Share News

Shivering When It Rains! వానొస్తే వణుకే!

ABN , Publish Date - Oct 06 , 2025 | 12:29 AM

Shivering When It Rains! కురుపాం నియోజకవర్గంలో బాసంగి, కళ్లికోట నిర్వాసిత గ్రామాల పరిస్థితి దయనీయంగా మారింది. వర్షం కురిస్తే చాలు ఆ ప్రాంతవాసులు ముంపు సమస్యను ఎదుర్కోవల్సి వస్తోంది. ఎగువ ప్రాంతం ఒడిశా రాష్ట్రంలో వానలు పడినా వారికి ఇక్కట్లు తప్పడం లేదు.

Shivering When It Rains! వానొస్తే వణుకే!
వరద నీటిలో ఉన్న బాసంగి గ్రామం (ఫైల్‌)

  • తుపాన్ల సమయంలో చుట్టు ముడుతున్న వరద

  • ఇబ్బందుల్లో తోటపల్లి నిర్వాసితులు

  • శిథిలావస్థ ఇళ్లలో బిక్కుబిక్కుమంటూ జీవనం

  • అనేక సమస్యలతో బాసంగి, సుంకి వాసులు సతమతం

  • రాష్ట్ర ప్రభుత్వంపైనే ఆశలు

జియ్యమ్మవలస, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి): కురుపాం నియోజకవర్గంలో బాసంగి, కళ్లికోట నిర్వాసిత గ్రామాల పరిస్థితి దయనీయంగా మారింది. వర్షం కురిస్తే చాలు ఆ ప్రాంతవాసులు ముంపు సమస్యను ఎదుర్కోవల్సి వస్తోంది. ఎగువ ప్రాంతం ఒడిశా రాష్ట్రంలో వానలు పడినా వారికి ఇక్కట్లు తప్పడం లేదు. నాగావళి నది వరద ఈ గ్రామాల్లోకి పోటెత్తడంతో బిక్కుబిక్కు మంటూ శిథిలావస్థ ఇళ్లలోనే ఉండాల్సిన దుస్థితి. కొన్నేళ్లుగా వారు ఇలా ఇబ్బందులు పడుతున్నా.. పట్టించుకునే వారే కరువయ్యారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంపైనే కొండంత ఆశలు పెట్టుకున్నారు.

ఇదీ పరిస్థితి..

- జియ్యమ్మవలస మండలం నాగావళి నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న బాసంగిని 2004-05 లో తోటపల్లి నిర్వాసిత పంచాయతీగా ప్రకటించారు. ఈ గ్రామంలో 384 కుటుంబాలు ఉండగా.. వీరికి ప్యాకేజీ, భూములకు విలువ కట్టి నిధులు ఇచ్చేశారు. కానీ పునరావాసం కల్పించడం మాత్రం మరిచిపోయారు. వారికోసం బట్లభద్ర రెవెన్యూ గ్రామ పరిధిలో సర్వే నెంబర్లు 63, 65, 67/2, 69/22, 71, 72లలో 30.58 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. ఈ స్థలంలో సీసీ రోడ్లు, డ్రైన్లు, రక్షిత నీటి పథకం ట్యాంకు, విద్యుత్‌ స్తంభాలు వేశారు. గ్రామంలో 384 మందికి ఇళ్ల స్థలాలు కేటాయించి పట్టాలు కూడా సిద్ధం చేశారు. 252 మంది ఇళ్ల పట్టాలు తీసుకొని కేటాయించిన స్థలంలోకి వెళ్లిపోవడానికి నిర్ణయించుకున్నారు. కానీ ఇళ్లు మాత్రం మంజూరు చేయలేదు. దీంతో వారికి కేటాయించిన స్థలం ఇప్పుడు పిచ్చి మొక్కలతో నిండి అధ్వానంగా మారింది. ఇళ్లు మంజూరు చేస్తే తాము ఆ ప్రాంతానికి వెళ్లిపోతామని బాసంగి వాసులు చెబుతున్నారు. కాగా బాసంగిలో శిథిలావస్థ ఇళ్లలో ఉంటున్న వారికి ఏటా తుపాన్ల సమయంలో ముంపు సమస్యను ఎదుర్కోవల్సి వస్తోంది. బాసంగి ముంపు సమస్యపై తహసీల్దార్‌ వై.జయలక్ష్మిని వివరణ కోరగా.. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టిలో ఉందని తెలిపారు. ఇక గరుగుబిల్లి మండలం సుంకి పంచాయతీ పరిస్థితి దాదాపు ఇదేవిధంగా ఉంది. ఈ పంచాయతీలో మొత్తం 365 కుటుంబాలు నివస్తున్నాయి. వీరికి మరుపెంట పంచాయతీ తులసిరామినాయుడువలస సమీపంలో లేఅవుట్లు వేసి పట్టాలు మంజూరు చేశారు. కానీ ఇళ్లు మంజూరు చేయలేదు.

- వాయుగుండం ప్రభావంతో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బాసంగి, కళ్లికోట ప్రాంతాలను వరద చుట్టుముట్టింది. దీంతో ఆ ప్రాంతవాసులు రెండు, మూడు రోజుల పాటు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కాగా ఆయా గ్రామాలను పరిశీలించిన ప్రభుత్వ విప్‌ జోయక జగ దీశ్వరి ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని, నిర్వాసితులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. సమస్యలన్నీ పరిష్కరిస్తామని తెలపడంతో నిర్వాసితుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. త్వరితగతిన తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.

Updated Date - Oct 06 , 2025 | 12:29 AM