Share News

చోరీ కేసులో ఏడు తులాల బంగారం స్వాధీనం

ABN , Publish Date - Dec 16 , 2025 | 12:24 AM

మండలంలోని రామస్వామిపేట, వావిలపాడు గ్రామాల్లో చోరీకి గురైన ఏడు తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు నిందితుడిని పట్టుకున్నట్టు ఎస్‌.కోట రూరల్‌ సీఐ లగుడు అప్పలనాయుడు తెలిపారు.

చోరీ కేసులో ఏడు తులాల బంగారం స్వాధీనం

వేపాడ, డిసెంబరు 15(ఆంధ్రజ్యోతి): మండలంలోని రామస్వామిపేట, వావిలపాడు గ్రామాల్లో చోరీకి గురైన ఏడు తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు నిందితుడిని పట్టుకున్నట్టు ఎస్‌.కోట రూరల్‌ సీఐ లగుడు అప్పలనాయుడు తెలిపారు. సోమవారం వల్లంపూడి పోలీస్‌ స్టేషన్‌ లో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. వల్లంపూడి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని రామస్వామిపేట, వావిలపాడు, వల్లంపూడి గ్రామాల్లో కిందటి నెలలో జరిగిన దొంగతనాలకు సంబంధించి కేసు నమోదు చేశామన్నా రు. ఈ మేరకు వల్లంపూడి ఎస్‌ఐ సుదర్శన్‌ సారథ్యంలో ప్రత్యేక టీమ్‌ ఏర్పాటు చేశామని చెప్పారు. ఎస్‌ఐ, సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి నిందితుడిని పట్టకోవడంతో పాటు చోరీకి గురైన అభరణాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. అయితే వల్లంపూడి చోరీకి సంబంధించిన బంగారం చోడవరం ముత్తూట్‌ ఫైనాన్స్‌ కంపెనీలో తాకట్టులో ఉన్నందున స్వాధీనం చేసుకోవాల్సి ఉందన్నారు. ప్రస్తుతం రామస్వామిపేట చోరీకి సంబంధించి ఐదున్నర తులాల బంగార ఆభరణాలు, వావిలపాడు గ్రామానికి సంబంధించి తులంన్నర బంగారాన్ని స్వాధీనం పర్చుకున్నట్టు తెలిపారు. ఈ దొంగతనాలకు కారుకుడైన అనకాపల్లి జిల్లా చోడవరం మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన పిల్లా నూకరాజును మండలంలోని కుమ్మపల్లి జంక్షన్‌ వద్ద మాటు వేసిపట్టుకున్నట్టు తెలిపారు. సమావేశంలో వల్లంపూడి ఎస్‌ఐ సుదర్శన్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Dec 16 , 2025 | 12:24 AM