Share News

వారంలోగా షాపులు ఖాళీ చేయాలి

ABN , Publish Date - Jul 23 , 2025 | 12:11 AM

వారం రోజు ల్లో షాపులన్నీ ఖాళీ చేయాలని దేవదాయశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ శిరీష.. పట్టణంలోని కేర్‌ ఆసుపత్రి సమీపంలో గల వ్యాపారులకు ఆదేశించారు.

వారంలోగా షాపులు ఖాళీ చేయాలి
నిషేధిత జాబితాలో చేరిన భూముల వివరాలను పరిశీలిస్తున్న దేవదాయ శాఖ ఏసీ శిరీష

రాజాం రూరల్‌, జూలై 22 (ఆంధ్రజ్యోతి): వారం రోజు ల్లో షాపులన్నీ ఖాళీ చేయాలని దేవదాయశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ శిరీష.. పట్టణంలోని కేర్‌ ఆసుపత్రి సమీపంలో గల వ్యాపారులకు ఆదేశించారు. మూసి ఉన్న షాపులపై నోటీసులు అంటించారు. మంగళవారం ఆమె దేవదాయ శాఖ ఈవోలు బీవీ మాధవరావు, పొన్నాడ శ్యామలరావు, సిబ్బందితో కలిసి కేర్‌ ఆసుపత్రి సమీపంలోని షాపింగ్‌ కాంప్లెక్స్‌లను పరిశీలించారు. డోలపేటలోని ఉమామహేశ్వ ర లక్ష్మీనారాయణస్వామి దేవస్థానానికి చెందిన కోట్లాది రూపాయలు విలువచేసే భూముల్లో షాపింగ్‌ కాంప్లెక్స్‌లు నిర్మించి దేవదాయశాఖ ఆదాయానికి గండికొట్టారని ఆమె విలేకర్లకు చెప్పారు. డోలపేట ప్రాంతంలో నివాసగృహాల యజమానులతో కూడా చర్చించామని, దేవదాయ శాఖకు చెందిన భూముల్లో నిర్మించిన భవంతులను ఖాళీ చేయిం చాలని ఆయా భవంతుల్లో ఉన్నవారికి స్పష్టం చేశామని ఆమె తెలిపారు. వారం రోజుల గడువు తర్వాత షాపులు ఖాళీ చేయకపోతే పొలీసుల సహాయంతో తామే ఖాళీ చేయించి వేలంపాట నిర్వహిస్తామని ఆమె ప్రకటించారు. ఇదిలా ఉంటే ఇదే ప్రాంతంలో నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మించిన ఓ షాపునకు తాళాలు వేసి సీజ్‌ చేశారు.

నిషేధిత జాబితాలో చేరిన ప్రాంతాల పరిశీలన

పట్టణంలోని నిషేధిత జాబితాలో చేరిన భూములు, భవనాలను దేవదాయశాఖ ఏసీ శిరీష మంగళవారం పరిశీలించారు. రాజాం మున్సిపాలిటీలోని సారధి రెవెన్యూ గ్రామ పరిధిలో గల ఠాణావీధి, కస్పావీధి, ఆశపు వీధి, అగ్రహారం వీధి తదితర ప్రాంతాలు నిషేధిత జాబితాలో చేరాయి. ఈ ప్రాంతంలో ఉమారామలింగేశ్వర స్వామి దేవస్థానం ఉండడంతో గతంలో ఆయా ప్రాంతాల భూములన్నీ నిషేధిత జాబితాలో చేర్చారు. ఈ ప్రాంతాల్లో ఉమా రామలింగేశ్వర దేవస్థానానికి చెందిన ఆలయాలు, స్థలాల హద్దులను మున్సిపల్‌ సర్వేయర్‌ సత్యనారాయణ తో గుర్తించారు. నిషేధిత జాబితాలో ఆస్తులు చేరినవారికి న్యాయం చేస్తామని ఆమె హామీ ఇచ్చారు.

Updated Date - Jul 23 , 2025 | 12:11 AM