What About Scanning? సేవలు సరే.. మరి స్కానింగో?
ABN , Publish Date - Jul 31 , 2025 | 11:48 PM
Services Are Fine.. But What About Scanning? జిల్లాలో ప్రభుత్వాసుపత్రులకు రేడియాలజిస్ట్‌ల కొరత వేధిస్తోంది. దీంతో రోగులు స్కానింగ్‌ల కోసం పరుగులు పెట్టాల్సి వస్తోంది. దీర్ఘకాలికంగా ఈ సమస్య వేధిస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. ఆ పోస్టులను భర్తీ చేయాల్సిన రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు కూడా తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో కొన్ని సందర్భాల్లో వైద్యులే రేడియాలజిస్ట్‌ల అవతారం ఎత్తాల్సి వస్తోంది.
కొన్నిచోట్ల ప్రత్యేక వైద్య నిపుణులూ లేని వైనం
రోగులకు తప్పని ఇబ్బందులు
ఉన్నతాధికారులు స్పందించాలని విన్నపం
పార్వతీపురం, జూలై 31(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ప్రభుత్వాసుపత్రులకు రేడియాలజిస్ట్‌ల కొరత వేధిస్తోంది. దీంతో రోగులు స్కానింగ్‌ల కోసం పరుగులు పెట్టాల్సి వస్తోంది. దీర్ఘకాలికంగా ఈ సమస్య వేధిస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. ఆ పోస్టులను భర్తీ చేయాల్సిన రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు కూడా తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో కొన్ని సందర్భాల్లో వైద్యులే రేడియాలజిస్ట్‌ల అవతారం ఎత్తాల్సి వస్తోంది. పార్వతీపురం జిల్లా కేంద్రాసుపత్రితో పాటు సాలూరు ఏరియా ఆసుపత్రిలో రేడియాలజిస్ట్‌లు లేరు. దీంతో గర్భిణులు, ఇతరత్రా రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేట్ స్కానింగ్‌సెంటర్లకు అధిక మొత్తంలో చెల్లించలేక నానా అవస్థలు పడుతున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే గిరిజనుల పరిస్థితి అయితే మరింత దయనీయం. ఆర్థిక భారం కారణంగా గర్భిణులు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లలేకపోతున్నారు. కొందరు తప్పనిసరి పరిస్థితుల్లో రూ.1500 వరకూ చెల్లించి స్కానింగ్ చేయించుకోవాల్సి వస్తోంది. ప్రస్తుతం జిల్లా కేంద్రాసుపత్రిలో రోగుల అవస్థలను చూసి వైద్యులే స్కానింగ్ చేస్తున్నారు. ఇక్కడున్న రేడియాలజిస్ట్ జయరాంను సాలూరు బదిలీ చేశారు. అయితే ఆయన అక్కడ విధుల్లో చేరి సెలవుపై వెళ్లిపోయారు. పార్వతీపురం, సాలూరులో ఆయన స్థానంలో మరొకరిని నియమించకపోవడంతో రోగులకు ఇక్కట్లు తప్పడం లేదు. పాలకొండలో మాత్రం ఇటీవల రేడియాలజిస్ట్ విధుల్లో చేరారు.
వేధిస్తున్న వైద్యుల కొరత
జిల్లా కేంద్ర ఆసుపత్రిలో గుండె వైద్య నిపుణులను నియమించాల్సి ఉంది. ఈ సమస్యను పరిష్కరిస్తామని గతంలో ఈ ప్రాంతంలో పర్యటించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ హామీ ఇచ్చారు. కానీ నేటికీ ఎవర్నీ నియమించలేదు. పాలకొండలో ఒకటి, సీతంపేట ఏరియా ఆసుపత్రిలో రెండు గైనకాలజిస్ట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కురుపాం ఆసుపత్రిలో పనిచేయాల్సిన ఓ వైద్యుడు డిప్యుడేషన్‌పై పాడేరులో విధులు నిర్వహిస్తున్నారు. జీతం మాత్రం పార్వతీపురం మన్యం జిల్లా నుంచి అందుకుంటున్నారు. అయితే కురుపాంలో రోగులకు మాత్రం ఆర్థోపెడిక్ సేవలు అందడం లేదు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని జిల్లావాసులు కోరుతున్నారు.
రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలు
రేడియాలజిస్ట్ లేనప్పటికీ రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందిస్తున్నాం. వైద్య సిబ్బందితో స్కానింగ్ తీసి చికిత్స అందిస్తున్నాం. గిరిజన ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా మెరుగైన వైద్య సేవలందిస్తున్నాం.
- నాగశివజ్యోతి, జిల్లా కేంద్రాసుపత్రి సూపరింటెండెంట్, పార్వతీపురం