‌ అధికారులు తనిఖీలకు వస్తున్న విషయం ఎరువుల దుకాణ యజమానులకు ముందే తెలిసిపోతోంది. వీరొచ్చేలోపే అంతా సర్దేస్తున్నారు.

ప్రభుత్వం ఆదేశిస్తున్నా..

ఎరువుల కృత్రి కొరత లేకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం జూన్‌ నెల నుంచి చెబుతోంది. ప్రభుత్వం నిర్ధారించిన ధర కంటే ఎక్కువ ధరకు ఎరువులను అమ్మవద్దని, కృత్రిమ కొరత సృష్టిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు కానీ ఎరువుల దుకాణ యజమానులు వీరి మాటలను గాలికి వదిలేశారు. గోదాముల్లో ఎరువులు ఉన్నప్పటికీ దుకాణానికి వెళ్లిన రైతులకు ఎరువులు లేవన్న సమాదానం వినిపిస్తోంది.

నాయకులతో కుమ్మక్కు..

కొంత మంది నాయకులతో పలువురు ఎరువుల దుకాణ యజమానులు కుమ్మక్కయ్యారు. లారీలతో వచ్చిన ఎరువును వారికి అప్పగిస్తున్నారు. ఎంఆర్‌పీ ధర కంటే పరిస్థితిని బట్టి పది, ఇరవై రూపాయలు ఎక్కువ తీసుకుంటున్నారు. తమకు అనుకూలమైన రైతులకు ఆ ఎరువును ఇచ్చి రాజకీయంగా పరపతిని పెంచుకొనే ప్రయత్నంలో నాయకులు ఉన్నారు. దీంతో గ్రామాల్లో కొంత మంది రైతులకు మాత్రమే సరిపడా ఎరువు దొరుకుతోంది.

స్పష్టత ఇవ్వరెందుకో?

ఎరువుల దుకాణాల్లో తనిఖీలు చేపడుతున్న వ్యవసాయ శాఖ, విజిలెన్స్‌ అధికారులు 6ఎ కేసులు నమోదు చేశామని, సరుకుల నిల్వకు, రికార్డులకు వ్యత్సాసం ఉందని మాత్రమే చెబుతున్నారు. పూర్తిస్థాయి వివరాలు ఇవ్వడం లేదు. అడిగితే తప్ప అవకతవకలకు పాల్పడిన ఎరువుల దుకాణం పేరు, సీజ్‌ చేసిన సరుకు, దాని విలువను చెప్పకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం నుంచి ఎరువుల దుకాణాలపై దాడులు జరుగుతున్నప్పటికీ వ్యాపారులెవరూ భయపడకుండ కృత్రిమ కొరతను సృష్టిస్తుండడానికి అధికారుల మెతక వైఖరే కారణమన్న విమర్శలు ఉన్నాయి.

అదును దాటుతున్నా..

జిల్లాలో అత్యధిక శాతం భూమి ఖరీఫ్‌లో వ్యవసాయయోగ్యంగా మారుతుంది. ఎక్కడ చూసిన వరి పంటే కనిపిస్తోంది. ఈ సమయంలో ఎరువు అవసరం. రైతులు యూరియాకు ప్రాధాన్యం ఇస్తారు. ఆ తరువాత డీఏపీ, ఇతర కాంప్లెక్స్‌ ఎరువులను వాడతారు. అదునుకు అనుగునంగా యారియాను వాడాలన్న నియమాన్ని జిల్లా రైతు పాటిస్తాడు. కానీ అవసర సమయంలో ఈ ఎరువు రైతుకు అందడం లేదు. మండల వ్యసాయ అధికారుల నుంచి జిల్లా వ్యవసాయా అధికారుల వరకు అదునుకు అనుగుణంగా యూరియాను అందుబాటులో ఉంచడంలో విఫలమయ్యారు. ప్రభుత్వం నుంచి సరిపడా సరుకు సరఫరా జరుగుతున్నప్పటికీ అందుకు అనుగుణంగా ప్రతి రైతుకు ఎరువు అందేలా చర్యలు తీసుకోలేకపోతున్నారు. దీంతో కొంత మందికి మాత్రమే ఎరువు అందుతోంది. మిగిలిన ఎరువంతా గోదాముల్లో ముక్కుతోంది. వాటిని వ్యాపారులు తమకు నచ్చినప్పుడు, అధిక ధరకు విక్రయిస్తున్నారు. బస్తాలను ఇచ్చేటప్పుడు తన దగ్గర ఎరువును తీసుకున్నట్లు ఎవరికీ చెప్పవద్దని, ఎవరైనా అడిగితే ఎంఆర్‌పీకి కొన్నట్లు చెప్పాలని జాగ్రత్తలు చెబుతున్నారు.

- ఇప్పటికైనా అదునుకు అనుగుణంగా రైతు సేవా కేంద్రాల్లో ఎరువును అందుబాటులో ఉంచితే వ్యయ ప్రయాసలతో పాటు ఖర్చులు తగ్గుతాయని రైతులు చెబుతున్నారు.

------------------

Updated Date - Aug 29 , 2025 | 12:12 AM