Shock for YCP in Bobbili బొబ్బిలిలో వైసీపీకి షాక్
ABN , Publish Date - Apr 29 , 2025 | 11:45 PM
Shock for YCP in Bobbili బొబ్బిలి మున్సిపల్ చైర్మన్ సావు వెంకటమురళీకృష్ణారావుపై సొంత పార్టీ (వైసీపీ)కౌన్సిలర్లతో పాటు పది మంది టీడీపీ కౌన్సిలర్లు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది.
బొబ్బిలిలో వైసీపీకి షాక్
మాజీగా మారిన మున్సిపల్ చైర్మన్ సావు
టీడీపీ ఖాతాలో చేరిన బొబ్బిలి మున్సిపాలిటీ
ఆఖరి నిమిషం దాకా కొనసాగిన ఉత్కంఠ
బొబ్బిలి, ఏప్రిల్ 29(ఆంధ్రజ్యోతి): బొబ్బిలి మున్సిపల్ చైర్మన్ సావు వెంకటమురళీకృష్ణారావుపై సొంత పార్టీ (వైసీపీ)కౌన్సిలర్లతో పాటు పది మంది టీడీపీ కౌన్సిలర్లు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. ప్రిసైడింగ్ అధికారి ఆర్డీవో జేవీఎస్‌ఎస్ రామ్మోహనరావు ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన మున్సిపల్ కౌన్సిల్ ప్రత్యేక సమావేశంలో అవిశ్వాసంపై ఓటింగ్ నిర్వహించారు. అవిశ్వాసానికి అనుకూలంగా పదిమంది టీడీపీ కౌన్సిలర్లు, తొమ్మిది మంది వైసీపీ రెబల్ కౌన్సిలర్లు, ఒక ఇండిపెండెంట్ కౌన్సిలరుచేతులెత్తి తమ నిర్ణయాన్ని తెలిపారు. వీరితో పాటు ఎక్స్ అఫీషియో సభ్యుడైన ఎమ్మెల్యే బేబీనాయన కూడా అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేయడంతో మొత్తం 21 మంది సభ్యులు చైర్మన్‌కు వ్యతిరేకంగా అవిశ్వాసానికి మద్దతు తెలిపారు. ఆ తరువాత అవిశ్వాసానికి వ్యతిరేకంగా ఎవరెవరు మద్దతు పలుకుతున్నారని ప్రిసైడింగ్ అధికారి అడిగారు. పది మంది వైసీపీ కౌన్సిలర్లు అవిశ్వాసానికి వ్యతిరేకంగా చేతులెత్తారు. అవిశ్వాసానికి అనుకూలంగా, వ్యతిరేకంగా చేతెలెత్తిన వారిని ఆర్డీవో రెండు సార్లు లెక్కించారు. తొలుత వైసీపీ పట్టణ అధ్యక్షుడు, ఒకటో వార్డు కౌన్సిలరు చోడిగంజి రమేష్‌నాయుడు నిలబడి మాట్లాడడానికి ప్రయత్నించారు. తాను నిబంధనల ప్రకారం నడుచుకుంటానని, అంతా క్రమపద్ధతిలోనే జరుగుతుందని, మీరు కూర్చోవాలని ప్రిసైడింగ్ అధికారి ఆదేశించారు.
-- అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు కీలకంగా వ్యవహరించిన ఇండిపెండెంట్ కౌన్సిలరు వాడపల్లి వనజాకుమారికి ప్రత్యేకంగా కుర్చీ ఏర్పాటు చేయడాన్ని మరో కౌన్సిలరు చోడిగంజి ప్రశ్నించారు. ఆమె ప్రస్తుతం వైసీపీలోనే కొనసాగుతున్నందున వేరుగా సీటును ఎందుకు కేటాయించారన్నది చోడిగంజి వాదన. ఈ అభ్యంతరాన్ని పీవో కొట్టిపారేశారు. అంతా నిబంధనల ప్రకారమే జరుగుతుందని, ఇందులో ప్రసంగాలకు తావులేదని అన్నారు.
-- మున్సిపల్ చట్టం ప్రకారం నిర్వహించిన ఓటింగ్ ప్రక్రియలో అవిశ్వాసానికి అనుకూలంగా 21 మంది, వ్యతిరేకంగా 10 మంది ఓటు వేసినట్లు ప్రిసైడింగ్ అధికారి రామ్మోహనరావు ప్రకటించారు. ఈ ఓటింగ్ ప్రకారం అవిశ్వాస తీర్మానం నెగ్గిందని వెల్లడించారు. అధికారికంగా ప్రకటన వెలువడగానే ఎమ్మెల్యే బేబీనాయనతో సహా 20 మంది కౌన్సిలర్లు బల్లలు చరిచి హర్షం వ్యక్తంచేశారు. ఓటింగ్ అనంతరం వైసీపీకి చెందిన పది మంది కౌన్సిలర్లు(చైర్మన్ సావుతో సహా) సమావేశం హాలు నుంచి బయటకు వెళ్లిపోయారు. మిగిలిన పది మంది టీడీపీ, పదిమంది వైసీపీ రెబల్ కౌన్సిలర్లు, ఎక్స్‌ఆఫీషియో సభ్యుడైన ఎమ్మెల్యే నుంచి సంతకాలను సేకరించి అవసరమైన లాంఛనాలను ప్రిసైడింగ్ అధికారి పూర్తిచేశారు.
పార్టీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు
మున్సిపల్ చైర్మన్‌పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో ఇరుపార్టీలకు చెందిన కౌన్సిలర్లు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా పెద్దసంఖ్యలో మున్సిపల్ కార్యాలయానికి చేరుకొని కేరింతలు కొట్టారు. బాణాసంచా పేల్చి హర్షాతిరేకాలను వ్యక్తం చేశారు. బొబ్బిలి డీఎస్‌పీ జి.భవ్య ఆధర్యంలో సీఐ కటకం సతీష్‌కుమార్, ఇతర పోలీసు సిబ్బంది ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహించారు.
- అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన ప్రత్యేక సమావేశానికి 25 నిమిషాలు ముందుగా ఎమ్మెల్యే బేబీనాయన, బుడా చైర్మన్ తెంటు లక్ష్మునాయుడు నాయకత్వంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రెండు బస్సుల్లో కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. టీడీపీకి చెందిన పదిమంది కౌన్సిలర్లు ఓ బస్సులో, వైసీపీ అసమ్మతి కౌన్సిలర్లు మరో బస్సులో సమావేశానికి చేరుకున్నారు. ఆ తరువాత కొద్ది సేపటికి వైసీపీ తిరుగుబాటు కౌన్సిలర్లు పదిమంది కలిసి వేరుగా సమావేశానికి చేరుకున్నారు.
- అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొన్న చైర్మన్ సావు వెంకటమురళీకృష్ణారావు, ఇద్దరు వైస్‌చైర్మన్లు, ఏడుగురు వైసీపీ కౌన్సిలర్లు కలిసి కౌన్సిల్ సమావేశం హాలులోకి కలిసికట్టుగా ఆఖరున చేరుకున్నారు. ఎవరికి కేటాయించిన సీట్లలో వారి పేర్లు కలిగిన బోర్డులను ఏర్పాటుచేశారు. ముందు వరుసలో తన సీటు ఉంటుందని భావించిన చైర్మన్ సావు అక్కడ సీటు కనిపించకపోవడంతో కంగారుపడడం కనిపించింది. ఆఖరి వరుసలో తన సీటు ఉన్నట్టు గమనించి అక్కడికి వెళ్లి కూర్చున్నారు. ఆ తరువాత ప్రిసైడింగ్ అధికారి హాలులోకి చేరుకొని ఓటింగ్ ప్రక్రియకు సంబంధించిన లాంఛనాలను పూర్తిచేశారు.
‘ఆంధ్రజ్యోతి’ అప్పుడే చెప్పింది..
బొబ్బిలి, ఏప్రిల్ 29 (ఆంధ్రజ్యోతి):
బొబ్బిలి మున్సిపల్ చైర్మన్ సావు వెంకటమురళీకృష్ణారావుకు పదవీ గండం ఉందని మార్చి 7న ‘ఆంధ్రజ్యోతి’లో ‘మార్పు ఉంటుందేమో? శీర్షికన ప్రచురితమైన కథనం మంగళవారం నిజమైంది. వైసీపీకి చెందిన పదిమంది కౌన్సిలర్లు తొలుత అవిశ్వాస తీర్మానం పెట్టాలని నిర్ణయించుకొని అందుకు సంబంధించిన ప్రొఫార్మాలో సంతకాలు చేశారు. దీని ఆధారంగానే ఆంధ్రజ్యోతిలో గత నెలలో వార్త ప్రచురితమైంది. అప్పట్లో కొంతమంది వైసీపీ నాయకులు దీనిపై రుసరుసలాడారు. పూర్తి అవాస్తవమని, అవిశ్వాసానికి ఎటువంటి ఆస్కారం లేదని కొట్టిపారేశారు. మంగళవారం జరిగిన మున్సిపల్ కౌన్సిల్ ప్రత్యేక సమావేశంలో అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో చైర్మన్ సావు పదవిని కోల్పోయారు. ఆంధ్రజ్యోతి కథనాలు వాస్తవికతను చాటాయని పలువురు పాఠకులు అభినందించారు.