Target టార్గెట్ అక్టోబరు 2
ABN , Publish Date - Jun 21 , 2025 | 11:48 PM
Set Target: October 2 సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ వస్తువులు, పాలిథిన్ కవర్లను ఈ ఏడాది అక్టోబరు 2 నాటికి పూర్తిగా అరికట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాలు జారీ చేశారు. జూట్, క్లాత్ బ్యాగ్‌ల వినియోగాన్ని పెంచాలన్నారు. ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.
పూర్తిగా కట్టడి చేయాలని ఆదేశించిన సీఎం
జిల్లాలో విచ్చలవిడిగా ప్లాస్టిక్ వినియోగం
కొరవడిన అధికారుల పర్యవేక్షణ
ముఖ్యమంత్రి సంకల్పం నెరవేరేనా?
పాలకొండ, జూన్ 21 (ఆంధ్రజ్యోతి): సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ వస్తువులు, పాలిథిన్ కవర్లను ఈ ఏడాది అక్టోబరు 2 నాటికి పూర్తిగా అరికట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాలు జారీ చేశారు. జూట్, క్లాత్ బ్యాగ్‌ల వినియోగాన్ని పెంచాలన్నారు. ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. 90 రోజుల్లో రీ సైక్లింగ్, చెత్తను వేరు చేయడంపై పకడ్బందీ కార్యాచరణ ప్రణాళిక ఇవ్వాలని సూచించారు. దీనిపై మున్సిపల్ పరిపాలనా విభాగం కూడా మున్సిపాలిటీలకు ఉత్తర్వులు జారీచేసింది. జిల్లాను ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దాలని సూచించింది. అయితే ఎన్నో ఏళ్లుగా ప్లాస్టిక్ నిషేధం అమలులో ఉన్నప్పటికీ దానిని అమలు చేయడంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమవుతోంది. విచ్చలవిడిగా సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ కవర్ల వినియోగం, క్రయ విక్రయాలు జరుగుతున్నా.. చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్టోబరు నాటికే సంపూర్ణ ప్లాస్టిక్ నిషేధం పూర్తిస్థాయిలో అమలవుతుందా? సీఎం సంకల్పం నెరవేరుతుందా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇది ఏ మేరకు సాధ్యమవుతుందో వేచిచూడాల్సి ఉంది.
విచ్చలవిడిగా వినియోగం
వాస్తవానికి స్వచ్ఛభారత్‌లో భాగంగా 2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వం ప్లాస్టిక్‌పై నిషేధం అమలులోకి తెచ్చింది. అయితే 2019లో అధికార పగ్గాలు చేపట్టిన వైసీపీ సర్కారు దానిని పూర్తిగా నీరుగార్చింది. దీంతో పట్టణాలు, మండలాల్లోని కాలువలు, డంపింగ్‌యార్డుల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు గుట్టల్లా పేరుకుపోయాయి. జిల్లాలో పార్వతీపురం, సాలూరు మున్సిపాలిటీలతో పాటు పాలకొండ నగర పంచాయతీలో ప్లాస్టిక్ వినియోగం అధికంగా ఉంది. మండలాల్లోనూ వాటి వాడకం ఎక్కువగానే ఉంది. పల్లె,పట్టణం తేడా లేకుండా ఎక్కడ చూసినా 80 శాతం మేర సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ కవర్ల వ్యర్థాలే దర్శనమిసున్నాయి. ప్రస్తుత రోజుల్లో టిఫిన్ షాపులు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలోనూ సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్‌నే వినియోగిస్తున్నారు. ప్రధానంగా పార్శిల్‌కు వాటినే వినియోగిస్తున్నారు. అయితే అవి వేడి వేడి ఆహార పదార్థాల్లో కలిసి శరీరంలో క్యాన్సర్ కారకులుగా మారుతున్నట్లు ఇటీవల ఓ అధ్యయనంలో తేలింది. తల్లి గర్భంలోనూ ప్లాస్టిక్ మైక్రో రేణువులు అధికంగా ఉంటున్నాయని తెలిసింది. పుట్టబోయే బిడ్డలపై కూడా ప్లాస్టిక్ ప్రభావం పడుతున్నా.. క్షేత్రస్థాయిలో వాటి నిషేధం కార్యరూపం దాల్చడం లేదు. ప్లాస్టిక్‌కు భూమిలో కరిగే స్వభావం ప్లాస్టిక్‌కు లేదు. దీంతో అది భూతాపాన్ని పెంచుతుంది. పర్యావరణానికి తీవ్ర ముప్పు పొంచి ఉన్నా.. ప్లాస్టిక్, పాలిథిన్ కవర్ల నిషేధానికి చర్యలు కానరావడం లేదు. అధికారులు తూతూ మంత్రంగా దాడులు నిర్వహించి అపరాధరుసుం విధిస్తున్నారు తప్ప శాశ్వత నిషేధానికి చేసిన ప్రయత్నాలు శూన్యమని చెప్పాలి.
ఆచరణ సాధ్యమేనా?
ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్లాస్టిక్ వస్తువులు, పాలిథిన్ కవర్లు, ఇతర సామగ్రిని నిషేధించేందుకు వర్తక వ్యాపారులతో సమావేశం నిర్వహించాల్సి ఉంది. అంతేకాకుండా సింగిల్‌యూజ్డ్ ప్లాస్టిక్‌ను తయారు చేసే యంత్రాలను తక్షణమే బ్యాన్ చేయాలి. ఇప్పటికే నిల్వ ఉన్న సామగ్రిని గుర్తించి స్వాధీనం చేసుకోవాలి. గ్రామస్థాయి నుంచి పట్టణాల వరకు ప్లాస్టిక్ వినియోగంతో జరిగే అనర్థాలపై ప్రజలకు పూర్తిస్థాయి అవగాహన కల్పించాల్సి ఉంది. ఈ చర్యలేవీ చేపట్టకుంటే నిషేధం ఒట్టిమాటగానే మిగులుతుంది.
ప్రోత్సాహకాలు ప్రకటించనున్న ప్రభుత్వం...
సింగిల్‌యాజ్డ్ ప్లాస్టిక్, పాలిథిన్ కవర్లను నిషేధించి జూట్, క్లాత్ బ్యాగ్‌లు వినియోగాలను పెంచుతూ.. అత్యుత్తమ పనితీరు కనబరిచే మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు ప్రోత్సాహకాలు ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. అక్టోబరు 2 నుంచి స్వచ్ఛతా అవార్డులు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు స్థానిక సంస్థలు, డ్వాక్రా సంఘాలు, అంగన్‌వాడీలు, పాఠశాలలు, కళాశాలలు, బస్టాండ్లు, ఆసుపత్రులు, ఎన్‌జీవోలు, వివిధ స్వచ్ఛంద సంస్థలకు అవార్డులు ఇవ్వనున్నారు.
వినియోగిస్తే కఠిన చర్యలు
సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ వస్తువులు, పాలిథిన్ కవర్లను ఎవరైనా వినియోగించినా, వి క్రయించినా కఠిన చర్యలు తప్పవు. ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దేందుకు అంతా సహకరించాలి. వ్యాపారులు, హోటల్ యజమానులు, చిరు వ్యాపారులు పాలిథిన్ కవర్ల వినియోగానికి దూరంగా ఉండాలి.
- రత్నంరాజు, కమిషనర్, పాలకొండ నగర పంచాయతీ