Short sarykoot in Kasturba school కస్తూర్బా పాఠశాలలో షార్ట్ సర్య్కూట్
ABN , Publish Date - Jun 25 , 2025 | 11:42 PM
Short sarykoot in Kasturba school తుమ్మికాపల్లి పంచాయతీ పరిధిలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో బుధవారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం జరిగింది. విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చునని భావిస్తున్నారు. రూ.12 లక్షల వరకు ఆస్తినష్టం ఉంటుందని అగ్నిమాపక అధికారులు అంచనా వేశారు.
కస్తూర్బా పాఠశాలలో షార్ట్ సర్య్కూట్
280 పరుపులు దగ్ధం
రూ.12 లక్షల వరకు ఆస్తి నష్టం
స్పందించిన విద్యాశాఖ మంత్రి లోకేశ్, మరో మంత్రి శ్రీనివాస్
కొత్తవలస, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): తుమ్మికాపల్లి పంచాయతీ పరిధిలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో బుధవారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం జరిగింది. విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చునని భావిస్తున్నారు. రూ.12 లక్షల వరకు ఆస్తినష్టం ఉంటుందని అగ్నిమాపక అధికారులు అంచనా వేశారు.
పాఠశాల మొదటి అంతస్తులో ఇంటర్ విద్యార్థులకు సంబంధించిన స్టోర్ రూంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పాఠశాల విద్యార్థినుల కోసం ఒక స్వచ్ఛంద సంస్థ మంగళవారం సాయంత్రం విరాళంగా ఇచ్చిన 280 పరుపులు పూర్తిగా కాలిపోయాయి. విద్యార్థులు తమ సామగ్రిని భద్రపర్చుకునే ఐరన్ బాక్సులు, వాటిలో ఉంచుకున్న పుస్తకాలు, దుస్తులు కూడా కాలిపోయాయి. వీటి విలువ సుమారు రూ.12 లక్షల ఉండొచ్చునని భావిస్తున్నారు. బుఽధవారం తెల్లవారుజాము 3 గంటల సమయంలో స్టోర్ రూం నుంచి పొగలు రావడంతో కొంత మంది విద్యార్థులు చూసి ప్రిన్సిపాల్ విజయకుమారికి చెప్పారు. ఆమె వెంటనే స్థానిక అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు. వారొచ్చి మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. ఎస్‌ఐ అశోక్ కుమార్ శృంగవరపుకోట అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో మరో ఫైరింజన్ వచ్చింది. తెల్లవారుజాము నుంచి ఉదయం 8 గంటల వరకు రెండు ఫైరింజన్‌ల సాయంతో మంటలను అదుపు చేశారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగి ఉంటుందని అగ్నిమాపకాధికారి అశోక్‌కుమార్ తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో విద్యార్థులందరూ గ్రౌండ్‌ఫ్లోరులో ఉన్నారని ప్రిన్సిపాల్ విజయకుమారి తెలిపారు. అగ్నికీలలు మిగిలిన గదులకు విస్తరించలేదు.
స్పందించిన విద్యాశాఖ మంత్రి లోకేశ్
అగ్నిప్రమాదం జరిగిన విషయాన్ని తెలుసుకున్న విద్యాశాఖ మంత్రి నారాలోకేశ్ ప్రమాదంలో కోల్పోయిన సామగ్రి, పుస్తకాలు, దుస్తులు వెంటనే సమకూర్చే ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. మళ్లీ ఇటువంటి సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఆరా తీసిన మంత్రి శ్రీనివాస్
విజయనగరం, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): కస్తూర్బా బాలికల విద్యాలయంలో షార్ట్ సర్య్కూట్‌పై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పందిం చారు. ఆయన ఢిల్లీ పర్యటనలో ఉండడంతో అధికారులకు ఫోన్ తీసి ఘటనపై ఆరా తీశారు. విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా చూడాలని సర్వశిక్షా అభియాన్ ఏపీసీ రామారావును ఆదేశించారు.
విద్యార్థులను పరామర్శించిన ఎమ్మెల్యే
కస్తూర్బా పాఠశాలలో అగ్ని ప్రమాద విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి పాఠశాలకు వచ్చి విద్యార్థినులకు ధైర్యం చెప్పారు. ప్రమాద కారణాలపై ప్రిన్సిపాల్‌ను అడిగి తెలుసుకున్నారు. డీఈవో మాణిక్యంనాయుడు కూడా వెళ్లి పరిస్థితులను సమీక్షించారు. ఆయన వెంట సమగ్ర శిక్ష ఏసీపీ రామారావు ఉన్నారు.