Share News

should be returned తిరిగి ఇచ్చేయాలి

ABN , Publish Date - Nov 17 , 2025 | 11:50 PM

should be returned జిందాల్‌ పరిశ్రమ భూ సేకరణలో భూములు కోల్పోకుండా నష్టపరిహారం పొందిన వారి నుంచి రికవరీ చేసేందుకు తొలి అడుగుపడింది. వారందరికీ శనివారం నుంచి నోటీస్‌లు జారీ చేసేందుకు రెవెన్యూ అధికారులు ఉపక్రమించారు.

should be returned తిరిగి ఇచ్చేయాలి

తిరిగి ఇచ్చేయాలి

జిందాల్‌ బినామీల నుంచి సొమ్ము రికవరీ దిశగా రెవెన్యూ అడుగులు

అప్పట్లో భూములు ఇవ్వనప్పటికీ అక్రమంగా నష్టపరిహారం పొందిన 12మంది

ఫిర్యాదు చేసిన లోక్‌సత్తా పార్టీ

రూ.36.10లక్షలు చెల్లింపులు జరిగినట్లు తేల్చిన ఏసీబీ

కలెక్టర్‌ ఆదేశాలతో ఆర్‌ఆర్‌ చట్టప్రకారం చర్యలకు దిగిన తహసీల్దార్‌

తాజాగా నోటీసులు జారీ

జిందాల్‌ పరిశ్రమ భూ సేకరణలో భూములు కోల్పోకుండా నష్టపరిహారం పొందిన వారి నుంచి రికవరీ చేసేందుకు తొలి అడుగుపడింది. వారందరికీ శనివారం నుంచి నోటీస్‌లు జారీ చేసేందుకు రెవెన్యూ అధికారులు ఉపక్రమించారు. గ్రామ రెవెన్యూ సిబ్బంది చిరునామాలను వెతుకుతున్నారు. నోటీస్‌లు అందుకున్న ఏడు రోజుల్లోగా తీసుకున్న మొత్తాన్ని వారు ప్రభుత్వానికి జమచేయాలి. ఈ వ్యవహారంపై అప్పట్లో లోక్‌సత్తా పార్టీ ఫిర్యాదు చేయడంతో ఏసీబీ రంగంలోకి దిగి రూ.36.10లక్షలు చెల్లింపులు జరిగినట్లు తేల్చింది. 17 ఏళ్ల కిందట జరిగిన ఈ వ్యవహారాన్ని కొలిక్కి తెచ్చే పనిలో రెవెన్యూ శాఖ నిమగ్నమైంది.

శృంగవరపుకోట, నవంబరు 17(ఆంధ్రజ్యోతి):

జిందాల్‌ భూ సేకరణలో భూములు ఇవ్వకుండానే ఇద్దరు రూ. 5లక్షల చొప్పున, ఒకరు రూ.4.80లక్షలు, ముగ్గురు రూ.3లక్షలు, ఒకరు రూ.2.40 లక్షలు, ముగ్గురు రూ.2లక్షలు, ఒకరు రూ.1.98 లక్షలు, మరొకరు రూ.1.92 లక్షలు ఇలా మొత్తం 12 మంది బినామీలు రూ.36.10లక్షల నష్టపరిహారాన్ని అక్రమంగా పొందారు. అప్పట్లో జరిగిన తప్పును సరిదిద్దేపనిలో రెవెన్యూ శాఖ పడింది. వీరందరికీ శనివారం నుంచి నోటీస్‌లు జారీ చేసేందుకు ప్రయత్నిస్తోంది.

శృంగవరపుకోట మండలం కిల్తంపాలెం, చీడిపాలెం, ముషిడిపల్లి, చినఖండేపల్లి, మూలబొడ్డవర గ్రామాల పరిధిలోని 1166 ఎకరాలను జిందాల్‌ సౌత్‌ వెస్ట్‌ అల్యూమినియం లిమిటెడ్‌కు 17 ఏళ్ల కిందట కేటాయించారు. అప్పట్లో భూములను కోల్పోనప్పటికీ 12మంది రైతులు జిందాల్‌కు కేటాయించిన భూముల్లో తమ భూములు కూడా ఉన్నాయని తప్పుడు పత్రాలతో రూ.36.10లక్షలు పొందారు. దీంతో నిజమైన రైతులకు అన్యాయం జరిగింది. ఈ విషయం బయటకు పొక్కడంతో లోక్‌సత్తాపార్టీ వ్యవస్థాపకుడు జయప్రకాష్‌ నారాయణ రిటైర్డ్‌ రెవెన్యూ అధికారులతో కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ పూర్తిస్థాయిలో విచారించిన తరువాత బినామీల పేరుతో వీరంతా సొమ్మును అక్రమంగా తీసుకున్నారని నిర్ధారించింది. దీంతో ఈ అంశాన్ని అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్న జయప్రకాష్‌ నారాయణ శాసనసభలో ప్రస్తావించారు. అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వంలో రెవెన్యూ శాఖామంత్రిగా ఉన్న ధర్మాన ప్రసాదరావు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)అధికారులకు విచారణ బాధ్యత అప్పగించారు. ఈశాఖ అధికారులు తప్పు జరిగినట్లు గుర్తించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆ ప్రభుత్వానికి నివేదించారు. ఆర్‌ఆర్‌ (రెవెన్యూ రికవరీ) చట్టం ప్రయోగించాలని సూచించారు. ఇంత జరిగినా చర్యలు లేవు. ఆ తర్వాత కూడా పట్టించుకోకపోవడంతో ఈ విషయం మరుగున పడిపోయింది. మళ్లీ ఇన్నాళ్లకు కీలక అడుగు పడింది. వారి నుంచి సొమ్మును తిరిగి రాబట్టేందుకు రెవెన్యూ అధికారులు అడుగు వేసారు. భూములను తీసుకున్న జిందాల్‌ యాజమాన్యం ఇంతవరకు ఇక్కడ ఎటువంటి పరిశ్రమ నిర్మించలేదు. భూములన్నింటినీ ఖాళీగా ఉంచేసింది.

నోటీసులు జారీ చేశాం

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బినామీలకు నోటీస్‌లు జారీ చేశాం. నోటీస్‌ అందుకున్న ఏడు రోజుల్లో వారు జిందాల్‌ నుంచి అక్రమంగా పొందిన సొమ్మును ప్రభుత్వానికి చెల్లించాలి. ఆర్‌ఆర్‌ ( రెవెన్యూ రికవరీ) చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటున్నాం.

- డి.శ్రీనివాసరావు, తహసీల్దార్‌, శృంగవరపుకోట

Updated Date - Nov 17 , 2025 | 11:50 PM