ఇవ్వాలా? వద్దా?
ABN , Publish Date - Jun 28 , 2025 | 12:39 AM
మరో మూడు రోజుల్లో సచివాలయ ఉద్యోగుల బదిలీ ప్రక్రియ పూర్తికానుంది. ఒకేచోట ఐదేళ్లు పనిచేసిన ఉద్యోగులను ప్రభుత్వం బదిలీ చేయనుంది.
- సిఫారసు లేఖలపై సచివాలయ ఉద్యోగుల సంశయం
- వాటిని పరిగణనలోకి తీసుకుంటారో లేదోనన్న అనుమానం
- మరో మూడు రోజుల్లో పూర్తికానున్న బదిలీల ప్రక్రియ
- వేరే మండలాలకు స్థానచలనం
- సర్వీస్ రికార్డు ప్రకారం సొంత మండలం గుర్తింపు
- జిల్లాలోని ఓ గ్రామ సచివాలయంలో పని చేస్తున్న ఓ ఉద్యోగి తనకు దగ్గరగా ఉంటుందని పక్క మండల పరిధిలోని ఓ సచివాలయానికి బదిలీ కోసం ఓ ప్రజాప్రతినిధి నుంచి సిఫారసు లేఖ పొందాడు. అయితే, ఈ లేఖను అధికారులు పరిగణలోకి తీసుకుంటారో.. లేదోనని ఆయన అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. ఇటీవల కొన్ని శాఖల్లో జరిగిన బదిలీలకు సంబంధించి కొన్ని పోస్టులకు ప్రజా ప్రతినిధులు ఇచ్చిన సిఫారసులకు అధికారులు విలువ ఇచ్చారు. మరి కొన్ని పోస్టుల విషయంలో మాత్రం పక్కన పెట్టేశారు. సచివాలయ ఉద్యోగుల బదిలీల్లో కూడా ఇదే పరిస్థితి ఉంటుందని సిఫారసు లేఖలు పొందిన వారిలో ఆందోళన నెలకొంది.
శృంగవరపుకోట, జూన్ 27 (ఆంధ్రజ్యోతి): మరో మూడు రోజుల్లో సచివాలయ ఉద్యోగుల బదిలీ ప్రక్రియ పూర్తికానుంది. ఒకేచోట ఐదేళ్లు పనిచేసిన ఉద్యోగులను ప్రభుత్వం బదిలీ చేయనుంది. జిల్లాలోని 626 గ్రామ, వార్డు సచివాలయాల్లో 5,781 మంది వరకూ ఉద్యోగులు పనిచేస్తుండగా, వీరిలో 3 వేల మందికి స్థానచలనం జరగనుంది. అయితే, హేతుబద్ధీకరణలో భాగంగా పోస్టులు సగానికి తగ్గిపోవడం, సొంత మండలాల్లో పోస్టింగ్‌కు అవకాశం లేకపోవడంతో సచివాలయ ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో కొందరు ఉద్యోగులు తమకు అనువైన చోటకు వెళ్లేందుకు సిఫారసు లేఖల కోసం ఎగబడుతున్నారు. స్థానిక కూటమి నేతల సాయంతో ఎమ్మెల్యేలను కలిసి సిఫారసు లేఖలు పొందుతున్నారు. అయితే ఈ లేఖలను ఆయా శాఖల విభాగాధిపతులకు ఇవ్వాలా? వద్దా? అన్న సంశయంలో పడ్డారు. ఈ నెలలో జరిగిన పంచాయతీ రాజ్ శాఖ బదిలీల్లో కొంతమంది కార్యదర్శులు ఇచ్చిన సిఫారసు లేఖలను సంబంధింత విభాగాధిపతి చించేయడంతో పాటు వారిని దూరంగా ఉన్న స్థానానికి పంపించినట్లు ప్రచారం జరిగింది. ఇదే విధంగా రెవెన్యూ అధికారుల బదిలీల్లోనూ రాజకీయ జోక్యానికి అంతగా ప్రాధాన్యత ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు సిఫారసు లేఖలను ఇచ్చేందుకు జంకుతున్నట్లు తెలుస్తోంది.
ఇతర మండలాలకు వెళ్లాల్సిందే..
సచివాలయ ఉద్యోగులు మరో మూడు రోజుల్లో పాత స్థానాల నుంచి కదలనున్నారు. ఐదేళ్ల పాటు సొంత మండలాల్లో పని చేసిన వారంతా ఇతర మండలాలకు వెళ్లనున్నారు. సర్వీస్ రికార్డులో నమోదైన చిరునామా ప్రకారం వారి సొంత మండలాన్ని గుర్తించనున్నారు. ఈ మండలంలో తప్ప మిగతా ఏ మండలంలోనైనా వారు పని చేయవచ్చు. గ్రామ, వార్డు సచివాలయాల్లో కార్యదర్శులు, డిజిటల్ అసిస్టెంట్లు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, సర్వే అసిస్టెంట్లు, గ్రామ రెవెన్యూ అధికారులు, సంక్షేమ అసిస్టెంట్లు, వ్యవసాయ అసిస్టెంట్లు, ఉద్యానవన అసిస్టెంట్లు, ఎనర్జీ అసిస్టెంట్లు, మహిళా పోలీసులు, ఏఎన్‌ఎంలు పని చేస్తున్నారు. హేతుబద్ధీకరణలో భాగంగా వైద్య ఆరోగ్య శాఖకు చెందిన ఏఎన్‌ఎంలు పోస్టులు తప్ప మిగిలిన శాఖల పోస్టులన్నీ కొన్ని సచివాలయాల్లో ఉంచి, మరికొన్ని చోట్ల తీసేశారు. ఈ ఉద్యోగులను ఏ శాఖల్లో విలీనం చేస్తారనే విషయంపై స్పష్టత లేదు.
దగ్గరగా ఉండేందుకు..
బదిలీల్లో భాగంగా సచివాలయ ఉద్యోగులకు తమ సొంత మండలాల్లో ఉండేందుకు అవకాశం లేదు. దీంతో చాలామంది ఉద్యోగులు తమ గ్రామాలకు దగ్గరగా ఉన్న మండలాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అదేవిధంగా అధికార పార్టీ నాయకులు కూడా ప్రజాప్రతినిధుల సహకారంతో తమకు అనుకూలమైన ఉద్యోగులను నియమించుకునేందుకు ఆరాట పడుతున్నారు. పక్క మండలాల్లో బాగా పనిచేసినట్లు గుర్తింపు పొందిన సచివాలయ ఉద్యోగుల గురించి వాకబు చేస్తున్నారు. వారిని పిలిపించుకొని మాట్లాడుతున్నారు. ప్రజాప్రతినిధుల నుంచి వారికి సిఫారసు లేఖలను ఇప్పిస్తున్నారు. అంతటితో ఆగకుండా మండలాల వారిగా గ్రామ, వార్డు సచివాలయాల్లో నియమించుకునేందుకు జాబితాలను తయారు చేసి ఆయా శాఖల విభాగాధిపతులకు ఇచ్చేందుకు చూస్తున్నారు. వచ్చే స్థానిక ఎన్నికల సమయానికి వీరి ద్వారా గ్రామాల్లో పనులు చేయించుకుని ప్రజలకు చేరువ కావాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
కానరాని స్పష్టత..
వికలాంగ, మెడికల్ గ్రౌండ్, స్పౌజ్ వంటి వాటిని పరిగణలోకి తీసుకుని ముందుగా ఇలాంటి వారందరికీ బదిలీల్లో ప్రాధాన్యత ఇస్తున్నట్లు ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల్లో ఉంది. కానీ, మిగతా ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ఎటువంటి విధానం అనుసరిస్తారో అనేదానిపై స్పష్టత లేదు. ఏ స్థానం నుంచి ఏ స్థానం కావాలో ఇంతవరకు అడగలేదు. సాధారణంగా మూడు నుంచి ఐదు స్థానాలకు వరకు ప్రాధాన్యత క్రమంలో పెట్టుకునేందుకు ఉద్యోగులకు అవకాశం కల్పిస్తారు. కానీ, సచివాలయ ఉద్యోగులకు ఈ వెసులుబాటు కల్పించలేదు. రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని రిక్వస్ట్ బదిలీ కోరుకున్న వారికి మాత్రం ఐదు స్థానాలను క్రమపద్ధతిలో పెట్టుకోవాలని ఓ ఫార్మెట్‌ను పంపించారు. అయితే, ఐదేళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న వారిని ఆయా శాఖల విభాగాధిపతులు ఖాళీగా ఉన్న స్థానాల ప్రకారం బదిలీ చేయనున్నారా? లేదా ఆయా శాఖల కార్యాలయాలకు పిలిపించి ఖాళీలను బట్టి స్థానాలను కోరుకోమంటారా? లేక ప్రజా ప్రతినిధులు సూచించిన విధంగా నడుచుకుంటారా? అనేదానిపై ఇంతవరకు స్పష్టత లేదు. శాఖల వారిగా ఖాళీలను బట్టి బదిలీలు చేపడితే అన్యాయం జరిగే అవకాశం ఉందని చాలా మంది ఉద్యోగులు భయపడుతున్నారు.