రెవెన్యూలో తహసీల్దార్ల కొరత
ABN , Publish Date - Dec 27 , 2025 | 12:25 AM
ఎంతో కీలకమైన రెవెన్యూశాఖలో తహసీల్దార్ల కొరత నెలకొంది. ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ నుంచి గ్రామ రెవెన్యూ కార్యదర్శి వరకూ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
-డీఆర్వో పోస్టు కూడా
-ఇన్‌చార్జిలతోనే పాలన
-మిగిలిన సిబ్బందిపై తప్పని పనిభారం
విజయనగరం కలెక్టరేట్, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): ఎంతో కీలకమైన రెవెన్యూశాఖలో తహసీల్దార్ల కొరత నెలకొంది. ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ నుంచి గ్రామ రెవెన్యూ కార్యదర్శి వరకూ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో ప్రసుత్తం విధులు నిర్వహిస్తున్న సిబ్బందిపై అదనపు పని భారం పడుతోంది. కొన్నిచోట్ల ఇన్‌చార్జిలతో కార్యకలాపాలు సాగిస్తున్నారు. దీనివల్ల ప్రజలకు కూడా అరకొరగా సేవలు అందుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. జిల్లాలో ఐదు మండలాల్లో తహసీల్దార్లు లేకపోవడంతో అక్కడ డిప్యూటీ తహసీల్దార్లు ఇన్‌చార్జిలుగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం భూ రీసర్వే, రికార్డుల స్వచ్ఛీకరణ, ఇళ్ల పట్టాల పంపిణీ, ఓటర్ల జాబితా తయారీ, మీసేవలో వచ్చిన దరఖాస్తులు, పీజీఆర్‌ఎస్‌కు వచ్చిన వినతుల పరిష్కారం వంటి కార్యకలాపాలు నిర్వహించాల్సి ఉంది. అయితే, తహసీల్దార్లు లేకపోవడంతో పనులు సకాలంలో జరగడం లేదు.
జిల్లాలో పరిస్థితి..
బాడంగి తహసీల్దార్‌గా పని చేసిన సుధాకర్ పదోన్నతిపై డిప్యూటీ కలెక్టర్‌గా వెళ్లిపోయారు. అక్కడ డిప్యూటీ తహసీల్దార్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. వంగర రెవెన్యూ కార్యాలయంలో సంవత్సరాల తరబడి తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ సీఎస్ డీటీ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. ఎల్.కోట తహసీల్దార్ కె.శ్రీనివాసరావుకి డిప్యూటీ కలెక్టర్‌గా పదోన్నతి రావడంతో ఇన్‌చార్జి బాధ్యతలను అక్కడి డిప్యూటీ తహసీల్దార్‌కు అప్పగించారు. దత్తిరాజేరు తహసీల్దార్ విజయకుమార్ దీర్ఘకాలిక సెలవులో ఉన్నారు. ఇక్కడి ఇన్‌చార్జిగా గంట్యాడ హెచ్‌డీటీ హరికిరణ్ వ్యవహరిస్తున్నారు. కొత్తవలస తహసీల్దార్ అప్పలరాజును నెల రోజుల కిందట కలెక్టర్ రామసుందర్ రెడ్డి సస్పెండ్ చేయడంతో అక్కడి డిప్యూటీ తహసీల్దార్ సునీతకు ఇన్‌చార్జి బాధ్యతలను అప్పగించారు. చాలా మండలాల్లో సీనియర్, జూనియర్ అసిస్టెంటు పోస్టులు, ఆఫీసు సబార్డునేటర్లు వంటి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. చీపురుపల్లి భూసేకరణ యూనిట్ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ పోస్టుతోపాటు జిల్లా రెవెన్యూ అధికారి పోస్టు కూడా ఖాళీగా ఉన్నాయి. డీఆర్వోగా పని చేసిన శ్రీనివాస్ మూర్తి గత నెలలో ఉద్యోగి విరమణ చేయడంతో ఆయా బాధ్యతలను కేఆర్‌ఆర్‌సీ డిప్యూటీ కలెక్టర్ మురళికి ప్రభుత్వం అప్పగించింది. ఇప్పటికైనా రెవెన్యూ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు.